ఎన్‌సిపి పేచీలు

మహారాష్ట్రలో ఎన్‌సిపి కాంగ్రెసు పేచీలు ముదురుతున్నాయి. సెప్టెంబరులో కాంగ్రెసు ఉపాధ్యకక్షుడు రాహుల్‌ తన కార్యకర్తలతో ఎన్‌సిపితో పొత్తు లేని ఎన్నికలకు మనం సిద్ధపడాలి, మనం సొంతంగా బలం పెంచుకోవాలి అని ఉద్బోధించాడు. ఎన్‌సిపి కార్యకర్తలేమో 2009…

మహారాష్ట్రలో ఎన్‌సిపి కాంగ్రెసు పేచీలు ముదురుతున్నాయి. సెప్టెంబరులో కాంగ్రెసు ఉపాధ్యకక్షుడు రాహుల్‌ తన కార్యకర్తలతో ఎన్‌సిపితో పొత్తు లేని ఎన్నికలకు మనం సిద్ధపడాలి, మనం సొంతంగా బలం పెంచుకోవాలి అని ఉద్బోధించాడు. ఎన్‌సిపి కార్యకర్తలేమో 2009 లో చేసుకున్న సీట్ల పంపిణీ విధానమే కొనసాగాలంటూ డిమాండ్‌ చేశారు. కార్యకర్తల సమావేశం జరిగాక బయటకు వచ్చిన శరద్‌ పవార్‌ ''కాంగ్రెసుతో మాకు ఘర్షణ ఏమీ లేదు'' అని ప్రకటన చేశాడు. ఇంకో వారం తిరక్కుండా ఓ సభలో నితిన్‌ గడ్కరీతో వేదిక పంచుకుని, ఫోటోలు దిగి ''రాజకీయాల్లో అస్పృశ్యులు ఎవరూ లేరు'' అన్నాడు. శరద్‌ పవార్‌ అంటే అస్సలు పడని బిజెపి నాయకుడు గోపీనాథ్‌ ముండేకు నితిన్‌ ప్రత్యర్థి. అందువలన అతన్ని చేరదీయడం సహజమే. ఇక్కడ కాస్త ముందుచూపు కూడా వుంది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెసుకు గాని, బిజెపికి గాని పూర్తి మెజారిటీ రాని పక్షంలో ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి కాంగ్రెసు లేదా బిజెపిలలో ఎవరో ఒకరి సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. సందర్భం బట్టి లెఫ్ట్‌ను కూడా ఆకట్టుకోవడానికి చూడవచ్చు. ఆ కూటమికి నాయకత్వం వహించడానికి అందరిలో సీనియర్‌ నాయకుడైన శరద్‌ పవార్‌ ఉబలాట పడుతున్నారు. అందువలన అన్ని పార్టీలతోనూ సఖ్యత నెరపాలని అతని ప్రయత్నం. సొంత రాష్ట్రంలో కాంగ్రెసుతో, జాతీయ స్థాయిలో బిజెపితో స్నేహంగా వుంటూనే లెఫ్ట్‌వాళ్లతో చెడగొట్టుకోవటం లేదు. 

