ఎమ్బీయస్‌ : ఇది చెంపదెబ్బ కాదు…3

ఇందిరా గాంధీ బలపడిన తర్వాత కాంగ్రెసు పార్టీ ఆమె చుట్టూ తిరగసాగింది. పార్టీలో, ప్రభుత్వంలో ఎందరు మేధావులున్నా,  ఎందరు సమర్థులున్నా అంతా ఆమె యిష్టప్రకారమే జరిగేది. ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది.…

ఇందిరా గాంధీ బలపడిన తర్వాత కాంగ్రెసు పార్టీ ఆమె చుట్టూ తిరగసాగింది. పార్టీలో, ప్రభుత్వంలో ఎందరు మేధావులున్నా,  ఎందరు సమర్థులున్నా అంతా ఆమె యిష్టప్రకారమే జరిగేది. ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది. చెపితే వాళ్ల కెరియర్‌ ఆఖరు. అంతా ఆమె పేరుమీదుగానే జరగడంతో ప్రజల్లో కూడా మంచైనా, చెడైనా ఇందిర చేసిందనే అనేవారు. జనతా పార్టీ 1977-79 వరకు పాలించినప్పుడు యీ పరిస్థితి లేదు. ఏం జరిగినా మొరార్జీయే చేశాడనలేదు. కాబినెట్‌లో ఎందరో ప్రతిభామూర్తులు. ఎవరి సత్తా వారు చూపించారు. ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ విధంగానే వాజపేయి, ఆడ్వాణీ, మధు దండవతే, ఫెర్నాండెజ్‌, చరణ్‌ సింగ్‌ల గుణగణాలు, ఆలోచనా విధానాలు ప్రజలకు తెలిశాయి. దురదృష్టవశాత్తూ ఆ బహుళనాయకత్వం చాలాకాలం సాగలేదు. అందుచేత ప్రభుత్వం నాలుగుకాలాల పాటు మనుగడ సాగించాలంటే ఏకోన్ముఖమైన నాయకత్వం వుండాల్సిందే అనే వాదన బయలుదేరి, మళ్లీ ఇందిరకు పట్టం కట్టారు. ఇక అప్పణ్నుంచి ఇందిర, రాజీవ్‌, పివి, తెర వెనుక నుంచి సోనియా – సొంత నిర్ణయాలతోనే నడిపారు. మధ్యలో వచ్చిన యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలలో నాయకులు ఎక్కువై పోయి పూర్తికాలం వుండలేకపోయాయి. ఎన్‌డిఏ తరఫున వాజపేయి ప్రధానిగా వుండగా ఏకవ్యక్తి పాలనగా కాకుండా  మళ్లీ బహుళనాయకత్వంలోనే నడిచింది. మంత్రులకు గుర్తింపు లభించింది. పార్టీలో కూడా వాజపేయి-ఆడ్వాణీ కృష్ణార్జునుల్లా ప్రథమశ్రేణిలో వున్నా, మురళీమనోహర్‌ జోషి, రాజ్‌నాథ్‌ సింగ్‌, సుష్మా స్వరాజ్‌ వంటి అనేకులు ప్రముఖస్థానాల్లో వున్నారు. మోదీకి కూడా తన ప్రతిభ చూపే అవకాశం యిచ్చారు. వాజపేయికి జీహుజూర్‌ అనే వాళ్లే పార్టీలో వుండాలన్న ధోరణి కనబడలేదు.

