మోహన : కెప్టెన్‌ ఇలా వుండవచ్చా అంటూ తిట్టిపోసిన సంతానం గారు

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement కెప్టెన్‌ ఇలా వుండవచ్చా అంటూ తిట్టిపోసిన సంతానం గారు  చీఫ్‌ సెక్రటరీ సంతానంగారు పిలిపించారు. నేను అప్పట్లో (1988) ఎక్సయిజ్‌ కమీషనర్‌గా వుండేవాణ్ని.…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

కెప్టెన్‌ ఇలా వుండవచ్చా అంటూ తిట్టిపోసిన సంతానం గారు 

చీఫ్‌ సెక్రటరీ సంతానంగారు పిలిపించారు. నేను అప్పట్లో (1988) ఎక్సయిజ్‌ కమీషనర్‌గా వుండేవాణ్ని.  

''ఏమయ్యా, వాట్స్‌ ద మేటర్‌ విత్‌ యూ?'' అన్నారు కఠినంగా.

ఆయన దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. పనిలో పొరబాటు వచ్చేందుకు అవకాశం లేదు. తెలియకుండా ఏదైనా జరిగిందా? సంగతేమిటో తెలిస్తే జవాబు చెప్పవచ్చనుకుని ఆగాను.

ఆయన ప్రశ్న రెట్టించారు. నాకు ఏమనాలో తెలియక ''నథింగ్‌ సర్‌, ఏమీ లేదు..'' అన్నాను.

''ఏం లేకపోవడమేమిటయ్యా? యూ ఆర్‌ లూజింగ్‌ వెయిట్‌. మొహం పాలిపోతోంది. యూ ఆర్‌ నాట్‌ ఆల్‌రైట్‌. ఏదో తేడా వుంది.''

''..అబ్బే, అదేం లేదండి. టెస్టులు అవీ చేయించుకున్నాను. రిపోర్టులు బాగానే వున్నాయి. జబ్బేదీ లేదన్నారు. నేను చిన్నప్పటినుండీ సన్నమే కదండీ..''

''నో, నో.. నువ్వింకా చిక్కిపోతున్నావ్‌. పైగా ఎప్పుడూ వుండేటంత ఎనర్జెటిక్‌గా కనబడటం లేదు. క్లినికల్‌ టెస్ట్‌ల్లో తేడా ఏమీ లేదంటే దాని అర్థం – సమస్య వేరే చోట వుందన్నమాట! ఐయేయస్‌ ఆఫీసర్‌ అంటే ఏమిటి? ఫిజికల్లీ ఫిట్‌ వుండాలి, మెంటల్లీ అలర్ట్‌గా వుండాలి. ఐ డోంట్‌ లైక్‌ దిస్‌.'' 

పెద్దాయన. గురుతుల్యుడు. ఆయన అలా అంటూ వుంటే ఏం చెప్తాం? ఆయన కొనసాగించాడు.

''ఏమిటయ్యా నువ్వు! నిండా నలభై ఏళ్లు వుండవ్‌. ఇలా యీసురోమని వుంటే ఎలా? నువ్వు టీమ్‌ లీడర్‌వి. ఊరికే గోళ్లు గిల్లుకుంటూ కూర్చునే చేసే ఉద్యోగం కాదిది. నువ్వు హుషారుగా వుండకపోతే టీమును ఎలా నడిపిస్తావ్‌?'' అంటూ చడామడా తిట్టేశారు.

ఆయన చెప్పినది నిజమే! ఐయేయస్‌ ఆఫీసర్లు యీసురోమని వుంటే పనులు జరగవు. శారీరకంగా, మానసికంగా చురుగ్గా వుండాలి. నాకూ తెలుసు. కానీ అప్పటి నా పరిస్థితులు అలాటివి.

xxxxxx

సివిల్‌ సర్వీసెస్‌లో పనిచేసేవారికి చాలా శ్రమ వుంటుంది. మానసికమైన ఒత్తిళ్లు వుంటాయి. హెల్దీ మైండ్‌ ఇన్‌ హెల్దీ బాడీ అనే సూక్తిని నమ్మిన బ్రిటిషువారు సర్వీసెస్‌లో చేరినవారిని ఆ విధంగా తయారవడానికి తర్ఫీదు యిప్పించారు. అదే పరంపర కొనసాగుతోంది. సర్వీసెస్‌లో చేరిన వాళ్లందరికీ – మేం 400 మంది వుండేవాళ్లం – మసూరీలో ఫౌండేషన్‌ క్లాస్‌ అని నాలుగు నెలల పాటు ట్రెయినింగ్‌ ఏర్పాటు చేశారు. అక్కడ శిక్షణ అయిన తర్వాత ఒక్కో సర్వీసెస్‌ కోసం దేశంలో ఒక్కో చోట ఏర్పాటు చేసిన అకాడెమీలకు వాళ్లను పంపిస్తారు. ఐపియస్‌లకు మౌంట్‌ ఏబూ, ఐఆర్‌ఎస్‌లకు సిమ్లా… యిలా! ఐయేయస్‌లకు మాత్రం మసూరీలోనే శిక్షణ కొనసాగుతుంది. 

మసూరి సముద్రమట్టానికి 6155 అడుగుల ఎత్తులో ప్రశాంతమైన పచ్చటి వాతావరణంలో వుంటుంది. మసూరిలో ఓ ఎత్తయిన ప్రదేశం చూసుకుని అక్కడ మా ఎకాడమీ కట్టారు. నేను ఐయేయస్‌కు సెలక్టయ్యానని తెలియగానే 1968 జులైలో విమానంలో ఢిల్లీ వెళ్లి అక్కణ్నుంచి రైల్లో మసూరి చేరాను. మా చేత పొద్దున్నే పి.టి. (ఫిజికల్‌ ట్రెయినింగ్‌) వ్యాయామం చేయించేవారు. ఆ తర్వాతే క్లాసులు. మాకు గుఱ్ఱపుస్వారీ కూడా నేర్పించారు. దేశంలో రవాణా సౌకర్యాలు లేని కొన్ని ప్రాంతాల్లో గుఱ్ఱంపై వెళ్లవలసి వస్తుంది. ఎవరికి ఎక్కడ పోస్టింగ్‌ వస్తుందో తెలియదు కదా. ఎందుకైనా మంచిదని నేర్పిస్తారన్నమాట. అందరు పిల్లల్లాగే నాకూ చిన్నపుడు ఒక గుఱ్ఱపుపిల్ల వుంటే బాగుండేది అనుకునేవాణ్ని. పెద్దయ్యాక మసూరీలో ఆ ముచ్చట తీరింది.  

ఈ విధంగా మమ్మల్ని ఫిజికల్‌గా ఫిట్‌ చేయడం, క్లాసుల ద్వారా విజ్ఞానవంతుల్ని చేయడంతో ట్రెయినింగ్‌ ఆగదు. మనోవికాసానికి, దేశంపై అవగాహన పెరగడానికి  ట్రెయినింగ్‌ చివర్లో భారతదర్శన్‌ అని మూడు నెలలపాటు దేశంలో తిప్పుతారు. దానిలో కూడా ఒక సెలక్షన్‌ ప్రాసెస్‌ వుంది. కొన్ని కొన్ని రాష్ట్రాలను ఒక గ్రూపుగా చేస్తారు. మనం ఏ రాష్ట్రం నుండి వచ్చామో ఆ రాష్ట్రమూ, మనను ఏ రాష్ట్రానికి ఎలాట్‌ చేశారో అది కాకుండా (నా విషయంలో రెండూ ఒకటే అయ్యాయి) అవి లేకుండా వున్న గ్రూపులో తిప్పుతారు. ఆ విధంగా మా గ్రూపును కలకత్తా, బిహార్‌, ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్‌, మణిపూర్‌, అసాం వగైరా రాష్ట్రాలు తిప్పారు. మాకు ఒక రైల్వే బోగీ మొత్తం యిచ్చారు. దానిలోనే స్నానం, బట్టలు మార్చుకోవడం అంతా. వెళ్లిన చోటల్లా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిథులను కలిసేవాళ్లం. ఇలా తిరిగాక, పట్నా జిల్లాలో నెల్లాళ్లపాటు బ్లాకు లెవెల్‌ నుండి అన్ని స్థాయిల్లో ట్రెయినింగ్‌ యిప్పించారు. 

