ఎమ్బీయస్‌ : చట్టానికి లాలూ చిక్కిన విధం- 4/4

1997 మేలో బిశ్వాస్‌ పట్నా ఆఫీసుకి ఉత్తమ్‌ వెళ్లాడు. బిశ్వాస్‌ లోపల మీటింగులో వున్నాడు. బయట అతని పర్శనల్‌ అసిస్టెంటు ముఖ్యమైన కాగితాలను జిరాక్స్‌ తీసుకుంటున్నాడు. తన బాస్‌కు, ఉత్తమ్‌కు స్నేహం వుందని తెలుసు…

1997 మేలో బిశ్వాస్‌ పట్నా ఆఫీసుకి ఉత్తమ్‌ వెళ్లాడు. బిశ్వాస్‌ లోపల మీటింగులో వున్నాడు. బయట అతని పర్శనల్‌ అసిస్టెంటు ముఖ్యమైన కాగితాలను జిరాక్స్‌ తీసుకుంటున్నాడు. తన బాస్‌కు, ఉత్తమ్‌కు స్నేహం వుందని తెలుసు కాబట్టి ఆ అసిస్టెంటు ‘సార్‌ వచ్చేదాకా యీ మ్యాగజైన్‌ చూస్తూండండి సార్‌’ అంటూ కూర్చోబెట్టాడు. ఉత్తమ్‌ అక్కడే కూర్చుని ఆ కాగితాల కేసి చూస్తూ వున్నాడు. అవేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం వున్నా సభ్యత కాదని వాటిని చేతిలోకి తీసుకోలేదు. ఇంతలో అసిస్టెంటుని లోపలికి పిలిచారు. అతను అలా వెళ్లగా చూసి యితను చటుక్కున ఓ కాపీని జేబులోకి దోపేశాడు. బిశ్వాస్‌తో మాట్లాడి తన ఆఫీసుకి వచ్చాక చూస్తే విచారణ సందర్భంగా ఐటీ ఆఫీసర్లు ఆ ట్రావెల్‌ ఏజన్సీ వాడి నుండి రాబట్టిన సమాచారం వుంది. వెంటనే మర్నాడే దాన్ని తన పత్రికలో వేసేశాడు. ఇంకేముంది, అంతా అల్లకల్లోలం! కాస్సేపటికే బిశ్వాస్‌ నుండి ఫోన్‌. ‘‘నీకు ఆ కాపీ ఎలా వచ్చింది? నేను యిచ్చి వుంటానని వీళ్లంతా నింద వేస్తున్నారు’’ అని. ‘‘నువ్వు యివ్వలేదు కదా. నా కెవరు యిచ్చారో చెప్పడం నా వృత్తిధర్మానికి విరుద్ధం. అలా చెప్పడం మొదలుపెడితే నీకు ట్రావెల్‌ ఏజన్సీ సమాచారం కూడా యివ్వగలిగేవాణ్ని కాను.’’ అన్నాడు ఉత్తమ్‌.

ఇలాటి వార్తలు ప్రచురించడం వలన ఉత్తమ్‌కు, లాలూకి బాగా చెడిపోయింది. ‘ఇంగ్లీషు పత్రికలు, ముఖ్యంగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అబద్ధాలు ప్రచారం చేస్తోంది.’ అంటూ లాలూ ఉపన్యాసాలు దంచేవాడు. అతని అనుచరులు పెద్ద నిరసన ప్రదర్శన చేపట్టిన సందర్భంగా టైమ్స్‌పై దాడి చేస్తారని బెదిరింపులు కూడా వచ్చాయి. ‘‘మీ పత్రిక ఆఫీసు యివాళ్టికి మూసుకుంటే మంచిది. అల్లరిమూకలు దాడి చేస్తే మేమేమీ చేయలేం’’ అంటూ డిజిపి ఉత్తమ్‌కు ఫోన్‌ చేశాడు. వెంటనే ఉత్తమ్‌ తన హెడాఫీసుకి ఫోన్‌ చేసి కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేయించాడు. గవర్నరుకు కూడా చెప్పాడు. అదే రాత్రి లాలూ నుండి ఫోన్‌ వచ్చింది. ‘‘ఫర్‌గెట్‌ అండ్‌ ఫర్‌గివ్‌’ అంటూ! 

చివరకు లాలూను అరెస్టు చేయడానికి జూన్‌ 17 న గవర్నరు అనుమతి యిచ్చాడు. లాలూ ముందస్తు బెయిల్‌ కోసం అప్లయి చేయడంతో సిబిఐ లాలూ యింటిపై, అతని బంధువుల యింటిపై దాడి కొన్ని దస్తావేజులు స్వాధీనం చేసుకుంది. చివరకు జూన్‌ 23 న సిబిఐ చార్జిషీటు ఫైల్‌ చేసి జులై 30 న అరెస్టు చేశారు. ఈ లోపున లాలూ జనతా దళ్‌ నుండి బయటకు వచ్చేసి సొంతంగా రాష్ట్రీయ జనతాదళ్‌ పేర సొంత పార్టీ పెట్టేశాడు. తను రాజీనామా చేసి తన స్థానంలో తన భార్య రబ్డీ దేవిని కూర్చోబెట్టాడు.

అరెస్టు కావడానికి కొన్ని రోజుల ముందు లాలూ ఉత్తమ్‌ను పిడబ్ల్యుడి గెస్ట్‌హౌస్‌కు ఒంటరిగా పిలిపించాడు.  అతనూ ఒంటరిగానే వున్నాడు. ‘‘నువ్వూ, బిశ్వాస్‌ స్నేహితులని నాకు తెలుసు. నా సంగతి అతన్ని చూసుకోమను. అతని సంగతి నేను చూసుకుంటాను. సిబిఐ హెడ్‌క్వార్టర్స్‌లో అతనిపై ఫిర్యాదులు వున్నాయి. అవి యిబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత నాది.’’ అన్నాడు లాలూ. 

‘‘మాకు స్నేహం ఏమీ లేదు. ఏదైనా సందర్భం వస్తే మీరు చెప్పిన సంగతి చెప్తాను. అంతకంటె నానుండి ఏదీ ఆశించకండి.’’ అని చెప్పి ఉత్తమ్‌ వచ్చేశాడు.

ఇది జరిగిన కొన్ని రోజులకు బిశ్వాస్‌ చార్జిషీటు ఫైల్‌ చేయబోతూ దాని ముసాయిదా చూపించడానికి ఉత్తమ్‌ను పిలిచాడు.  ‘చదివి ఎలా వుందో చెప్పు’ అంటూండగానే సిబిఐ డైరక్టర్‌ జోగీందర్‌ సింగ్‌ నుండి ఫోన్‌ వచ్చింది. ఉత్తమ్‌ లేచి వెళ్లిపోబోయాడు.  ‘ఫరవాలేదు, కూర్చో’ అంటూ బిశ్వాస్‌ ఫోన్‌ తీసుకున్నాడు. ఆ తర్వాత ‘నో సర్‌, సారీ సర్‌, ఐ కాన్ట్‌ డూ దిస్‌ సర్‌…’ అంటూనే వున్నాడు. ఫోన్‌ పెట్టేశాక అసలు విషయం తెలిసింది. అప్పుడు బిశ్వాస్‌కు అసిస్టెంటుగా, ప్రస్తుతం సిబిఐ డైరక్టరుగా వున్న రంజిత్‌ సిన్హా చేత జోగీందర్‌ సింగ్‌ వేరే రిపోర్టు తయారు చేయించాడు. దాన్నే అఫీషియల్‌ సిబిఐ రిపోర్టుగా కోర్టుకి సబ్మిట్‌ చేయాలని జోగీందర్‌ బిశ్వాస్‌ను ఒత్తిడి చేస్తున్నాడు. 

అనుకోకుండా తెలిసిన యీ సమాచారాన్ని ఎలా వినియోగించుకోవాలో ఉత్తమ్‌కు తోచలేదు. ఉన్నదున్నట్లు వేస్తే బిశ్వాస్‌, జోగీందర్‌ యిద్దరూ ఖండిస్తారు. రెండు రిపోర్టుల్లో వున్న వ్యత్యాసం ఏమిటో కూడా తెలియదు. ఉత్తమ్‌ తన టీముతో దీని గురించి చర్చించాడు. ‘‘జడ్జిలకు యీ సమాచారం చేరవేస్తే చాలు..’’ అన్నాడు ఒకతను. ‘‘ఎలా?’’ అడిగాడు ఉత్తమ్‌.

