పయ్యావుల కు బాబు రెడ్‌సిగ్నల్‌!

తాను స్పష్టంగా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లా? లేదా, రాష్ట్రాన్ని విభజించేసి సీమాంధ్రకు న్యాయం చేయమని పోరాడుతున్నట్లా? అనే క్లారిటీ ఇవ్వకుండా.. పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉన్న ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అయితే…

తాను స్పష్టంగా సమైక్య రాష్ట్రం కోసం పోరాడుతున్నట్లా? లేదా, రాష్ట్రాన్ని విభజించేసి సీమాంధ్రకు న్యాయం చేయమని పోరాడుతున్నట్లా? అనే క్లారిటీ ఇవ్వకుండా.. పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తూ ఉన్న ఘనత తెలుగుదేశం పార్టీకి చెందుతుంది. అయితే ఆ పార్టీకి చెందిన తెలంగాణ నాయకులు చాలా సందర్భాల్లో మౌనం పాటిస్తూ నెట్టుకొస్తున్నారు గానీ.. సీమాంధ్ర నాయకులు మాత్రం.. ప్రజల వద్దకు వెళ్లడానికి తాము సమైక్యగానం ఆలపించక గత్యంతరం లేని పరిస్థితిలోనే ఉన్నారు. అయితే ఎటూ తేల్చకుండా తన షెడ్యూలు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు… తనదో దారిగా ముందుకు వెళుతున్నారు. 

అయితే రాష్ట్ర విభజన అంశాన్ని కోర్టు ద్వారా అడ్డుకోవడానికి తెలుగుదేశం నాయకులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేయబోతున్నారు. అయితే కోర్టు ద్వారా విభజన ప్రక్రియను అడ్డుకోవడంలో సాధ్యాసాధ్యాలు అంత త్వరగా తేలేవి కాదు గానీ.. మొత్తానికి సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి మాత్రం కేశవ్‌ నిర్ణయించుకున్నారు. 

అయితే పయ్యావుల కేశవ్‌ చేస్తున్న ఈ ప్రయత్నానికి పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం రెడ్‌సిగ్నల్‌ చూపించినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సుప్రీం కోర్టులో కేసు తెలుగుదేశం పార్టీ వేసిందనే పేరు రాకుండా, సమైక్య రాష్ట్రం కోసం వేసిన కేసును తెలుగుదేశం పార్టీకి అంటగట్టకుండా ఉండేలా ఏమైనా చేయాల్సిందిగా.. చంద్రబాబునాయుడు, పయ్యావుల కేశవ్‌కు వ్యక్తిగతంగా సూచించినట్లు సమాచారం. 

పయ్యావుల తొలుత అధినేత మాటలతో ఖంగు తిన్నప్పటికీ తర్వాత.. ఆయన వ్యూహాన్ని అర్థం చేసుకుని.. ఇది కేవలం తను వ్యక్తిగత హోదాలోనే వేస్తున్న కేసుగా ఇప్పుడు మీడియా ముందు చెప్పుకుంటున్నారు. ‘సీమాంధ్రుల ఆకాంక్షలను నెరవేర్చడానికి నేను వ్యక్తిగతంగా ఈ పిటిషన్‌ వేయడానికి సిద్ధపడ్డా’ అంటూ పయ్యావుల కేశవ్‌ వెల్లడిస్తున్నారు. పార్టీ నాయకులు సమైక్యం అనే మాట పలకడానికి సిద్ధమైనా కూడా చంద్రబాబునాయుడు రెడ్‌సిగ్నల్‌ చూపిస్తున్నారంటే.. ఆయన ఎంత దారుణంగా ఈ వ్యవహారంలో  ఎటూ తేల్చని వైఖరితో లబ్ధిపొంద జూస్తున్నారో స్పష్టంగా అర్థం అవుతోంది.