xxxxxx

భారతదర్శన్‌కు వెళ్లేముందు ఒక చిన్న సాహసం చేశాను – అనుకోకుండానే! సాధారణంగా భారతదర్శన్‌కై డిసెంబరు ఆఖరికి బయలుదేరే వాళ్లం. ఆ టైముకి మసూరీలో మంచు కురిసేది కాదు. మూడు నెలల తర్వాత తిరిగి వచ్చేసరికి మంచు సీజను అయిపోయేది. మేం వెళ్లిన ఏడాది అనుకోకుండా మేం మసూరీలో వుండగానే మంచు కురిసింది. రాత్రివేళ కురవడంతో మాకు తెలియలేదు. అవేళ డిసెంబరు 24. హ్యాపీ వ్యాలీలో వున్న చిన్న లోయలో వున్న మా హాస్టల్‌లో క్రిస్‌మస్‌ ఈవ్‌ ఫంక్షన్‌ జరుపుకుని హాయిగా నిద్రపోయాం. నేను నిద్ర లేచి మంచం దిగి నేలమీద కాలు పెట్టానో లేదో జర్రున జారిపోయాను. ఆ జారడం జారడం అలా అలా రైడింగ్‌ రూమ్‌కి వెళ్లి పడ్డాను. నిజానికి హ్యాపీ వాలీ నుండి చాలా రైడింగ్‌ క్లబ్‌కు వెళ్లాలంటే చాలా నిలువు మెట్లు దిగాలి. అవేళ వాటిపై పూర్తిగా మంచు కప్పేయడంతో స్కీయింగ్‌ చేసినట్టు నేను నా ప్రమేయం లేకుండా చేతిలో ఏ సపోర్టూ లేకుండా కొన్ని సెకన్లలో రైడింగ్‌ క్లబ్‌ హాల్లోకి వెళ్లి దబ్బున పడ్డాను. దెబ్బ  తగిలింది  కానీ అది గమనించలేనంత ఆశ్చర్యం! జీవితంలో తొలిసారి మంచు చూడడం, అసలేం జరిగిందో ఊహించలేని విభ్రమ! ఇక మా స్నేహితులందరూ జోక్స్‌ మొదలుపెట్టారు. 'హ్యాపీ వ్యాలీ నుండి రైడింగ్‌ రూమ్‌కి ఎనో రకాల రన్నింగ్‌ రేస్‌ రికార్డులున్నాయి. కానీ మోహన్‌ కందా అంత ఫాస్ట్‌గా ఎప్పుడూ ఎవ్వరూ చేయలేదు. సరికొత్త రికార్డు నెలకొల్పాడు' అంటూ! 

ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ మాటకి వస్తే శారదా ముఖర్జీ గారి వద్ద పని చేసినప్పుడు చేసిన జాక్‌ స్టే విషయం చెప్పాలి. ఒకసారి వెస్టర్న్‌ నేవల్‌ కమాండ్‌ వాళ్ల ఎక్సర్‌సైజ్‌లు జరుగుతున్నాయి. ఆవిడ నన్ను కూడా వెంట తీసుకుని వెళ్లింది. నేవల్‌ షిప్స్‌లో ఎక్కి సముద్రమధ్యంలోకి వెళ్లిపోయాం. ఫుల్‌ స్పీడ్‌లో ఓ రోజంతా రెండు ఓడలు పక్కపక్కనే వెళుతూంటాయి. ఈ ఓడలోంచి మరో ఓడలోకి వెళ్లాలన్నమాట. రెండిటికి మధ్య తాడుతో ఒక రోప్‌ వే లాటిది వేసి దానిలో చిన్న కుర్చీ ఏర్పాటు చేస్తారు. దానిలో కూర్చుని పైన వేళ్లాడుతున్న చిన్న తాడు పట్టుకుని  వేళ్లాడుతూ వెళ్లాలి. తాడు వదిలితే సముద్రంలో పడిపోవడమే! దాన్ని జాక్‌ స్టే అంటారు. అది చేస్తావా అని నన్ను అడిగారు. ఓ యస్‌ అంటూ  చేశాను. భలే థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌.

