ఒకప్పుడు అగ్ర హీరోల్లో ఒకడైన అక్కినేని నాగార్జున యువతరం రాకతో వెనుకబడ్డారు. మునుపటి కంటే వేగం పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నా కానీ ఆయన చెప్పుకోతగ్గ విజయాలు అందుకోవడం లేదు. ఈమధ్య కాలంలో నాగార్జున నటించిన సినిమాలన్నీ జస్ట్ యావరేజ్ రేంజ్‌తో ఆగిపోతున్నాయి. 2004లో మాస్ చిత్రంతో విజయం అందుకున్న తర్వాత మళ్లీ నాగార్జున అంతటి విజయాన్ని అందుకోలేదు.
ఈవారంలో రాబోతున్న భాయ్‌తో తిరిగి అలాంటి సక్సెస్ చవిచూస్తారా? లేటు వయసులో నలభై కోట్ల వసూళ్లు సాధించి తన సత్తా చాటుకుంటారా? ఇంతవరకు నాగ్ కెరీర్లో ముప్పయ్ కోట్ల షేర్ దాటిన సినిమా లేదు. భాయ్‌తో ఆ లోటు తీరిపోతుందని ఫాన్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి కానీ రాంగ్ సీజన్లో రిలీజ్ కావడం ప్రతికూలం కావచ్చు.
భాయ్ చిత్రాన్ని నాగార్జున స్వయంగా నిర్మించడం వల్ల దీనిపై అభిమానులకి భరోసా కాస్త ఎక్కువే ఉంది. దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో నాగ్‌కి విజయాలు వచ్చాయి కాబట్టి ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. రెండు హిట్స్ కొట్టిన వీరభద్రమ్ ఈ చిత్రంతో హ్యాట్రిక్ పూర్తి చేస్తాడని అనుకుంటున్నారు. ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి… కాకపోతే నాగార్జున సినిమాని థియేటర్లో చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించాలంతే!