ఎమ్బీయస్‌ : వెళితే మజ్జిగ పోశారు కానీ….

సీమాంధ్ర మంత్రులందరూ హఠాత్తుగా రాయబారులై పోయారు. ఎప్పటికైనా సీమాంధ్రుల కష్టాలు కేంద్రానికి నివేదిస్తారని మనం అనుకుంటూ వచ్చాం. వాళ్లు ప్లేటు ఫిరాయించి కేంద్రం అభిమతాన్ని చెప్పి సీమాంధ్రుల మెడలు వంచడానికి వచ్చారు. ‘వంచితేనే మీకు…

సీమాంధ్ర మంత్రులందరూ హఠాత్తుగా రాయబారులై పోయారు. ఎప్పటికైనా సీమాంధ్రుల కష్టాలు కేంద్రానికి నివేదిస్తారని మనం అనుకుంటూ వచ్చాం. వాళ్లు ప్లేటు ఫిరాయించి కేంద్రం అభిమతాన్ని చెప్పి సీమాంధ్రుల మెడలు వంచడానికి వచ్చారు. ‘వంచితేనే మీకు మంచిది, లేకపోతే మెడ తెగి పడుతుంది’ అని బెదిరిస్తున్నారు. ఈ రాయబారులకు నాయకత్వం వహిస్తున్నది – శ్రీమతి పురంధరేశ్వరి. ‘నాన్నగారు కృష్ణరాయబారం సీన్లలో రాణించారు కదా, నేను మాత్రం రాణి తరఫున రాయబారంలో రాణించలేనా?’ అనుకుని రంగంలోకి దిగారు. ఇంతకీ వీళ్లు ముక్తకంఠంతో చెప్పేది ఏమిటి? 

‘సమైక్యంగా వుండడం యింకా సాధ్యమే అంటూ చెప్పే కబుర్లు బూటకం. అలా నమ్మించడానికి చూసే కిరణ్‌ది నాటకం. నమ్మకండి. విభజన నిర్ణయం జరిగిపోయింది. ఆ నిర్ణయం తీసుకున్నదెవరు? మహామహురాలు, అమ్మలగన్నయమ్మ సోనియా, అల్లాటప్పా భారతీయురా లనుకున్నారా? మాఫియా పుట్టిన ఇటలీ నుండి దిగుమతి చేసుకున్న సామ్రాజ్ఞి. ‘‘గాడ్‌ఫాదర్‌’’ సినిమాలో అండర్‌వరల్డ్‌ డాన్‌ కొటేషన్‌ గుర్తుందా? ‘ఐ విల్‌ మేక్‌ ఏ ప్రపోజల్‌ విచ్‌ హీ కాన్ట్‌ రిఫ్యూజ్‌’ ! నా ప్రతిపాదన ఒప్పుకోకపోతే చంపి పారేస్తాను అని అన్యాపదేశంగా చెప్పడమన్నమాట. ఆవిడ ప్రతిపాదించిందంటే మనం చచ్చినట్టు ఒప్పుకుని తీరాల్సిందే, లేకపోతే చచ్చినట్టే లెక్క. ‘ఒప్పుకుంటే మనమే కాదు, మన భావి తరాలు కూడా చచ్చినట్టే కదా’ అంటూ నసక్కండి. మీరు ఎప్పుడు బతికున్నారు కనుక! మీలో జీవలక్షణం వుండి వుంటే మమ్మల్ని ఎప్పుడో నిలదీసేవారు. మేం చెప్పిన అబద్ధాలను ఎప్పుడో కనుక్కునే వారు. సరే, యింతకీ చెప్పేదేమిటంటే – విడిపోవడం ఖాయం. శివుని ఆజ్ఞ అయితే చీమ కుట్టకుండా మానేస్తుందా? సోనియా ఆజ్ఞ అయిన తర్వాత తెలుగువాళ్లు కలిసి ఎలా వుండగలరు? కృష్ణ కమిటీ ఐదో ఆప్షన్‌ ప్రకారం విడగొట్టేముందు అన్ని ప్రాంతాల వార్ని ఒప్పించాలని వుంది కదా అంటారా? 