xxxxxx

సంతానంగారు మహానుభావుడు. కొందరిని 'లార్జర్‌ దేన్‌ లైఫ్‌' అంటూ వుంటాం కదా, అలాటివాడాయన. ఆయన ప్రణాళికలు కూడా లార్జర్‌ దేన్‌ లైఫ్‌యే! ఏదైనా సరే గ్రాండ్‌గా, భారీ స్థాయిలో ప్లాన్‌ చేసేవారు. లాల్‌ బహదూర్‌ స్టేడియంలో రాత్రిపూట మ్యాచ్‌లు జరపడానికి వీలుగా ఫ్లడ్‌ లైట్స్‌ పెట్టించాలనుకున్నాడు. ఐదు కోట్లు అవుతాయన్నారు. అది ఆ రోజుల్లో ఊహకు కూడా అందనంత మొత్తం. ఏమీ జంకలేదు. ఠక్కున చేయించేశారు. మరి దానివలన ఒనగూడిన లాభాలెన్నో. 

అలాగే చేపల చెఱువుల కాన్సెప్ట్‌ ఆయనదే. అప్పట్లో ఎవరికీ దాని గురించి ఏ మాత్రం ఐడియా లేదు. రైతులకు చెపితే ఉత్సాహం చూపించలేదు. ఆయనే రెవెన్యూ వాళ్ల చేత భూమి లీజుకి యిప్పించారు. బ్యాంకుల చేత ఋణాలిప్పించారు. అయినా బండి కదల్లేదు. అప్పుడు పోలీసుల్ని తీసుకుని వెళ్లి బలవంతంగా ట్రాక్టర్ల చేత నేల దున్నించేసి, చెఱువులు తవ్వించి, గట్లు కట్టించి, రైతులకు చేపపిల్లలను ఏర్పాటు చేసి… సర్వం తానే అయి చేయించారు. చేపల చెఱువుల్లో లాభాలు కళ్ల చూశాక యిక ఎవరికీ వాటి గురించి చెప్పనక్కరలేకపోయింది. అందరూ దానిమీదే పడ్డారు. అతి చేయడంతో గతి తప్పింది. పర్యావరణ సమస్యలు వచ్చాయి. వాటికి ఆయన బాధ్యుడు కాడు. సవ్యంగా, మితంగా చేసి వుంటే చేపల చెఱువులు కొన్ని ప్రాంతాల్లో చక్కని ఆదాయవనరుగా, ఉపాధిగా ఎప్పటికీ నిలిచి వుండేది. 

ఎన్టీ రామారావుగారు ముఖ్యమంత్రిగా వుండగా ఒకేసారి 28 మంది మంత్రులను తొలగించేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ అంతటి దుందుడుకుతనానికి ఒడి గట్టి వుండరు. రాజకీయంగా కానీ, ఎడ్మినిస్ట్రేషన్‌ పరంగా కానీ అది చాలా చిక్కులు తెచ్చిపెట్టవచ్చనే భయమే లేకుండా చేశారు. అలా చేసినా అధికారయంత్రాంగం కుంటుపడదని రామారావుగారికి హామీ యిచ్చినది సంతానం గారే అంటారు. అంతటి సాహసి ఆయన. 

చిత్రం ఏమిటంటే అంతలా నమ్మిన సంతానం గారినే రామారావుగారు తర్వాతి రోజుల్లో దూరం పెట్టారు. ఏదో ఒక వ్యవహారంలో అపార్థాల వలన సస్పెండ్‌ చేశారు. ఆయనను సస్పెండ్‌ చేస్తారన్న వార్తలు గుప్పుమంటున్న రోజుల్లోనే నేను ఆయనను చూడడానికి వెళ్లాను. సంతానం గారు ''ఎందుకొచ్చావయ్యా, నన్ను సస్పెండ్‌ చేయబోతున్నారని తెలియదా?'' అన్నారు. 

నేను చాలా బాధపడ్డాను. రామారావు గారి వద్దకు వెళ్లి ఏమిటీ ఘోరమని బతిమాలాను. 

