పవన్‌ రాజకీయాల్లోకి రాడట

పవన్‌కళ్యాణ్‌ ఆల్రెడీ ఓ సారి రాజకీయాల్లోకొచ్చాడు, ‘అన్నయ్య’ కోసం. యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకున్న పవన్‌, ఆ తర్వాత రాజకీయాలకు దూరమైపోయాడు. తన పనేదో తాను చూసుకూంటూ, సినిమాల్లో కొనసాగుతోన్న…

పవన్‌కళ్యాణ్‌ ఆల్రెడీ ఓ సారి రాజకీయాల్లోకొచ్చాడు, ‘అన్నయ్య’ కోసం. యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రజారాజ్యం పార్టీ బాధ్యతల్ని భుజాన వేసుకున్న పవన్‌, ఆ తర్వాత రాజకీయాలకు దూరమైపోయాడు. తన పనేదో తాను చూసుకూంటూ, సినిమాల్లో కొనసాగుతోన్న పవన్‌ మళ్ళీ రాజకీయాల్లోకొస్తాడంటూ మీడియాలో జరుగుతోన్న ప్రచారం అంతా ఇంతా కాదు.

ఈ ప్రచారంపై స్పందించిన సినీ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి, పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లోకి రాడని తేల్చేశారు. పోసాని పెదవి విప్పితే ఎలా వుంటుంది.? పవన్‌ విషయంలోనూ ఆయన అలానే స్పందించారు. రాజకీయాలు ప్రస్తుతం వ్యభిచారం కన్నా హీనంగా తయారయ్యాయనీ, ఓట్లేసే ప్రజల్లో సైతం నిజాయితీ లోపించిందని పోసాని చెప్పుకొచ్చారు.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోసాని పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. ఆ ఎన్నికల్లో తాను డబ్బు ఖర్చుపెట్టలేదనీ, కార్యకర్తలకు సైతం మందు పోయలేదనీ, అందుకే ఓడిపోయానన్నారు పోసాని. రాజకీయాలు ఈ స్థాయిలోకి దిగజారిపోయాక, పవన్‌ వచ్చి కలుషితం అయిపోవడం తప్ప, ఆయన రాజకీయాల్ని ప్రక్షాళన చేసే అవకాశమే వుండదని పోసాని స్పష్టం చేశారు.

‘అత్తారింటికి దారేది’లో పవన్‌తో కలిసి నటించిన పోసాని, తనకు పవన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయనీ, ఆయన వ్యక్తిత్వం తెలిసినవాడిగా, టీడీపీలోకి పవన్‌ వెళ్తున్నాడన్న వార్తల్లో నిజం లేదని ఖచ్చితంగా చెప్పగలనంటున్నారు.