చిత్తు చేస్తున్నారు అనుకొంటే.. చిత్తుగా ఓడిపోయారేంటబ్బా!

శ్రీలంక కూడా ఇండియన్ టీమ్ తరహా లోని టీమే. స్వదేశీ పులి. స్వదేశీ సింహం అనాలి కాబోలు. ఆ జట్టును టెస్టు మ్యాచ్ లలో ఆ దేశం గడ్డ మీద ఓడించడం అంత సులభం…

శ్రీలంక కూడా ఇండియన్ టీమ్ తరహా లోని టీమే. స్వదేశీ పులి. స్వదేశీ సింహం అనాలి కాబోలు. ఆ జట్టును టెస్టు మ్యాచ్ లలో ఆ దేశం గడ్డ మీద ఓడించడం అంత సులభం ఏమీ కాదు. వెనుకటికి ఈ విషయంలో ఆస్ట్రేలియానే భంగపడింది. ఇండియా కూడా పలు సార్లు శ్రీలంక కు వెళ్లి చిత్తు అయి వచ్చింది. మరి ఈ సారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాలు వినిపించాయి.

ఇండియా ఈ టెస్టు సీరిస్ 3 – 0తో సొంతం చేసుకొంటే ర్యాంకింగ్స్ లో కూడా టాప్ పొజిషన్ కు చేరుతుందనే ఎనాలసిస్ ల మధ్య తొలి టెస్టు ప్రారంభం అయ్యింది. తొలి రోజు అయితే మనోళ్లు విజృంభించారు. గర్జిస్తున్నారని మీడియా హెడ్డింగులు పెట్టుకొంది. బౌలింగ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ల హవా కనిపించగా.. బ్యాటింగ్ లో కూడా మనోళ్లు సత్తా చాటారు. రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ లు ముగిశాకా.. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ తొలి రెండు వికెట్లు పడటం చూశాకా.. ఈ  మ్యాచ్ లో ఇండియా ఆడుతూ పాడుతూ గెలుస్తుందని అనుకొన్నారంతా. అక్కడికీ రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక పెట్టిన లక్ష్యం కూడా సగటు భారత క్రికెట్ ప్రేక్షకుడికి ఒక లెక్కలేదని అనిపించలేదు!

కానీ బ్యాట్స్ మన్లకు మాత్రం ఆ లక్ష్యం కొండంత అనిపించింది. రెండు రోజుల సమయం ఉండగా.. స్వల్పం అనిపించిన లక్ష్యాన్ని మనోళ్లు చేధించలేకపోయారు. శ్రీలంకను చిత్తు చేస్తున్నారనుకొంటే వీళ్లే చిత్తయిపోయారు! మరి ఎలాగో మొదలైన టెస్టు.. మరెలాగో ముగిసింది. మిగతా రెండు టెస్టుల్లో మనోళ్ల విన్యాసాలు ఎలాఉంటాయో చూడాలి!