రామారావుగారి మధ్య, సంతానంగారి మధ్య అపార్థాలు ఎంత బాగా తొలగిపోయాయంటే ఆయన రామారావుగారి హయాంలోనే ఎడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీగా అయ్యారు. ప్రతికూలపరిస్థితుల్లో కూడా సాధించుకుని రాగలిగిన దిట్ట ఆయన. అలాటిది నేను సరైన కారణం లేకుండా డీలా పడి వుంటే సహిస్తారా?

xxxxxx

సంతానం గారి దగ్గర ఏమీ లేదని బుకాయించినా, నిజానికి ఆ సమయంలో నేను ఒక విధమైన డిప్రెషన్‌లోనే వున్నాను. కారణం పెద్దగా ఏమీ లేదు. 1988లో ఓ సారి నేనూ, మా ఆవిడా కలకత్తా వెళ్లి విమానంలో వస్తున్నాను. ఆ ప్రయాణం చాలా ప్రమాదభరితంగా సాగింది. ఏదో సినిమాలో మొదటిసారి విమానం ఎక్కినతను 'విమానం ఎక్కడానికి అదృష్టం వుండాలి' అంటాడు పక్క ప్రయాణికుడితో. అనుభవజ్ఞుడైన ఆ ప్రయాణికుడు 'దిగడానికి కూడా అదృష్టం వుండాలి' అంటాడు. దిగే అదృష్టం వుందా లేదాన్న సందేహం ఆ రోజు మా యిద్దరికీ వచ్చింది. ఒకరి చేయి మరొకరు పట్టుకుని హనుమాన్‌ చాలీసా చదువుకుంటూ వుండిపోయాం. ఎట్టకేలకు క్షేమంగా దిగాం. అప్పటినుండి విమానం ఎక్కడమంటే భయం పట్టుకుంది. కానీ యిలా ఫోబియా వుందని చెప్పుకోలేం కదా. ఎక్కడికైనా ఫ్లయిట్‌లో వెళ్లాలంటే ఏదో కారణం చెప్పి తప్పించుకోసాగాను.

చిన్నప్పటినుండీ నాకు భయం, సంకోచం వంటివి లేవు. స్టేజి ఫియర్‌ లేకపోబట్టే కదా నన్ను బాలనటుడిగా సినిమాల్లో తీసుకున్నది. సినిమాల్లో మానేసిన తర్వాత కూడా బెరుకు నా దగ్గరకు రాలేదు. నేను ఎక్సర్‌సైజ్‌ చేసేటప్పుడు, యోగా, ధ్యానం చేసేటప్పుడు చుట్టూ ఎవరైనా వున్నారేమో, చూసి నవ్వుకుంటారేమోనన్న ఆలోచనే దగ్గరకు రానీయను. వేగంగా నడిచే నా నడకా, నా నిత్యవ్యాయామం – కంపూచియాలోనూ అలాగే చేశాను, బ్రెజిల్‌, ఆదిలాబాద్‌, ఐజాల్‌ (మిజోరామ్‌ రాజధాని), మియామీ (నిజర్‌ రాజధాని), అజ్‌మారా (ఎరిత్రియా రాజధాని)  రామచంద్రపురం.. ఎక్కడైనా సరే అలాగే చేశాను. ఓ సారి మా బావ (సీతారాం ఏచూరి తండ్రి) ను ఓ నలభై రూపాయలు అడిగాను. అప్పుగా కాదు. మా అక్కా, బావలకు నాకు వయసులో ఎంత తేడా వుందంటే – వాళ్లు నాకు తలితండ్రులుగా, మా అమ్మా నాన్నా అమ్మమ్మా, తాతయ్యల్లా అనిపించేవారు. అవేళ ఓ ముగ్గురు ఫ్రెండ్స్‌ను వేసుకుని హోటల్‌కి, సినిమాకి వెళ్లాలి. ఏబిడ్స్‌లో కనబడ్డాడు. దర్జాగా డబ్బు అడిగాను. ''ఏమోయ్‌, నలభై రూపాయలంటున్నావ్‌. ఇక్కడ రోడ్డు మీద నలభై గుంజీలు తీస్తే యిస్తాను'' అన్నాడాయన సరదాగా. అప్పటికి నేను ఐయేయస్‌ పాసయి, ఒంగోలులో సబ్‌ కలక్టర్‌గా జాయినయ్యాను. అయినా మా బావ పందానికి సై అన్నాను. అక్కడి కక్కడ గుంజీలు తీసి నలభై రూపాయలు వసూలు చేసుకున్నాను. 