ఇప్పటి బిజెపిలో అది మారింది. ఎటు చూసినా మోదీ-అమిత్‌ మాత్రమే కనబడుతున్నారు. పేరుకి యిద్దరు కానీ రాముడు, పరశురాముడులా యిద్దరిలో వున్నది మోదీ ఒక్కడే. అతను ఏం తలచుకుంటే అదే జరుగుతోంది. ఏం జరిగినా అతని ఘనతే అనే ప్రచారం సాగుతోంది. వర్షం కురిసినా మోదీ కురిపించాడు, తుపాను ఒడిశాను తాకకుండా బంగ్లాదేశ్‌ వైపు వెళ్లిపోతే మోదీ మళ్లించాడు అనే తీరులో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. విదేశీ అతిథి భారత్‌యొక్క తరతరాల సంస్కృతిని, ఎన్నో శతాబ్దాలుగా తమ దేశంతో వున్న అనుబంధాన్ని ప్రశంసించాడు అంటే అదీ మోదీ ఘనతే. ఇలా ఇందిర టైపులో వ్యక్తిపూజను ప్రోత్సహిస్తున్నారు. ఎక్కడ చూసినా మోదీ మాస్కులే. మోదీ ఎందుకు, కమలం మాస్కులు పెట్టవచ్చుగా! మోదీ ఆరాధన ఏ లెవెల్‌కి వెళ్లిందంటే వారణాశి నియోజకవర్గంలో 'హరహర మోదీ, ఘర్‌ఘర్‌ మోదీ' అనే నినాదం మొదలెట్టారు. పరమశివుడి స్థానంలో వచ్చి చేరగలిగిన మొనగాడా మోదీ? శివుడు మూడో కన్ను తెరిచినట్టున్నాడు. ఢిల్లీ ఎన్నికల్లో బూడిదే మిగిలింది. ఇప్పుడు ఆ నినాదాన్ని కొద్దిగా మార్చి 'హారాహారా మోదీ' (ఓడిపోయాడు మోదీ) అని వెక్కిరిస్తున్నారు. అంతా తన చుట్టూ తిప్పుకుంటే యిదే జరుగుతుంది. 'బిజెపి ఓడలేదు, మోదీ ఓడాడు' అనే వ్యాఖ్యలు రావడానికి కారణం యిదే. 

బిజెపి అనేక రాష్ట్రాలలో వుంది. ఆ యా రాష్ట్రాల అవసరాలు కూడా తీర్చాలి. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత చేయవలసిన పనులు వున్నాయి. రాజ్యసభలో అప్పటి ప్రధాని ఆంధ్రకు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా యిస్తానని అనడం, వెంకయ్య దాన్ని పదేళ్లు చేస్తాననడం రికార్డయి వుంది. మోదీ దాన్ని తోసిరాజన్నాడు. ఆంధ్రకు తొలి సంవత్సరం బజెట్‌ లోటు భరిస్తామన్న హామీని తుంగలో తొక్కి 15 వేల కోట్లు అడిగితే 500 కోట్లు యిచ్చాడు. వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ యిస్తామని చెప్పి, జిల్లాకు 350 కోట్లు అడిగితే 7 జిల్లాలకు కలిపి 350 కోట్లు యిచ్చాడు. తెలంగాణకు చేయవలసినవీ చేయడం లేదు. (అందుకే ఢిల్లీలో తెలుగువారెవరూ బిజెపికి ఓటేయలేదట. కవర్‌ చేయడానికి వెళ్లిన తెలుగు మీడియావాళ్లకు బాహాటంగా చెప్పారట) నీరు, విద్యుత్‌ పంపిణీ గురించి ఇరు రాష్ట్రాల మధ్య పేచీలు పరిష్కరించడానికి సెంట్రల్‌ ఏజన్సీలు ఏమీ చేయకుండా చోద్యం చూస్తున్నాయి. ఇద్దరూ కొట్టుకుని బలహీనపడాలన్న దురుద్దేశం కాకపోతే యీ ఉదాసీనతకు కారణం వేరేముంటుంది? ఇవి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలే. తక్కిన రాష్ట్రాలకూ యిలాటి ఫిర్యాదులే వున్నాయి. 

ఇలా జరిగితే ఆ యా రాష్ట్రాల బిజెపి నాయకులకు ఆ రాష్ట్రాలలో పలుకుబడి ఏం మిగులుతుంది? వెంకయ్యనాయుడివి అన్నీ కబుర్లే, మోదీ యితని మాటలేవీ పట్టించుకోడట అని మనం అనుకునే స్థితి వచ్చింది కదా! బండారు దత్తాత్రేయదీ డిటో పొజిషనే. 'మేం మోదీకి చెప్పాం' అనే అంటారు తప్ప 'సాధించుకుని వచ్చాం' అనలేరు కదా. ఎప్పటికైనా యివ్వడమంటూ జరిగితే మోదీ దయతలచి మనకు విదిలించాడు అనుకోవాలి. అలా అనుకునేదాకా మోదీ విదల్చనే విదల్చడు. ఇందిర యిలాగే చేసేది. రాష్ట్రాలలో ఎవరైనా బలమైన నాయకుడు వుంటే అతని ప్రత్యర్థిని దువ్వి బలహీనపరిచేది. ఇద్దరూ తన దగ్గరకు పంచాయితీకి రావాలి. రెండు దశాబ్దాలు గడిచేసరికి దేశం  మొత్తం తెలిసిన నాయకుడంటూ లేకుండా పోయాడు. గతంలో ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఎన్నుకునేవారు. ఇందిర హయాం నుంచి ఎమ్మెల్యేలు నిర్ణయాన్ని ఇందిరకు వదిలేస్తూ తీర్మానం పాస్‌ చేయడం, కేంద్ర పరిశీలకులు వచ్చి అందరి చేతా ఒట్లేయించి కవర్లోంచి పేర్లు బయటకు తీయడం ఎక్కువైంది. మోదీ అదే బాటలో వెళుతున్నారు.