‘‘ఒక పెద్దాయన యింట్లో యివాళ పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. అక్కడకు వాళ్లు వస్తారు.’’ ‘‘రైఠో’’! 

తర్వాతి వాయిదాలో కోర్టువారు బిశ్వాస్‌ను ఉద్దేశించి జడ్జిలు అడిగారు ‘‘మీ పాత రిపోర్టులకు, యిప్పుడు సబ్మిట్‌ చేసిన కొత్త రిపోర్టుకు చాలా భేదం వుంది. ఎందుకలా? అసలు యిది మీరు తయారుచేసినదేనా?’’ అని. బిశ్వాస్‌ నిలబడి ‘‘ఇది నా రిపోర్టు కాదు, లార్డ్‌షిప్‌’’ అన్నాడు. అంతే, కోర్టు జోగీందర్‌ సింగ్‌కు మొట్టికాయలు వేసింది. ఐకె గుజ్రాల్‌ ప్రభుత్వం అతన్ని సిబిఐనుండి తప్పించి హోం మినిస్ట్రీలో స్పెషల్‌ సెక్రటరీగా వేసింది. గుజ్రాలే విచారణ సాగకుండా ఆగకుండా అడ్డుకున్నాడంటూ జోగీందర్‌ తర్వాతి రోజుల్లో ఆరోపించాడు. కానీ అప్పటి రోజుల్లోనే బిశ్వాస్‌ను కూడా బదిలీ చేద్దామని ప్రభుత్వం చూసింది. అటువంటిది ఏదైనా చేస్తే బదిలీ ఆపేస్తాం అంటూ హై కోర్టు వార్నింగ్‌ యిచ్చింది.

చాలా కేసుల్లో సిబిఐ విచారణ కొంతకాలం త్వరగా, కొంతకాలం మందకొడిగా సాగుతుంది. కొన్ని కేసుల్లో స్టాఫ్‌ లేరంటూ విచారణే మొదలుపెట్టదు. మరికొన్ని వాటిల్లో మధ్యలో చేతులెత్తేస్తుంది. ప్రతీ చర్యకు వెనకాల అనేక శక్తులు పనిచేస్తూంటాయని యీ కథనం వలన రుజువౌతోంది. 1993 నాటి కథ 20 ఏళ్ల తర్వాత యిప్పుడు బయటపడింది. ఈనాటి కేసులు బయటపడాలంటే రెండు, మూడు దశాబ్దాలు పడతాయేమో! ఇప్పటికైనా యిది బయటపెట్టినందుకు ఉత్తమ్‌ సేన్‌గుప్తాకు, ధైర్యంగా దాన్ని ప్రచురించిన  ‘‘ఔట్‌లుక్‌’’కు మనం ఋణపడాలి. ఇంతకీ ఉపేన్‌ బిశ్వాస్‌ యిప్పుడు ఎక్కడున్నారు? ఆయన ఎడిషనల్‌ డైరక్టరుగా ప్రమోషన్‌ పొంది రిటైర్‌ అయ్యాక, తృణమూల్‌ పార్టీలో చేరి బాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్‌ఫేర్‌ మినిస్టర్‌గా మమతా బెనర్జీ మంత్రివర్గంలో వున్నారు. ప్రచారం జోలికి వెళ్లకుండా సమర్థవంతంగా తన శాఖ నిర్వహిస్తారు. లాలూ జైలుకి వెళ్లినందుకు ఆనందమేనా అని స్నేహితులు అడిగితే ‘‘నా విధి నేను నిర్వర్తించాను. రిటైరయ్యాక బిహార్‌ వెళ్లలేదు, లాలూ కేసు ఎంతవరకు వచ్చిందో కనుక్కోనూ లేదు.’’ అని ఊరుకున్నాడు. (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

[email protected]

                                                       click here for part-3

                                                       click here for part-2

                                                       click here for part-1