రివ్యూ: రాజా రాణి
రేటింగ్: 3/5
బ్యానర్: ఏ.ఆర్. మురుగదాస్ ప్రొడక్షన్స్
తారాగణం: ఆర్య, నయనతార, నజ్రియా నజీమ్, జై, సత్యరాజ్, సంతానం తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్‌కుమార్
కూర్పు: రూబెన్
ఛాయాగ్రహణం: జార్జ్ సి. విలియమ్స్
నిర్మాత: మురుగదాస్
కథ, కథనం, దర్శకత్వం: అట్లీ
విడుదల తేదీ: మార్చి 14, 2014
శంకర్ వద్ద సహాయకుడిగా పని చేసిన అట్లీ డైరెక్ట్ చేసిన తమిళ చిత్రం ‘రాజా రాణి’ అక్కడ మంచి విజయం సాధించింది. నయనతార, ఆర్య జంటగా సాధించిన రెండో విజయమిది. ఈ చిత్రాన్ని పలువురు రీమేక్ చేద్దామని అనుకున్నారు కానీ ఫైనల్‌గా అనువాదమే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
కథేంటి?
ప్రతి లవ్ ఫెయిల్యూర్ తర్వాత లైఫ్ ఉంటుంది, మళ్లీ లవ్ ఉంటుంది అనేది ఈ సినిమా థీమ్. ఆర్య, నయనతార ఇద్దరూ లవ్‌లో ఫెయిల్ అవుతారు. ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్న ఇద్దరూ కలిసి బతకడానికి ఇబ్బంది పడతారు. ఒకరి గతం ఒకరికి తెలిసిన తర్వాత ఇద్దరిలోను మార్పు వస్తుంది. ఇద్దరిలోను మళ్లీ ప్రేమ భావనలు చిగురిస్తాయి కానీ ఎవరూ మనసులో మాట బయటపెట్టరు. చివరిగా తమ ప్రేమని ఎలా తెలుసుకుని కలిసి కొత్త జీవితం మొదలు పెట్టారనేది ‘రాజా రాణి’.
కళాకారుల పనితీరు!
నయనతార నటిగా ఎంతగా పరిణితి సాధించిందో చెప్పడానికి ఈ చిత్రం చక్కని ఉదాహరణ. తనని విడిచిపోయిన ప్రియుడు, ఇష్టం లేని భర్త మధ్య మానసికంగా నలిగిపోయే యువతి పాత్రలో నయనతార అద్భుతంగా నటించింది. నయనతారని తప్ప మరో తారని ఊహించుకోలేని విధంగా జీవించింది. మరెవరూ ఈ పాత్రకి ఇంత న్యాయం చేయలేరన్నట్టుగా ‘రాణి’ంచింది. ఆర్య ఇలాంటి క్యారెక్టర్స్‌కి బాగా సూట్ అవుతాడు. ‘వర్ణ’లాంటి సినిమాల్లో కామెడీ అయినా కానీ ఈ చిత్రంలో హుందాగా కనిపించి ఆకట్టుకున్నాడు. జై, నజ్రియా ఇద్దరూ బాగా చేసారు. నయనతార తండ్రి పాత్రలో సత్యరాజ్ పర్ఫార్మెన్స్ బాగుంది. సంతానం కామెడీ చేయడానికి ఎక్కువ స్కోప్ లేదు. అతను ఓకే అనిపించాడు.
సాంకేతిక వర్గం పనితీరు:
ప్రకాష్ కుమార్ స్వరపరిచిన బాణీలు యావరేజ్‌గా ఉన్నాయి. తెలుగు అనువాద సాహిత్యం వల్ల పాటల అందం పూర్తిగా చెడింది. నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటర్ మరీ ఎక్కువ మొహమాటపడ్డాడు. కత్తిరించడానికి కావాల్సినంత స్టఫ్ ఉన్నా కానీ అలాగే వదిలేసాడు. ఫలితంగా ఈ చిత్రం అనవసరంగా రెండు గంటల నలభై నిముషాల పైన ‘సాగింది’. సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది.