2009లో సోనియాకు పడిపడి ఓట్లేశారంటే దాని అర్థం ఏమిటి? ఆవిడ చెప్పిన దానికి ఎదురు చెప్పమని ఒప్పుకున్నట్టే కదా! మళ్లీ యింకా సణుగుడు ఏమిటి? మీకేది మంచో ఆవిడే చూసుకుంటుంది. తనకేది మంచో కూడా ఆవిడే చూసుకుంటుంది. మధ్యలో మీ బోడి అభిప్రాయం ఎవడికి కావాలి?

‘విభజన అనివార్యం అని ఒప్పేసుకోండి. ఒప్పుకోక ఏం చేస్తారు? ‘మొండివాడు రాజు కంటె బలవంతుడు’ అని సామెత. మొండివాడే రాజైనప్పుడు..? అతన్ని మించిన బలవంతుడు వుంటాడా? మీరు 60, 70, 80.. ఎన్ని రోజులైనా సమ్మె చేసుకోండి. ఆవిడ నోరు విప్పిందా? అయ్యో పాపం అందా? ‘మా యుపిఏ2 ప్రభుత్వానికి ఊపిరి లూదిన ఆంధ్రులారా, మీ దయవలనే కదా యింకో పది స్కాములు చేసుకోగలిగాం. మీకేం ఫర్వాలేదు నేనున్నాను’ అని చెప్పిందా? ఎంతకాలం చేయగలరో చూస్తాగా అనుకుంది. చివరకు మీరే నీరసించారు. తుఫాను పేరు చెప్పి, సిఎం హామీ పేరు చెప్పి సమ్మె విరమించుకుని గోడకు నడుం చేరేశారు. నెలజీతగాళ్లు మీరే యింత మొండిగా రెణ్నెళ్లపాటు సమ్మె చేస్తే, లక్షలాది కోట్లు వెనకేసుకున్న ఆవిడకు ఎంత గోరోజనం వుండాలి? ఆవిడ పవరు మీకు తెలియదు. మాకు తెలుసు. మమ్మల్ని నోరెత్తనివ్వదు. నోరు తెరవబోతే ఏదో ఒకటి కళ్ల ముందు పడేస్తుంది. చటుక్కున దాన్ని నోటితో ఒడిసి పట్టుకోవాల్సి వస్తుంది. ఇంకేం మాట్లాడతాం? నోరు బిజీ కదా!

‘విభజన అనివార్యం అని మనసా, వాచా అనుకున్న తర్వాత యిక మిగతా విషయాలన్నీ – అంటే తెలుగు జాతి ఐక్యత, ఆత్మగౌరవం, ‘రాహుల్‌ ప్రధాని కావాలంటే మేం నాశనం కావాలా?’ అంటూ సందేహాలు – యివన్నీ పక్కన పడేయాలి. మనకు ఏం దక్కుతుంది? అది చూసుకుంటే చాలు. మమ్మల్ని చూసి నేర్చుకోండి. మేం ఏం చేస్తున్నాం? విడిపోయిన రాష్ట్రంలో ‘మాకేంటి?’ అని చూసుకుంటున్నాం. మీరూ అదే చేస్తే మంచిది. వాళ్ల మాట విని నోర్మూసుకుని పడి వుంటే వాళ్లు ఏదో ఒకటి విదిలించకపోరు. మనం అడుక్కోవాలంతే. అడక్కపోతే అమ్మయినా పెట్టదు. అడుక్కుందాం రండి. మీకు మరీ సిగ్గయితే మాతో చెప్పండి, మేం వెళ్లి మీ తరఫున అడుక్కుని వస్తాం. మీకేం కావాలో మాకు తెలియదు కదా, ఏదో మాటవరసకి ప్రజాప్రతినిథులం తప్ప మీ బాగోగులు మాకేం తెలుసు? అందుకని మీకేం కావాలో మీరే వచ్చి మాకు చెప్పాలి. అవన్నీ లిస్టు రాసి కట్టకట్టి అమ్మ పాదాల ముందు పడేస్తాం. ఆవిడ ఎంత యిస్తే అదే మన ప్రాప్తం.’’

