చట్టాల్ని సృష్టించిన వనితలు
నిర్భయ చట్టం రూపొందడానికి ఒక మహిళ బలి కావడం చూశాం. మహిళా సంక్షేమానికి ఉద్దేశించిన ఇలాటి చట్టాలు గతంలో కూడా రూపొందాయి. వాటి రూపకల్పనకు సమిధగా మారిన వనితల బలిదానాలు ఏమయ్యాయో తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుంది.
సతీ సహగమనాన్ని నిషేధిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం 1987లో ఒక చట్టం చేసింది. దానికి కారణం దేవరాలా అనే ఊళ్లో రూప్ కువర్ అనే అమ్మాయి సతీసహగమనం చేసుకోవడం. సతీసహగమనాన్ని 1829లోనే నిషేధించినా, అప్పుడప్పుడు జరుగుతూ వచ్చాయి. కానీ అలా చేసుకునే మహిళలలో ఎక్కువమంది చదువురానివాళ్లే ! అయితే రూప్ కాన్వెంటులో చదువుకున్న అమ్మాయి. సతీ సహగమనం చేసుకున్నవారిని దేవతలుగా పూజించడం జరుగుతోంది. అది చూసి తక్కినవాళ్లు కూడా చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఉదాసీనంగా వుండడం చేతనే యీ పురాతన దురాచారం మళ్లీ ఊపిరి పోసుకుంటోందంటూ దేశమంతా గగ్గోలు పెట్టింది. అప్పుడు రాజస్థాన్ రూప్ బంధువులైన 11 మందిపై కేసులు పెట్టి, యీ చట్టాన్ని ప్రవేశపెట్టింది. నిందితుల్లో మావగారు సుమేర్ సింగ్ షెకావత్, అప్పటికి మైనరుగా వున్న మరిది, సతీ ఆచారానికి ప్రచారం కల్పిస్తూ సభలు ఏర్పాటు చేసిన స్థానిక రాజకీయనాయకుడు.. అందరూ వున్నారు. అంతేకాదు, సతీ సహగమనం ఎంత దుష్టాచారమో చెప్పే పాఠాన్ని రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లో ఒక అంశంగా పెట్టింది. కేసు ఒక కోర్టు నుండి మరో కోర్టుకి తిరుగుతూ పోయింది. చివరకు 16 ఏళ్ల తర్వాత అందర్నీ విడిచిపెట్టేశారు. వాళ్లందరూ తమ వంశంలో సతి జరిగినందుకు సిగ్గుపడడం లేదు. మాకు గర్వంగా వుంది అంటున్నారు.
సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్‌ప్లేస్ చట్టం అని నాలుగు నెలల క్రితం రాష్ట్రపతి ఆమోదం పొందింది. ఇది రూపొందడానికి కారణం 21 ఏళ్ల క్రితం రాజస్థాన్‌లోని భటేరీ గ్రామంలో రాజస్థాన్ ప్రభుత్వోద్యోగిని బలాత్కారానికి గురవడం. భువరీదేవి అనే ఆ నిరక్షరాస్యురాలు రాజస్థాన్ ప్రభుత్వం చేత కమ్యూనిటీ వర్కర్‌గా నియమించబడిరది. గ్రామీణ మహిళల్ల్లో సాంఘికచైతన్యం తేవడం ఆమె బాధ్యతల్లో ఒకటి. తన వూళ్లో గుజ్జర్ కులస్తుల్లో జరుగుతున్న ఒక బాల్యవివాహాన్ని అడ్డుకోవడానికి ఆమె ప్రయత్నించింది. దాంతో మండిపడిన ఆ బాలిక బంధువులు ఐదుగురు యీమెపై అత్యాచారం జరిపారు. ఈమె వారిపై ఫిర్యాదు చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడలేదు. ఆమె ఒంటరిగా కేసు పోరాడిరది. 1995లో ట్రయల్ కోర్టు నిందితులందరినీ విడుదల చేసేసింది. పెద్ద కులస్తులైన గుజ్జర్లు ఒక తక్కువ కులం దాన్ని బలాత్కరించి వుండరని కోర్టు అభిప్రాయం. పైగా నిందితుల్లో మేనమామ, మేనల్లుడు వరుస వున్నవాళ్లున్నారు. వాళ్లిద్దరూ ఒకే స్త్రీని ఎలా అనుభవిస్తారు? వరస కుదరదు కదా అని సందేహం వెలిబుచ్చింది. ఈ తీర్పుపై దేశమంతా మండిపడిరది. సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. 1997లో సుప్రీం కోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకనుగుణంగా యిన్నాళ్లకు యీ చట్టం తయారైంది. కానీ భువరీదేవి కేసు మాత్రం రాజస్థాన్ హై కోర్టులో 17 ఏళ్లగా పెండిరగులో వుంది. ఇప్పటిదాకా ఆమెకు న్యాయం జరగలేదు. మీడియా కూడా ఆమెను మర్చిపోయింది. కానీ ఆమె గట్టిపిండం. ఊరు విడిచి పారిపోలేదు. వెక్కిరింతలు సహిస్తూనే ప్రజా హక్కుల కోసం పనిచేసే సంస్థల్లో పనిచేస్తూ వుంది.
భారతదేశపు రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన షా బానో ఉదంతం మరీ ఆసక్తికరం. ఇండోర్‌లో ఒక ముస్లిం లాయరుగారి భార్య షా బానో. ఆమె ద్వారా అయిదుగురు పిల్లలు పుట్టిన తర్వాత ఆ లాయరుగారు మరో అమ్మాయిపై మనసు పడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు యీమె వయసు 55. గత్యంతరం లేక సవతితో సహా ఒకే యింట్లో నివసించింది. పదేళ్లు యిలా గడిచాక ఆ రెండో భార్య యీమెను వదిలేయమని భర్తను పీడిరచింది. 1975లో ఆయన యీమెను వదిలేశాడు. భరణం ఏమీ యివ్వలేదు. పైలట్ ట్రెయినింగ్ తీసుకుంటూన్న కొడుకు చదువు మానేసి పనిలోకి దిగాల్సి వచ్చింది. ఇంట్లో ఏమీ డబ్బు లేకపోవడంతో షా బానో మనోవర్తి కోసం కోర్టుకి వెళ్లింది. ఇస్లాం పర్శనల్ లా ప్రకారం నెలనెలా మనోవర్తి యివ్వనక్కరలేదని భర్త వాదించాడు. కింది కోర్టుల్లో ఓడిపోతున్నా పంతం కొద్దీ పైకి అప్పీలు చేస్తూ పోయాడు. చివరకు సుప్రీం కోర్టు ‘పెళ్లి పర్శనల్ లా ప్రకారం జరిగినా, మనోవర్తి మాత్రం నెలనెలా యివ్వాల్సిందే’ అని తీర్పు చెప్పింది.
ఈ తీర్పు రాగానే ముస్లిం పెద్దలందరూ షా బానోపై మండిపడ్డారు. ఒక ముస్లిం మహిళవై వుండి ముస్లిం సమాజం పరువు తీశావన్నారు. మతపెద్దల దగ్గరకు వెళ్లి పరిష్కారం చేసుకోవాలి కానీ కోర్టుకెందుకు వెళ్లావన్నారు. ఈ గోల భరించలేక ఆమె మనోవర్తి వద్దు అంది. అయినా ముస్లిం మతఛాందసులు అంతటితో ఆగలేదు. సుప్రీం కోర్టు మతవిషయాలలో జోక్యం చేసుకుంటోంది, రాజీవ్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పించారు. ముస్లిం ఓట్లు పోతాయన్న భయంతో సుప్రీం కోర్టు తీర్పును నీరు కార్చేందుకు రాజీవ్ ముస్లిం మహిళల మనోవర్తి గురించి ‘ముస్లిం విమెన్ (ప్రొటక్షన్ ఆఫ్ రైట్స్ ఆన్ డైవోర్స్), 1986 చట్టం పాస్ చేయించాడు. దాని ప్రకారం విడాకులు యిచ్చిన తర్వాత ముస్లిం భర్త తన భార్యకు ఇద్దత్ పీరియడ్‌లో (నాలుగు నెలల పది రోజులు) మాత్రమే మేన్‌టేనెన్స్ చెల్లిస్తే చాలు.
ఇది తిరోగమన చర్య, ముస్లిం ఛాందసవాదుల ఓట్ల కోసం రాజీవ్ పతనమయ్యాడు అని నాగరిక సమాజం గగ్గోలు పెట్టింది. అయితే దానికి ప్రతిగా హిందూ ఛాందసవాదులను కూడా సంతృప్తి పరుద్దాం అనే ఉద్దేశంతో ఎన్నేళ్లగానో మూసివున్న అయోధ్య గుడిని రాజీవ్ తెరిపించాడు. ఒకసారి తెరిచాక ఆ కథ చాలా దూరం వెళ్లింది. చివరకు రాజీవ్ ఓడిపోవడం, బిజెపి అధికారంలో రావడానికి ముఖ్యకారణమైంది. ఈ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి కొందరు వెళ్లారు. విడాకులు తీసుకోకుండా భర్తతో విడిపోయిన ముస్లిం మహిళలకు మనోవర్తి యివ్వాలని కోర్టు చెప్పింది. విడాకులు తీసుకున్నవారికి మాత్రం లాభం చేకూరలేదు. ఆ విధంగా చూస్తే షా బానో పరాజితురాలే. మనోవర్తి అక్కరలేదని రాసి యిచ్చిన డాక్యుమెంటుపై ఆమెచేత వేలిముద్ర వేయించిన పెద్దలెవరూ తర్వాత ఆమెకు అండగా ఎవరూ నిలబడలేదు. కేసు గెలిచినా, సమాజంలో ఓడిపోయిన ఆమె చనిపోయేవరకు భర్తను నిందించలేదు. తన కర్మ కాలిందని మాత్రం బాధపడేది. ఆమె పిల్లలు నానా అవస్థలు పడి ఏదో ఒక స్థాయికి వచ్చారు.
– ఎమ్బీయస్ ప్రసాద్