ఎమ్బీయస్‌ : తెలంగాణ మెడకు రాయి – రాయల తెలంగాణ – 3

Click here for part1 Advertisement Click here for part2 అనడంలో ఆశ్చర్యం లేదు కానీ, వారి వాదనలే వింతగా వున్నాయి. ఎవరడిగారని రాయలసీమను విడగొడుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కలిపేముందు మమ్మల్ని అడగనక్కరలేదా?…

Click here for part1

Click here for part2

అనడంలో ఆశ్చర్యం లేదు కానీ, వారి వాదనలే వింతగా వున్నాయి. ఎవరడిగారని రాయలసీమను విడగొడుతున్నారు? అని ప్రశ్నిస్తున్నారు. కలిపేముందు మమ్మల్ని అడగనక్కరలేదా? అంతా మీ యిష్టమేనా అని నిలదీస్తున్నారు. సేమ్‌ యివే ప్రశ్నలు యీ మధ్య సమైక్యవుద్యమకారులు అడిగారు. అప్పుడు వీళ్లు వాళ్లను మందలించారు – 'బోడి మిమ్మల్ని అడిగేది ఏముంది? కేంద్రానికి సర్వాధికారాలు పూజ్య ఆంబేడ్కర్‌ యిచ్చినవి వున్నాయి. ఆర్టికల్‌ 3 చదువుకుని రండి. అసెంబ్లీలో తీర్మానం కాదు కదా, చర్చ కూడా చేయరు, రాష్ట్రపతిపాలన విధించి తమకు యిష్టం వచ్చినట్టు చేస్తారు. మీరు చచ్చినట్టు ఆమోదించవలసినదే' అని. ఇప్పుడు కేంద్రం రాయల తెలంగాణ యిదే పద్ధతిలో యిస్తే మరి వీరు ఎలా అభ్యంతర పెట్టగలరు? రాష్ట్రాలు బానిసలు, కేంద్రం చెప్పినట్టు ఆడాల్సిందే అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేసిన వీరు యీ రోజు దానికి విరుద్ధంగా ఎలా మాట్లాడగలరు?

విభజన ఎలా చేయాలి అన్న విషయంపై సీమాంధ్ర, తెలంగాణ నాయకులను ఒక్కచోట కూర్చోబెట్టి కేంద్రం ఎప్పుడూ మాట్లాడలేదు. తనకు తోచినది తను చేసింది, శభాష్‌ అన్నారు వీళ్లు. 'యూటీ చేయకుండా ఉమ్మడి రాజధాని చేసే వెసులుబాటు రాజ్యాంగంలో లేదు కదా, అలా ఎలా పెడతారు? అంతకంటె చండీగఢ్‌ మోడల్లో యుటీ చేసి ఉమ్మడి రాజధాని చేయండి.' అని సీమాంధ్ర నాయకులు కొందరు సూచిస్తే 'అబ్బే కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ తీర్మానంలో యూటీ లేదు కాబట్టి, దాని మాట ఎత్తడానికి వీల్లేదు. ఆ తీర్మానం శిలాశాసనం' అన్నారు. బొటాబొటీ మెజారిటీతో, ఎదుటివాళ్ల మధ్య తంపులు పెట్టి సర్కారు బండి గెంటుకువస్తూన్న పార్టీ తీర్మానం ఒకటి అఘోరిస్తే అదో పెద్ద శిలాక్షరం, వేదవాక్కు.. బ్రహ్మరాత..తుడిపివేయకూడదంటూ చెప్పారే! ఇప్పుడు అదే పార్టీ రాయల తెలంగాణ అంటే అదీ ఒప్పుకోవాలిగా ! ఇది ఆ తీర్మానంలో లేదే అని ఎత్తి చూపించారు కెసియార్‌. లేకపోతే యిప్పటికిప్పుడు మారుస్తారు. జులై 30 నాడే తీర్మానాలు చేయాలి, తర్వాత చేయకూడదు అని ఏమైనా చట్టం వుందా? అది శిలాశాసనం అయితే, యిదీ శిలాశాసనమే. అది నీటి మీద రాతయితే, యిదీ నీటిమీద రాతే!