అలాటి నాలో వింతగా ఆ సమయంలో బెరుకు, జంకు ప్రవేశించాయి. నాలో నేనే ముడుచుకుపోసాగాను. అది నా స్వభావానికి విరుద్ధం కావడంతో మానసిక సంఘర్షణకు లోనై బరువు తగ్గసాగాను. లాబ్‌కి వెళ్లి టెస్టు చేయించుకుంటే క్లినికల్‌గా ఏమీ కనబడేది కాదు. అదే సమయంలో స్పాండిలోసిస్‌ వచ్చింది. చికాకు, ఆందోళన. ఇదంతా ఒక ఏడాది పాటు నడిచింది. ఇంట్లో వాళ్లకు తప్ప బయటవాళ్లకు తెలియదు. ఎవరూ పెద్దగా గుర్తించలేదు. మానసిక ఆందోళనకు లోనవుతున్నానని గ్రహించలేక కొందరు వేళాకోళం చేసేవారు కూడా. అలాటి సమయంలో సంతానం గారు గుర్తించి మందలించారంటే దానికి కారణం – ఆయన పరిశీలనాశక్తి మాత్రమే కాదు, సహచరుల పట్ల వాత్సల్యం కూడా. ఆ రోగానికి మందు జాలి కురిపించడం కాదు, బుద్ధి వుందా లేదా అని యింట్లో పెద్దవాళ్ల తరహాలో తిట్టిపోయడమే. అవేళ ఆయన అదే చేశారు. తిట్టి ''నిన్ను యింకో మంచి పోస్టులో వేస్తాను. ఈ లోగా నిన్ను నువ్వు సరిదిద్దుకో.'' అని వార్నింగ్‌ యిచ్చారు. 

ఆయన అలా చెడామడా తిట్టడంతో నాకు ఒక్కసారి కళ్లు తెరుచుకున్నాయి. కుక్కలు నీట్లోంచి బయటకు వచ్చాక ఓ విధమైన జలదరింపుతో ఒళ్లు దులుపుకుని మామూలుగా అయిపోతాయి కదా, నేను కూడా ఆయన గదిలోంచి బయటపడగానే నా నెగటివ్‌ భావాలను అలాగే విదిలించేసుకున్నాను. నేను చేస్తున్నది తప్పు, బయటపడాలి అని నిశ్చయించుకున్నాను. 

దానికి గాను నేను దేవుణ్ని ఆశ్రయించాను. హనుమంతుడు, యితర దేవుళ్లపై కొన్ని శ్లోకాలు, స్తోత్రాలు మా మరదలు సేకరించి యిచ్చింది. అవన్నీ చదువుకోసాగాను. నత్త తన గుల్లలోకి వెళ్లి దాక్కున్నట్టుగా అప్పటిదాకా దాగున్న నేను యీ స్తోత్రపాఠాలతో బయటకు రాసాగాను. ఇంతలో సివిల్‌ సప్లయిస్‌ కమీషనర్‌గా వుద్యోగం వచ్చింది. ఉద్యోగం మార్పు, దానిలో కొద్దిపాటి మెరుగుదల కూడా  ఒక రకంగా దోహదపడింది. ఎప్పటిలాగా హుషారుగా అయిపోయాను. కానీ నేను నిరుత్సాహంగా వున్న రోజుల్లో సంతానంగారు యిచ్చిన 'ఝట్కా' మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. 

కొసమెరుపు – భారత్‌ దర్శన్‌ సందర్భంగా పట్నా జిల్లాలో పంపించిన బ్యాచ్‌లో ముగ్గురున్నాం. నేను కాక తక్కిన యిద్దరూ అమ్మాయిలే – శశి జైన్‌ (అప్పట్లో  శశి నాయర్‌), అరుణా రాయ్‌ (అప్పట్లో అరుణా జయరామ్‌). నా మీద అంత నమ్మకం ఎందుకంటే నాకు అప్పటికే పెళ్లయిపోయింది. మా స్నేహితుడు భుజంగరావు మాటల్లో చెప్పాలంటే నాకు 'పాప'భీతి ఎక్కువ! (మా ఆవిడ ముద్దుపేరు – పాప)

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com
please click here for audio version