నిత్యం మనకి కనిపించే పాత్రల్ని, అనుభవాల్నే తీసుకుని అట్లీ ఈ చిత్రం తెరకెక్కించాడు. లవ్ ఫెయిల్యూర్ తర్వాత పెళ్లిళ్లు చేసుకున్న జంటలు తమ జీవితాన్ని సాఫీగా సాగించడానికి, గతాన్ని మరిచి ముందడుగు వేయడానికి ఈ చిత్రం అంతర్లీనంగా ఒక మంచి సందేశం కూడా ఇస్తుంది. మోడ్రన్ లవ్‌స్టోరీస్ అంటే ‘బూతు’ మాత్రమే అనుకునే వారికి ‘రాజా రాణి’ చెంప పెట్టు.
హైలైట్స్:
- నయనతార పర్ఫార్మెన్స్
- కాన్సెప్ట్
డ్రాబ్యాక్స్:
- లెంగ్త్
- సాంగ్స్
విశ్లేషణ:
నలుగురు వ్యక్తులు… మూడు ప్రేమలు. సింపుల్‌గా అదీ ‘రాజా రాణి’ కథ. ప్రేమలో విఫలమైన ఇద్దరు జంట కడితే వారి జీవితం ఎలా ఉంటుంది. వారిద్దరూ గతాన్ని మర్చిపోయి అడ్జస్ట్ కాలేకపోతే తమ లైఫ్ ఎలా ముందుకి సాగుతుంది అనేది దర్శకుడు ఈ చిత్రంలో చాలా బాగా చూపించాడు. మణిరత్నం ‘మౌనరాగం’ ఛాయలున్న ఈ చిత్రం ఈతరం ప్రేమలు, పెళ్లిళ్లకి అద్దం పడుతుంది.
కథానుసారం ఈ చిత్రం ఎమోషనల్‌గా, బోరింగ్‌గా రూపొందే ఛాన్స్ ఉంది. కానీ దర్శకుడు లైటర్ వీన్లో తన స్టోరీని నెరేట్ చేసాడు. నయనతార, ఆర్య కలిసి బతకలేకపోవడాన్ని ఫన్నీగా చూపించాడు. అలాగే వారిద్దరి ఫ్లాష్‌బ్యాక్ లవ్‌స్టోరీస్‌లో కూడా ఎంటర్టైన్మెంట్ మిస్ అవలేదు. ఈ పద్ధతి వల్ల రాజా రాణి ఎక్కడా విసుగు పుట్టించకుండా హాయిగా సాగిపోతుంది.
అయితే చివరి ఘట్టానికి వచ్చేసరికి దర్శకుడు రొటీన్ సీన్స్‌తో నింపేసాడు. ఆర్య, నయనతారకి ఒకరిపై ఒకరికి ప్రేమ కలగడం, దానిని బయటపెట్టడానికి ఇబ్బంది పడడం… రొటీన్‌గా క్లయిమాక్స్‌లో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం అంతా చాలా లవ్స్టోరీస్ని తలపిస్తుంది. అంత వరకు చూపించిన కొత్తదనాన్ని దర్శకుడు ఈ ఘట్టంలో పూర్తిగా పక్కన పెట్టేసాడు. చివరిగా ఏమి జరుగుతుందనేది తెలిసినప్పుడు వీలయినంత తొందరగా ముగించేయడం ఉత్తమం. కానీ ఈ చిత్రాన్ని చివర్లో మరీ మరీ సాగదీసి విడిచిపెట్టారు. కాకపోతే మళ్లీ నయనతార మాజీ ప్రియుడు క్లయిమాక్స్‌లో ప్రత్యక్షం కావడం నైస్ టచ్.
ఏ సెంటర్స్ ఆడియన్స్‌కి, ముఖ్యంగా యువతకి ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ అనువాద చిత్రాన్ని మన ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.
బోటమ్ లైన్: ఈ ‘రాజా రాణి’ మనసు దోచుకుంటారు.
-జి.కె.