'రాష్ట్రంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్నే లెక్కలోకి తీసుకుంటే మైనారిటీ ప్రజల ఆకాంక్షలు ఎన్నటికీ నెరవేరవు. అందుకని కేంద్రమే తన చిత్తం వచ్చినట్లు చేయవచ్చు' అంటూ టి-వాదులు యిన్నాళ్లూ వాదించారు. అందుకనే సీమాంధ్రులు గొంతు చించుకున్నా పట్టించుకోకండి అన్నారు. ఇప్పుడు రాయల తెలంగాణ విషయంలో అదే వాదన వాళ్లకు వ్యతిరేకంగా పని చేస్తోంది. 10 జిల్లాలవాళ్లు ఒకవైపు వున్నారు, రాయలసీమ మాకు వద్దు అంటున్నారు. కానీ 2 జిల్లాల వాళ్లు అవతలివైపు వుండి 'కలుస్తాం' అంటున్నారు. టి-వాదుల వాదన ప్రకారం 2 జిల్లాల మాటే నెగ్గాలి. కేంద్రం వాళ్ల గోడే వినాలి. 10 జిల్లాల వాళ్లనీ నోర్ముయ్‌ అని గదమాయించాలి. ఇప్పుడు అదే జరుగుతున్నట్టుంది.

భద్రాచలాన్ని ఆంధ్రలో కలపాలా, తెలంగాణలో కలపాలా? అన్న చర్చ జరుగుతున్నపుడు 'భద్రాచలం జనాభా తెలంగాణతో కలిసి వుంటామని ఆందోళన చేస్తున్నారు. వారి గోడు వినండి' అని టి-జాక్‌ నుండి టి-ఉద్యమకారులు అందరూ వాదించారు. 'భద్రాచలం ఒక్కటే ఏమిటి 13 జిల్లాల వాళ్లు తెలంగాణతో కలిసి వుంటామని ఆందోళన చేస్తున్నారు, వారి గోడూ వినండి' అని సమైక్యవాదులు చెపితే అబ్బే అది వినం, యిది మాత్రమే వింటాం అని మొండికేశారు. ఇప్పుడు భద్రాచలం వారిలాగానే కర్నూలు, అనంతపురం జిల్లా నాయకులు తెలంగాణతో కలుస్తాం అంటున్నారు. పంచాయితీ సమితుల వాళ్లు ఉత్తరాలు రాసి యిచ్చారు. భద్రాచలం లాజిక్‌ యిక్కడా వుపయోగిస్తే వాళ్ల మాటా కాదనకూడదు. కానీ టి-ఉద్యమకారులు కాదంటున్నారు. అంటే ఢిల్లీ వారు తమకు అనుకూలంగా చెప్పినపుడు గొప్పవారు, చెప్పకపోతే సన్నాసులు అన్నమాట. కిరణ్‌ అధిష్టానాన్ని ఎదిరించినపుడు 'ఎంత తప్పు, హన్నా! అధిష్టానాన్ని ఎదిరిస్తాడా? అతని పదవి పీకేయాలి' అని రంకెలు వేసినవారు యిప్పుడు తామే ఎదురు తిరుగుతున్నారు. గతంలో ఢిల్లీ మౌనంగా వున్నపుడూ వీళ్లు ఎదురు తిరిగారు, పార్లమెంటు ఎదుట ధర్నాలు చేశారు. మధ్యలో తమకు అనుకూలంగా తోచినపుడు మాత్రం ఎదుటివాళ్లకు సుద్దులు చెప్పారు.

