సినిమా రివ్యూ: ఉయ్యాలా జంపాలా

రివ్యూ: ఉయ్యాలా జంపాలా రేటింగ్‌: 3/5 బ్యానర్‌: సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ తారాగణం: రాజ్‌ తరుణ్‌, అవిక, అనితా చౌదరి, పునర్నవి, రవివర్మ, కిరీటి తదితరులు కథనం: విరించి వర్మ, రామ్‌ మోహన్‌,…

రివ్యూ: ఉయ్యాలా జంపాలా
రేటింగ్‌: 3/5

బ్యానర్‌: సన్‌షైన్‌ సినిమాస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌
తారాగణం: రాజ్‌ తరుణ్‌, అవిక, అనితా చౌదరి, పునర్నవి, రవివర్మ, కిరీటి తదితరులు
కథనం: విరించి వర్మ, రామ్‌ మోహన్‌, రాజ్‌ తరుణ్‌
సంగీతం: ఎం.ఆర్‌. సన్నీ
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
ఛాయాగ్రహణం: విశ్వ డి.బి.
నిర్మాతలు: అక్కినేని నాగార్జున, పి. రామ్‌ మోహన్‌
కథ, దర్శకత్వం: విరించి వర్మ
విడుదల తేదీ: డిసెంబర్‌ 25, 2013

ఓ చిన్న సినిమాతో అక్కినేని నాగార్జున, డి. సురేష్‌బాబు లాంటి పెద్ద పేర్లు అసోసియేట్‌ అవడంతో ‘ఉయ్యాలా జంపాలా’పై ఆసక్తి నెలకొంది. ట్రెయిలర్స్‌తోనే స్వీట్‌ ఫిలిం అనే ఇంప్రెషన్‌ వేయగలిగిన ఈ చిత్రం వెండితెరపై అదే స్వీట్‌ ఇంప్రెషన్‌ని కంటిన్యూ చేయగలిగిందా లేదా?

కథేంటి?

కోడిపెంట ఎరువు అమ్ముకునే ఓ పల్లెటూరి బుల్లెబ్బాయి… సూరి (రాజ్‌ తరుణ్‌). తన మేనమామ కూతురు ఉమ (అవిక) అంటే అతనికి క్షణం పడదు. బావామరదళ్లు ఇద్దరూ ఒకర్ని ఒకరు ఉడికించుకోవడానికి వేరే వాళ్లని ప్రేమిస్తారు. ఉమ ప్రేమించిన వాడు ఆమెని మోసం చేయబోతే తన్ని బుద్ధి చెప్తాడు సూరి. దాంతో సూరిపై తనకున్న ప్రేమని రియలైజ్‌ అవుతుంది ఉమ. కానీ సూరికి తన మరదలిపై తనకున్న ప్రేమ తెలీదు. దానిని అతను ఎప్పుడు తెలుసుకుంటాడనేది ఈ చిత్రం కథ. 

కళాకారుల పనితీరు!

కొత్త కుర్రాడు రాజ్‌ తరుణ్‌ ఈ క్యారెక్టర్‌కి అతికినట్టు సరిపోయాడు. సగటు సినిమా ‘హీరో’లా కనిపించకపోవడం, అనిపించకపోవడం ఇతని బలాలు. చక్కని హావభావాలతో, హాయిగొలిపే గోదావరి యాసతో తన పాత్రకి జీవం పోసాడు. ‘బోయ్‌ నెక్స్‌ట్‌ డోర్‌’ అనే టర్మ్‌కి సిసలైన ఎగ్జాంపుల్‌ అన్నమాట. ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్‌తో తెలుగు ఆడవాళ్లకి పరిచయమున్న అవిక సినీ ప్రేక్షకులకి కొత్త. తన పాత్రకి ఆమెకి కూడా బాగా సూట్‌ అయింది. బాగా చేసింది కూడా. అనితా చౌదరి, రవి వర్మ ఇద్దరికీ హీరో తల్లి, హీరోయిన్‌ తండ్రిగా చెప్పుకునే పాత్రలు దక్కాయి. వారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ‘సెకండ్‌ హ్యాండ్‌ సుబ్బారావు’ కిరీటి ఈ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. హీరోని ప్రేమించే యువతి పాత్రలో పునర్నవి నటన సహజంగా ఉంది. హీరో స్నేహితుడిగా నటించిన గంగాధర్‌ ఆకట్టుకుంటాడు. 

సాంకేతిక వర్గం పనితీరు:

ఎం.ఆర్‌. సన్నీ స్వరపరిచిన పాటలు ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం మాత్రం చాలా బాగుంది. విశ్వ కెమెరా పనితనం ఈ చిన్న చిత్రానికి సొబగులు అద్దింది. పల్లెటూరి పచ్చదనాన్ని అతని కెమెరా అందంగా బంధించింది. ఎడిటింగ్‌ బాగుంది. సంభాషణలు చాలా బాగున్నాయి. అభిరుచి గల నిర్మాతలు కలిసి ఈ క్యూట్‌ ఫిలింకి తమ సపోర్ట్‌ అందించారు. దర్శకుడు విరించి వర్మ షార్ట్‌ ఫిలింస్‌ చాలా డైరెక్ట్‌ చేసాడు. తన తొలి సినిమాకి అతను కాంప్లికేటెడ్‌ కథాంశాన్ని కానీ, తెలివితేటలు బాగా తెలిసే కథనాన్ని కానీ ఎంచుకోలేదు. ఒక సింపుల్‌ బావామరదళ్ల స్టోరీని ఎంచుకుని చాలా సహజంగా ప్రెజెంట్‌ చేశాడు. తన కథని తెరకెక్కించే విధానంలో దర్శకుడి అప్రోచ్‌ ఈ సినిమాకి ఆ క్యూట్‌నెస్‌ని ఆపాదించింది. కొత్త నటీనటుల నుంచి కావాల్సింది రాబట్టుకుంటూ ఎక్కడా శృతి మించకుండా, ఏమాత్రం సుత్తి లేకుండా ప్రతీదీ సింపుల్‌గా ఉంచాడు. 

హైలైట్స్‌:

  • హడావుడి, హంగామా లేని కథ, కథనం
  • నేపథ్య సంగీతం
  • రాజ్‌ తరుణ్‌ అభినయం

డ్రాబ్యాక్స్‌:

  • సెకండాఫ్‌ మరీ ప్రిడిక్టబుల్‌ అయిపోవడం
  • క్లయిమాక్స్‌లో ఉండాల్సిన డెప్త్‌ లేకపోవడం

విశ్లేషణ:

బావామరదళ్లు ఇద్దరూ తమతో పాటే పెరిగిన వారితోనే ప్రేమలో పడ్డామనే సంగతి రియలైజ్‌ అవడమే ఈ చిత్ర కథాంశం. ఇద్దరు స్నేహితులు ఇలా తమకి ఒకరిపై ఒకరికున్న ప్రేమని రియలైజ్‌ అవడం ఇంతకుముందు ‘నువ్వేకావాలి’లో చూశాం. ఈ చిత్రంలో ఆ సినిమా ఛాయలు కనిపిస్తాయి కానీ దీని బ్యూటీ అండ్‌ స్పెషాలిటీ దీనికున్నాయి. పల్లెటూరి వాతావరణంలో అత్యంత సహజమైన పాత్రలతో, చక్కని సంభాషణలతో ‘ఉయ్యాలా జంపాలా’ వీక్షకులని అలరిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌ అసలు టైమ్‌ తెలీకుండా సాగిపోతుంది. 

సినిమాలో ఎక్కడా హడావుడి ఉండదు. సినిమాటిక్‌ ఫీల్‌ ఉండదు. ఇద్దరు బావామరదళ్ల కథని వాళ్ల పక్కింటి కిటికీలోంచి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అంత సహజంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. సన్నివేశాలు, పాత్రల రియాక్షన్లు అన్నిటా సహజత్వం తొణికిసలాడుతుంది. ప్రథమార్థంలో స్వచ్ఛమైన గోదావరి యాసతో, అక్కడి వాతావరణంతో కావాల్సినంత వినోదం పండుతుంది. ద్వితీయార్థంలో కథ ‘కాన్‌ఫ్లిక్ట్‌ పాయింట్‌’ చేరుకున్నాక వేగం మందగిస్తుంది. ఆ ‘నిదానం’ అర్థం చేసుకోగలిగిందే అయినా కానీ, అప్పటికీ కొంచెం హాస్యానికి చోటిచ్చి ఉండాల్సిందేమో అనిపిస్తుంది. 

పతాక సన్నివేశాల్లో ఉండాల్సిన లోతు లేకపోవడం ఈ చిత్రానికి సంబంధించి పెద్ద బలహీనత. హీరో తనకి తన మరదలిపై ఉన్న ప్రేమ ఎంతనేది రియలైజ్‌ అవడానికి తగిన సన్నివేశాలు, సందర్భాలు ఏమీ లేవు. చాలా సింపుల్‌గా తేల్చేసాడు దర్శకుడు. షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా ఉంచాలనే విరించిలోని షార్ట్‌ ఫిలింమేకర్‌ ‘నాన్చొద్దూ’ అంటూ వారించినట్టున్నాడు. కానీ సినిమాలో ‘రసానుభూతి’ కలగాలంటే, తృప్తిగా బయటకి రావాలంటే అక్కడక్కడా లోతులు స్పృశించాల్సిన అవసరం ఉంటుందని అతను గ్రహించాలి. ఒక నీటైన క్యూట్‌ లవ్‌స్టోరీ చూసి చాలా కాలమైంది అనుకునే వారికి ‘ఉయ్యాలా జంపాలా’ ఆ లోటు తీరుస్తుంది. మసాలా లేకపోతే సినిమా ఎక్కదనే బాపతు జనాలకి ఇందులో ఏదో లోటుందనిపిస్తుంది. మీ టేస్ట్‌ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఈ ఉయ్యాల ఎక్కి ఊగాలో లేక చూడకుండా ఆగాలో మీరే తేల్చుకోండి. 

బోటమ్‌ లైన్‌: ఉయ్యాలా జంపాలా… సూటిగా, సుత్తి లేకుండా!

– గణేష్‌ రావూరి

[email protected]

twitter.com/ganeshravuri