వీటన్నిటికి ఆర్థికమంత్రినో, జలవనరుల మంత్రినో నిందించకుండా మోదీమీదే ఎందుకు పడాలి అంటే దానికి మోదీ ధోరణే కారణం. 15 ఏళ్లలో గుజరాత్‌ సాధించిన అభివృద్ధి అంతటికీ మోదీయే క్రెడిట్‌ తీసుకున్నాడు కదా. అక్కడ విద్యుత్‌ నిరంతరం సరఫరా అవుతుంది అంటే, రోడ్లు బాగున్నాయి అంటే, పరిశ్రమలు వృద్ధి చెందాయి అంటే, సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు బాగా అమలైంది అంటే ఆయా శాఖల మంత్రులకు ప్రశంసలు లభించాలి కదా. లభించిందా? లేదే! అంతా మోదీ, మోదీ మోదీ! మోదీయే అన్ని డిపార్ట్‌మెంట్లలోనూ పనిచేసినంత బిల్డప్‌. ఇప్పుడు కేంద్రానికి వచ్చాక కూడా అదే బిల్డప్‌. ఏ మంత్రిని కుదురుగా కూర్చోనివ్వడు. సొంత నిర్ణయాలు తీసుకోనివ్వడు. వాళ్లకు ఎవరు సెక్రటరీగా వుండాలో తనే నిర్ణయిస్తాడు. వాళ్లెవరూ విధాన ప్రకటనలు చేయడానికి వీల్లేదు. వాళ్లంతా అల్లరి కుర్రాళ్లు. తను హెడ్మాస్టరు. ఇక ఉద్యోగులంతా పనిదొంగలైనట్లు, తనేదో పట్టుకోవడానికి వచ్చిన పోలీసు యిన్‌స్పెక్టరయినట్లు వ్యవహరించే తీరు బాగా లేదు. (అందుకే ఉద్యోగులలో చాలామంది బిజెపికి వ్యతిరేకంగా ఆప్‌కు ఓటేశారట). ఇది పద్ధతి కాదు అని మోదీకి చెప్పే ధైర్యం తక్కిన బిజెపి నాయకులెవరూ కనబరచటం లేదు. 

మోదీయే ఉద్ధారకుడు, మానవాతీత వ్యక్తి, తలచుకుంటే ఏదైనా చేయగలడు అనే యిమేజిని కార్పోరేట్‌ శక్తులు సోషల్‌ మీడియా ద్వారా బిల్డప్‌ చేశాయి. మోదీని వ్యతిరేకిస్తే భారతీయతను, హిందూమతాన్ని, అవినీతి ప్రక్షాళనను, స్వచ్ఛభారత్‌ను, సామర్థ్యాన్ని, బంగారు భవిష్యత్తును, అచ్ఛే దిన్‌ను వ్యతిరేకించినట్లే అనే అభిప్రాయం కలిగేట్లా చేశారు. మోదీ సర్కారు భూసేకరణ చట్టాన్ని యిష్టం వచ్చినట్లు దుర్మార్గంగా మార్చేసింది. మాదంతా స్వదేశీ విధానం అని చెపుతూనే ఇన్సూరెన్సు రంగంలో, రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులు ఆహ్వానిస్తోంది. మేక్‌ ఇన్‌ ఇండియా అంటూనే ప్రధాని సూట్లు విదేశాలనుంచి వస్తున్నాయి. గతంలో శివరాజ్‌ పాటిల్‌ రోజుకి మూడు సూట్లు మారిస్తే యాగీ చేసిన బిజెపి నాయకులను ఒబామా పర్యటనలో మోదీ మూడు సూట్లు మార్చారేమని అడిగితే ఏం చెప్పగలరు? సూటుపై తన పేరే డిజైన్‌గా వేసుకొనేటంత నార్సిసిజం (ఆత్మమోహం) తగునా? నార్సిసియస్‌ కథలో నీతి ఏమిటి, తన ప్రతిబింబంతో తనే మోహంలో పడితే చివరకు ఆత్మహత్యే గతి! (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]

Click here For Part-1

Click here For Part-2