రాయల తెలంగాణ ఏర్పాటు చేసే క్రమంలో రాయలసీమను రెండుగా చీల్చడం చాలా దారుణంగా అనిపిస్తుంది. తమను చీల్చమని వాళ్లు అడగలేదు, ఉద్యమాలు చేయలేదు, తెలంగాణ వాళ్లంటే మాకు ప్రేమ వాళ్లతో కలపండి అని అడగలేదు (ఒక్క జెసి దివాకరరెడ్డి తప్ప). అయినా చీలుస్తున్నారు. సోనియాకు సెంటిమెంట్లు లేవు కాబట్టి అలా చీలుస్తోంది అనుకున్నా కర్నూలు, అనంతపురం జిల్లా పంచాయితీ సమితులు ఉత్తరాలు ఎందుకు యిచ్చినట్లు? అసలు వాళ్లు ఏం రాశారు? 'మా రెండు జిల్లాలను మాత్రమే చేర్చండి, తక్కిన రెండు జిల్లాలను వదిలేయండి' అని రాశారా? అలా వుండి వుండదు. ఈ రెండు జిల్లాలను కలిపితే నీటి సమస్య తీరిపోతుంది కాబట్టి.. అంటున్నారు. ఇది కలిపినా పోతిరెడ్డిపాడు గొడవ అలాగే వుంటుంది. హంద్రీ నీవా, తెలుగుగంగ యిత్యాది ప్రాజెక్టులకు నీటి కొరత తప్పదు. నీటి సమస్య కోసమే అయితే అందువలన ఆ జిల్లాలూ కలపాలి. కానీ కలపటం లేదు. ఎందుకంటే ఆ జిల్లాల నుండి గట్టి ప్రతిపక్ష నాయకులున్నారు.

కడప నుండి జగన్‌, చిత్తూరు నుండి బాబు, …కిరణ్‌ కూడా లీడరనుకుంటే, కొత్త పార్టీ పెట్టి ఓట్లు చీలుస్తాడనుకుంటే – ఆయనదీ చిత్తూరే. వాళ్లందరినీ ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం చేసి తెలంగాణలో కాంగ్రెసును బలోపేతం చేస్తున్నారని అనుకోవాలి. అంటే దీని అర్థం – తరతరాల బాటు నిలిచిపోయే రాష్ట్రవిభజన యీనాడు వున్న యిద్దరు, ముగ్గురు నాయకుల కారణంగా వక్రంగా, అపసవ్యంగా జరుగుతోందన్నమాట. ఇది రాజకీయమా? రాక్షసీయమా? (స్త్రీపదం ఉద్దేశపూర్వకంగా వాడబడింది)

అయినా ఆ రెండు జిల్లాల వాళ్లూ మాత్రం ఉత్తరాలు ఎందుకు యిచ్చారు? 'హైదరాబాదుతో యథాతథ పరిస్థితి కొనసాగాలనే ఆశతో..' అని చెప్పవచ్చు.  హైదరాబాదును విడగొట్టేసి వేరే రాష్ట్రంగా చేస్తున్నాం, వరంగల్లు రాజధానిగా తెలంగాణ రాష్ట్రంలో చేరతారా? అంటే వీళ్లు జారిపోతారు. కాంగ్రెసు పార్టీ 10 జిల్లాల తెలంగాణ అంది కాబట్టి 10 జిల్లాలే యివ్వాలి అని కెసియార్‌ మరీ పట్టుబడితే ఢిల్లీ వారికి యింకో ఐడియా రావచ్చు. ఈ రెండూ కలిపేసి, హైదరాబాదు, రంగారెడ్డిజిల్లాలు తీసేసి యివ్వవచ్చు. హైదరాబాదు, రంగారెడ్డిని వేరే రాష్ట్రం చేసి, కేంద్రపాలన కింద పెడితే సీమాంధ్ర నాయకుల్లో కొందరు ఖుష్‌. 'హైదరాబాదుతో కూడిన.. అన్నారు కదా!' అనే కెసియార్‌ లాజిక్‌ లాగితే 'కావలిస్తే రాష్ట్రం పేరే హైదరాబాదు అని మార్చేస్తాం, లేదా ఆదిలాబాదు పేరు హైదరాబాదుగా మార్చేస్తాం' అంటారు. ఇదేదో జోక్‌ అనుకోకండి. దిగ్విజయ్‌ చెప్పడం లేదా? 'రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తాం, కానీ దాన్ని 'తెలంగాణ' అనే పిలుస్తాం' అని! 'ఆర్టికల్‌ 3 వాళ్ల చేతిలో వుంది. ఏదైనా, ఏమైనా చేయవచ్చు' అని విభజనవాదులకు ప్రత్యేకంగా గుర్తు చేయనక్కరలేదు కదా! (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2013)