దీనికి గాను అతను సొంత రాష్ట్రంలో, సొంత పార్టీలో బలం చెదిరిపోకుండా చూసుకోవాలి. అతని సోదరుడి కుమారుడు అజిత్‌ పవార్‌ బలమైన ప్రత్యర్థిగా తయారయ్యాడు. పార్టీ శరద్‌, అజిత్‌ వర్గాలుగా చీలిపోతోంది. అజిత్‌ను అదుపులో పెట్టడానికి శరద్‌ తన కూతురు సుప్రియా మూలేను ముందుకు నెడుతున్నాడు. 'యువతీ రాష్ట్రవాదీ' అనే పేర తన పార్టీ మహిళా విభాగం ఏర్పాటు చేసి సుప్రియ చేతిలో పెట్టాడు. ఆమె ఆ పేరు చెప్పుకుని రాష్ట్రమంతా తిరిగి తన పలుకుబడి పెంచుకుంటోంది. దీనికి తోడు తన ట్రస్టు 'యశ్వంతరావు చవాన్‌ ప్రతిష్టాన్‌'కు ఆమెను అధ్యకక్షురాలిగా చేశాడు. ఇలా పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తూనే కాంగ్రెసుతో రకరకాల పేచీలు పెట్టుకుంటున్నాడు. వాటిలో తాజాది – ముంబయి పోలీసు కమిషనర్‌గా ఎవర్ని నియమించాలనే అంశం. ప్రస్తుతం వున్న సత్యపాల్‌ సింగ్‌ డిజిపిగా వెళ్లిపోబోతున్నారు. ఆయన స్థానంలో రావడానికి ముగ్గురు, నలుగురు అధికారుల పేర్లు షార్ట్‌ లిస్ట్‌ చేశారు. వారిలో ఎంపిక చేసే అధికారం ఎప్పటిలాగా తమకే వుండాలని హోం శాఖను నిర్వహిస్తున్న ఎన్‌సిపి అభిప్రాయం. వాళ్ల మాట యీసారి చెల్లనీయకూడదని కాంగ్రెసు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చౌహాన్‌ పట్టుదల. 

అయితే కాంగ్రెసు తరఫున కాండిడేట్‌ ఎవరో యిప్పటికీ తేలలేదు. కేంద్ర హోం మంత్రి షిండే ఎడిజిపి (ట్రాఫిక్‌)గా పనిచేస్తున్న విజయ్‌ కాంబ్లేకు ఆ పదవి యివ్వాలని అంటారు. రాష్ట్ర కాంగ్రెసు ఎడిజిపి (లా అండ్‌ ఆర్డర్‌)గా పని చేస్తున్న అహ్మద్‌ జావేద్‌కు యివ్వాలని అంటోంది. ఎన్నికల సంవత్సరంలో ఒక ముస్లిముకు యిలాటి ముఖ్యమైన పదవి యిస్తే ముస్లిములను మురిపించినట్లు అవుతుందని వాళ్ల లెక్క. ఎన్‌సిపి ఎవరికి మద్దతు యిస్తోందో యింకా తెలియలేదు కానీ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌ చీఫ్‌గా వున్న రాకేష్‌ మారియా వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. రాకేష్‌ అంటే అందరికీ గౌరవమే. టెర్రరిజం మూలాలు కనిపెట్టి అణచడంలో అతని కృషి అమోఘం. అయితే యిటీవలే అతనిపై చిన్న మరక పడింది. పుణె బేకరీలో పేలుడుకు కారణం హిమాయత్‌ బేగ్‌ అని రాకేష్‌ టీము కనిపెట్టి అతనిపై కేసు పెట్టి మరణశిక్ష పడేట్లు చేశారు. ఆ పేలుడుకు సూత్రధారి ఐన యాసిన్‌ భత్కల్‌ యిటీవలే పట్టుబడ్డాడు. అతను 'పుణె పేలుడుకి, హిమాయత్‌కు సంబంధం లేదు' అని పోలీసులకు చెప్పాడు. దాంతో రాకేష్‌ సామర్థ్యంపై కొద్దిపాటి అనుమానం కలిగింది. వీటి మాట ఎలా వున్నా ఎవర్ని నియమించాలన్నదానిపై ఎన్‌సిపి కాంగ్రెసుతో పేచీ పెట్టుకుంటోదన్నది గమనార్హం. ఈ పేచీల ద్వారా కాంగ్రెసు నుండి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రాబట్టాలని ప్రయత్నం. ఎందుకంటే శరద్‌ ప్రస్తుతానికి కాంగ్రెసుతో తెగతెంపులు చేసుకునే మూడ్‌లో లేడు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]