ఎమ్బీయస్‌ : న్యూస్‌, వ్యూస్‌, రివ్యూస్‌ – 32

విమర్శలు సహించబడవు  Advertisement మేధావుల విమర్శలను సహించలేమని యుపిఏ ప్రభుత్వం చాటుకుంటోంది. యోగేంద్ర యాదవ్‌ సోషల్‌ సైంటిస్టుగా, సెఫాలజిస్టుగా ప్రసిద్ధులు. ఎన్నికల సమయంలో సర్వేలు నిర్వహించడం, ఫలితాలను విశ్లేషించడంలో యోగేంద్ర దిట్ట. ఆయన వంటి…

విమర్శలు సహించబడవు 

మేధావుల విమర్శలను సహించలేమని యుపిఏ ప్రభుత్వం చాటుకుంటోంది. యోగేంద్ర యాదవ్‌ సోషల్‌ సైంటిస్టుగా, సెఫాలజిస్టుగా ప్రసిద్ధులు. ఎన్నికల సమయంలో సర్వేలు నిర్వహించడం, ఫలితాలను విశ్లేషించడంలో యోగేంద్ర దిట్ట. ఆయన వంటి మేధావి యుజిసి (యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌) బోర్డులో వుండడం మంచిదని అనుకున్న యుపిఏ ప్రభుత్వం ఆయన్ను రెండేళ్ల క్రితం నామినేట్‌ చేసింది. మొత్తం 11 మంది బోర్డులో వుంటారు. అయితే యోగేంద్ర చూసీచూడనట్లు పోయే రకం కాదు. ఆగస్టు 2012లో కపిల్‌ సిబ్బల్‌ యుజిసి బోర్డుకి ఒక లేఖ రాశారు – ‘పశ్చిమ బెంగాల్‌లో ప్రణబ్‌ ముఖర్జీ చదువుకున్న కాలేజీ ఒకటుంది. చదువు పూర్తయ్యాక దానిలో ఆయన ఉద్యోగం చేశారు కూడా. ఆ కాలేజీకి నిధులు యిమ్మనమని ప్రణబ్‌ కోరారు. ఆ కోరికను మన్నించమని నేను సిఫార్సు చేస్తున్నాను. ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలోని కాలేజీలకు మనం చేయూత యిచ్చి అక్కడి విద్యార్థులను ప్రోత్సహించినట్టు అవుతుంది.’ అని. బోర్డులో తక్కిన సభ్యులు తల వూపేలోపున యోగేంద్ర అసమ్మతి వ్యక్తం చేశారు. ‘‘దేశంలో అనేక గ్రామీణ ప్రాంతాలుండగా యీ ఒక్క కాలేజీకే గ్రాంట్‌ ఎందుకివ్వాలి?’’ అని. ఇది సహజంగా ప్రభుత్వానికి నచ్చలేదు. ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలా అని వేచి చూస్తోంది.

