ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగిని ఏం చేయాలో కాంగ్రెసుకు తోచడం లేదు. అతను దళితుడు. సత్నామీ కులంలో అతనికి విపరీతమైన పలుకుబడి వుంది. గిరిజనులు, మతం మారిన క్రైస్తవులు అతన్ని గుడ్డిగా నమ్ముతారు. అతను వారి భాషలో మాట్లాడగలడు. ప్రజలకు అందుబాటులో వుంటాడు. పల్లెల నుండి అనేకమంది గిరిజనులు అతని బంగళాకు వచ్చి ఎక్కడ పడితే రోజుల తరబడి అక్కడ బస చేయవచ్చు. బెడ్‌రూమ్‌లోకి తప్ప ఎక్కడికైనా వెళ్లవచ్చు. వీళ్లందరికీ అజిత్ యింట్లో భోజనం వండి పెడుతూంటారు. అయినా రాష్ట్రనాయకులకు అతనంటే పడదు. తనూ, తన కుటుంబం తప్ప కాంగ్రెసులో యితర నాయకులుండడం సహించలేక అందర్నీ పక్కకు పడేశాడని వాళ్ల కోపం. 'గిరిజన ప్రాంతాల్లో మన పార్టీకి ఎంతో పలుకుబడి వుండేది, అదంతా జోగీ వలననే సర్వనాశనమైంది.2003, 2008 ఎన్నికలలో పార్టీ ఓడిపోవడానికి యితనే కారణం.' అంటారు వాళ్లు. 2003లో అతను అధికారంలో వుండగా బిజెపిని దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో ఆ పార్టీని చీల్చబోయాడు. ఎమ్మెల్యేలను కొన్నాడన్న ఆరోపణలు, తగిన సాక్ష్యాలు లభించడంతో సోనియా గాంధీ అతన్ని పార్టీలోంచి బహిష్కరించింది. కానీ 2004 పార్లమెంటు ఎన్నికల నాటికి మళ్లీ పార్టీలోకి తీసుకుని కాంగ్రెసు నుండి బిజెపికి మారిన వృద్ధనాయకుడు విద్యాచరణ్ శుక్లాకు పోటీగా నిలబెట్టింది. ఆ ప్రచారసందర్భంగా అజిత్ యాక్సిడెంటుకు గురయి తొమ్మిదేళ్లపాటు వీల్ చైర్‌లో వుండవలసి వచ్చింది. ఏమైతేనేం, ఎన్నికల్లో శుక్లాను ఓడించి అనామకుణ్ని చేశాడు. గత్యంతరం లేక 2008లో శుక్లా మళ్లీ కాంగ్రెసులో చేరాడు.
ఇలాటి వాళ్లంతా అజిత్ జోగిని కట్టడి చేయకపోతే తాము పార్టీలో నిలదొక్కుకోలేమని ఫిర్యాదులు చేశారు. వాళ్ల మాటలు విన్న కాంగ్రెసు అధిష్టానం అజిత్‌ను రాష్ట్ర వ్యవహారాల నుండి తప్పించి, నందకుమార్ పటేల్‌ను రాష్ట్ర కాంగ్రెసు అధ్యకక్షుడిగా చేసింది. అజిత్ అంటే పడని చరణ్ దాస్ మహంత్‌ను కేంద్రమంత్రిగా తీసుకుంది. అంతేకాదు, మరో అజిత్ ప్రత్యర్థి రవీంద్ర చౌబేను అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుణ్ని చేసింది. అజిత్ జోగి కొడుకు అమిత్ తన రాజకీయ శత్రువును హత్య చేయించాడన్న ఆరోపణపై రాయపూరు జైల్లో 10 నెలలు గడిపాడు. బయటకు వచ్చాక బస్తర్‌లో పాదయాత్ర నిర్వహిస్తే చాలామంది వచ్చారు. అది చూసి యితర కాంగ్రెసు నాయకులు బస్తర్‌లో పాదయాత్ర చేశారు. వారిపై మావోయిస్టులు దాడి చేసి ముఖ్యుల నెందర్నో చంపివేశారు. మావోయిస్టుల దాడి వెనుక అజిత్ జోగి హస్తం వుందని రాష్ట్ర కాంగ్రెసు నాయకుల సంశయం. అజిత్ మాత్రం యీ దాడిని ఖండిస్తూ అధికార బిజెపికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశాడు. కానీ కాంగ్రెసు హై కమాండ్ కరగలేదు. అజిత్ అంటే పడని భూపేష్ బాఘేల్ అనే నాయకుణ్ని పార్టీ కోఆర్డినేటర్‌గా నియమించింది. ఆ ప్రాంతంలోని పంచాయితీ ఎన్నిక జరిగితే మేమన్ అనే అతన్ని అజిత్ తన కాండిడేట్‌గా సూచించాడు. కానీ మహంత్ మరొకరికి టిక్కెట్టు యిప్పించాడు. బస్తర్‌లో కాంగ్రెసు నాయకులు హతమార్చబడినా దానికి సానుభూతి ఓట్లు పడలేదు. పైగా ఇండిపెండెంట్‌గా నిలబడిన మేమన్ 1800 ఓట్ల తేడాతో గెలిచాడు. ఇదంతా అజిత్ చేస్తున్న కుట్రే అని అనుమానించిన స్థానిక కాంగ్రెసు నాయకులు బస్తర్ హతుల ఆత్మశాంతికి నిర్వహించిన 'కలశయాత్ర'కు అజిత్‌ను ఆహ్వానించలేదు.
ఈ వరసంతా చూసిన కినిసిన అజిత్ 'మిని మాత' పేరుపై ఐదురోజుల యాత్ర చేశాడు. దళితులైన సత్నామీ కులంలో పుట్టి పార్లమెంటుకు ఎన్నికైన మహిళ పేరు మిని. ఆవిడ పేరు మీద భారతీయ సత్నామీ కళ్యాణ్ సమితి అనే సంస్థ పేర నిర్వహించిన యీ యాత్రలో అజిత్ కాంగ్రెసు జండాలు పెట్టించలేదు. 'దీనికి బిజెపి ఆర్థికసాయం చేసింది' అంటూ అజిత్ వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో అజిత్ తన అనుయాయులను వేర్వేరు పేర్లతో ఎన్నికలలో నిలబెట్టి, బిజెపి మళ్లీ గెలిచేందుకు సహాయపడతాడని వారంటున్నారు. అజిత్‌కున్న ప్రజాదరణ తెలిసిన కాంగ్రెసు అతన్ని కూడా అభ్యర్థులను సూచించమంది. అతన్ని ప్రోత్సహిస్తే యితర కాంగ్రెసు నాయకులు సహకరించరు. పక్కన పడేస్తే ప్రజలకు కోపం వస్తుంది. ఎలాగైనా అతనితో తంటానే!
– ఎమ్బీయస్ ప్రసాద్