అన్నా హజారే లోక్‌పాల్‌ బిల్లు కోసం ఆందోళన చేపట్టినపుడు యోగేంద్ర దానిలో ఉత్సాహంగా పాల్గన్నాడు. ప్రభుత్వాన్ని విమర్శించాడు. అంతటితో ఆగి వుంటే బాగుండేది. ఆ ఉద్యమానికి కొనసాగింపుగా అరవింద్‌ కేజ్రివాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టినపుడు యితను మద్దతు యిచ్చాడు. అంతేకాదు, 2012 నవంబరులో ఆ పార్టీలో చేరాడు. ‘ఒక రాజకీయపార్టీలో చేరిన వ్యక్తిని యుజిసి బోర్డులో పెట్టవచ్చా?’ అంటూ ఓ కాబినెట్‌ మినిస్టర్‌ ఎచ్‌ఆర్‌డి (హ్యూమన్‌ రిసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌) మంత్రిత్వ శాఖకు ఓ మెయిల్‌ పెట్టారు. ఆ శాఖలోని అధికారులు యోగేంద్రను పిలిచి ‘రాజకీయాల్లోకి ఎందుకు దిగావయ్యా? దిగినా పైకి ఎందుకు చెప్పుకుంటున్నావు?’ అని మందలించారు. అనేక ప్రభుత్వ సంస్థల బోర్డుల్లో రాజకీయనాయకులను నియమించడం కొత్త కాదు కదా అనుకుని యితను పట్టించుకోలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రమంత్రి పళ్లంరాజు కాకినాడలోని జెఎన్‌ యూనివర్శిటీకి ఒక ఉపకారం చేద్దామనుకున్నారు. టీచర్‌ ఎడ్యుకేషన్‌కై ఇంటర్‌-యూనివర్శిటీ సెంటర్‌ ఒకటి పెట్టిద్దామని ప్రతిపాదించారు. రాజకీయనాయకులు తమ నియోజకవర్గాలకు యిలాటి సదుపాయాలు తెచ్చుకోవడం ఎప్పణ్నుంచో వున్నదే! కానీ యోగేంద్ర ‘‘సెంటర్‌ పెడితే పెట్టండి కానీ కాకినాడ లోనే ఎందుకు పెట్టాలి? ఒడిశాలోనో, మరో చోటో ఎందుకు పెట్టకూడదు?’’ అని ప్రశ్న లేవనెత్తాడు. దాంతో మంత్రిగారికి మండిపోయింది. కొద్ది రోజులకే యోగేంద్రకు ఎచ్‌ఆర్‌డి నుండి యోగేంద్రకు ఒక లేఖ వెళ్లింది – రాజకీయ పార్టీలో వున్న మిమ్మల్ని యుజిసి బోర్డులో  నుండి ఎందుకు తీసివేయకూడదో కారణం చూపించండి అని. అతను సమాధానం యిచ్చాడు కానీ ప్రభుత్వానికి అది రుచించలేదు. సంజాయిషీ బాగా లేదంటూ గత వారం రిటైర్‌ చేయించేసింది. యోగేంద్ర వదిలిపెట్టదలచలేదు. కోర్టుకి వెళుతున్నాడు. ఈ లోగా ప్రభుత్వం అతని స్థానంలో సంజయ్‌ ధాండేను యుజిసిలో నియమించింది. సంజయ్‌ కాన్పూరు ఐఐటికి డైరక్టరుగా పనిచేశాడు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫర్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మ్యాన్చుఫేక్చరింగ్‌ వ్యవస్థాపకుడు. కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (క్యాడ్‌)లో అంతర్జాతీయ ఖ్యాతి చెందినవాడు. 

సెంటర్‌ ఫర్‌ పాలసీ రిసెర్చ్‌ (సిపిఆర్‌)కి ప్రెసిడెంటుగా వున్న ప్రతాప్‌ భాను మెహతాను యుపిఏ1 ప్రభుత్వం నాలెజ్‌ కమిషన్‌లో సభ్యుడిగా నియమించింది. రిజర్వేషన్‌ పాలసీపై విభేదించి ఆయన ఆ కమిషన్‌ నుండి బయటకు వచ్చేశాడు. ఇటీవల ‘‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’’లో జులై 29 న ఓ వ్యాసం రాశాడు. యుపిఏ 2 ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ భ్రష్టు పట్టిస్తున్నా, మేధావులంతా మౌనంగా వున్నారు అని దాని యితివృత్తం. అది చదివి యుపిఏ ప్రభుత్వం మండిపడిరది. ప్రధానమంత్రి మీడియా సలహాదారు మెహతాకు వ్యతిరేకంగా ట్విటర్‌లో పోరాటం సాగిస్తున్నారు. ఈయనా తగ్గలేదు. రాహుల్‌ గాంధీ ఎందుకూ పనికి రాడని ధ్వజమెత్తాడు.ఇది ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి.

గూర్ఖాలు విదేశీయులా? 

తెలంగాణ ప్రకటన రాగానే గూర్ఖాల్యాండ్‌ ఉద్యమకారులు లేచి గుడారాల్లో కూర్చున్నారు. మాకూ ప్రత్యేకరాష్ట్రం కావాలన్నారు. మా ఉద్యమం నూరేళ్లకు పైగా సాగుతోందన్నారు. అడపాదడపా వారు తీవ్రంగా ఉద్యమిస్తున్నారన్న కారణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మమతా బెనర్జీ వారికి బోర్డు ఏర్పరచి ప్రత్యేక ప్రతిపత్తి యిచ్చి ఊరుకోబెట్టింది. ఇప్పుడు మళ్లీ తిరుగుబాటు జండా పట్టుకోవడంతో యిక లాభం లేదని, వారిని నిలువుగా చీల్చడానికి ఆమె ఒక యుక్తిని పన్నింది. గూర్ఖాల్యాండ్‌కై ఉద్యమం చేసేవారు భారతీయులు కారు, నేపాల్‌ నుండి వచ్చి యిక్కడ అక్రమంగా స్థిరపడినవారు అనే నినాదాన్ని చేపట్టి, ప్రజల్లోకి తీసుకుపోతోంది. 

దానికి భూమికగా ఆగస్టు 8 న ఆమె పార్టీ ఉపాధ్యక్షుడు దీపక్‌ ఘోష్‌ ఆమెకు ఒక బహిరంగ లేఖ రాశాడు – ‘‘డార్జిలింగ్‌ ప్రాంతంలో వున్న ప్రజల్లో ఎవరు నేపాల్‌ నుంచి వచ్చారో తెలుసుకోవడానికి 1931 నాటి జనాభా లెక్కల ఆధారంగా మీరు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి. వారందరినీ ఏరిన తర్వాత వాళ్లందరి పేర్లను ఓటర్ల లిస్టులోంచి కొట్టి పారేసి నేపాల్‌ తిరిగి పంపించేయాలి. అప్పుడు గూర్ఖాల్యాండ్‌ ఉద్యమం ఏ మేరకు మిగిలి వుంటుందో మీరే చూద్దురు గాని.’’ అని. ఈ లేఖ చేరిన నెల్లాళ్లకు మమతా బెనర్జీ ఆ పర్వతప్రాంతాలకు వెళ్లి ఒక బహిరంగ సభ ఏర్పాటులో మాట్లాడిరది. ఆ సభ ఏర్పాటు చేసినది – లెప్చా ట్రైబల్‌ అసోసియేషన్‌. ఆ సభలో మాట్లాడుతూ మమతా గర్జించింది – ‘‘డార్జిలింగ్‌లో తొలి నాళ్లనుండి వున్నవాళ్లు లెప్చాలు. గూర్ఖాలు కాదు. వారు బెంగాల్‌నుండి విడిపోతామని, తమకై ప్రత్యేకంగా లెప్చాల్యాండ్‌ ఏర్పాటు చేయాలనీ ఎప్పుడైనా అడిగారా? అలా అడిగేవాళ్లు వేరేవాళ్లు.’’ అని. 

గూర్ఖాల్యాండ్‌ ఉద్యమం మళ్లీ వూపు అందుకోగానే బెంగాల్‌లో మేధావివర్గం దాన్ని అదుపుచేద్దామని చూస్తున్నారు. ఆ ఉద్యమం వెనక విదేశీ శక్తులున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ‘నేపాల్‌ చైనాతో స్నేహం చేస్తోంది. మనకు పాకిస్తాన్‌, బాంగ్లాదేశ్‌లతో సరిహద్దులు పటిష్టంగానే వున్నాయి కానీ నేపాల్‌తో హద్దులు చాలా బలహీనంగా వున్నాయి. ఎవరు పడితే వారు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేసేట్టు వుంది పరిస్థితి. ఉగ్రవాది భత్కల్‌ నేపాల్‌ సరిహద్దుల్లోనే దొరికాడని యీ సందర్భంలో గుర్తుంచుకోవాలి’ అని నెట్‌లో రాస్తున్నారు. యూనియన్‌ హోం మినిస్ట్రీ కూడా ఉద్యమం వెనుక నేపాల్‌ హస్తం లేదని కొట్టి పారేయలేమంటూ లీకులు యిస్తోంది. నిజానికి 1950లో జరిగిన ఇండో-నేపాల్‌ ఒప్పందం ప్రకారం ఎవరు భారతీయులో, ఎవరు నేపాలీలో సులభంగా నిర్వచించవచ్చు. 1931 జనాభా లెక్కల ప్రకారం ఎవరు ఏ దేశంలో వుంటే ఆ జాతీయుల కిందే లెక్క. (1941లో యుద్ధం జరుగుతున్న కారణంగా సెన్సస్‌ జరగలేదు.) 1931 తర్వాత నేపాల్‌ నుండి భారత్‌కు వచ్చి స్థిరపడవచ్చు కానీ వాళ్లు నేపాలీ వాళ్ల గానే పరిగణించాలి. ఈ ఒప్పందాన్ని అమలు చేయడం మొదలుపెడితే గూర్ఖాల్యాండ్‌ నాయకులందరూ విదేశీయులుగానే తేల్తారు. ఇక వారికి స్థానికుల మద్దతు వుండదు. ఇదీ మమతా బెనర్జీ ప్రణాళిక.

 – ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]