– ఇదీ వాళ్ల విజ్ఞాపనల సారాంశం. పురంధరేశ్వరిగారు విజయదశమి పండగరోజు చూసుకుని యీ శుభకార్యానికి సంకల్పం చెప్పుకున్నారు. అడిగినవాడికి, అడగనివాడికి యింటర్వ్యూలు ప్రసాదించారు. ఆవిడ చెప్పినదేమిటి? 1. ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చాకనే కాబినెట్‌ నోట్‌ అని చెప్పి మమ్మల్ని జోకొట్టారు. 2. అది లేకుండానే నోట్‌ పెట్టడంతో మేం రాజీనామా చేశాం. 3. అయినా దానిపై పట్టు పట్టడం లేదు, ఎందుకంటే విభజన అనివార్యం కాబట్టి మన ప్రాంతప్రజల హక్కులు కాపాడడానికి మేం పోరాడుతున్నాం 4. పోరాడడానికే పదవుల్లో కొనసాగుతున్నాం 5. కాంగ్రెసు పార్టీని వదిలిపెట్టేది లేదు. అదయ్యాక ఇంకో రెండు రోజుల్లో కార్యాచరణలోకి దిగారు. సమాజంలో అన్ని వర్గాల వారినీ కలిసి విభజనకు ఒప్పించే యాగం చేస్తున్నారు. సోనియాతో చెప్పి అడిగినవి చేయించేస్తామని వాళ్లకు వరాలు యిచ్చేస్తున్నారు. 

పాతకాలం సామెతలంటే నాకు భలే యిష్టం. ఓ సామెత వుంది – ‘నే వెళితే మజ్జిగే పోశారు. నేను నీకు చీటీ రాసిస్తాను, వెళ్లి చూపెడితే పెరుగు పోస్తారు’ అని వెనకటికి ఎవడో అన్నాడట. ఎంత మూర్ఖుడైతే మాత్రం అలా అంటాడా అనుకునేవాణ్ని. ఇప్పుడు పురంధరేశ్వరి వంటి విదుషీమణి కూడా యిలాగే ప్రవర్తిస్తున్నారు. ఈవిడ మన్‌మోహన్‌కు, కపిల్‌ సిబ్బల్‌కు గారాబుపట్టి అని, ఆవిడ మేధస్సు చూసి సోనియా కూడా మురిసిపోతోందని, ఆవిడ మాటకు చాలా గౌరవం యిస్తుందని యిన్నాళ్లూ మనకు చాలా బిల్డప్‌ యిచ్చారు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తోంది? ‘మాకు కూడా సోనియా ఠోకరా యిచ్చింది. మా మాటకు పూచికపుల్ల యివ్వలేదు. ఆంటోనీ నివేదిక అంటూ మభ్యపెట్టింది’ అని. మరి ఠోక్రాణీ సోనియా దగ్గర్నుంచి ఈవిడ యింకేం మంచి ఆశిస్తున్నారు? మా ప్రాంత ప్రజల హక్కులు కాపాడతాం అని మనకు చెప్తున్నారే! అసలు మీకు శక్తే లేదు. మీకు పలుకుబడి లేదు. మీరు ఒట్టి ఆరో వేలు గాళ్లు, ఆటల్లో అరటిపళ్లు, కూరలో కరివేపాకులు. మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోలేరు. ఇక మమ్మల్ని ఏం ఉద్ధరిస్తారు? మీకే విలువ లేనపుడు మీ సిఫార్సులకు విలువ వుంటుందా? మాకు పెరుగు పోస్తారా? చాల్లెండి. అసలు మాకు సోనియమ్మ విలువ ఏమైనా యిస్తోందా?

ఆంటోనీ రాష్ట్ర పర్యటనకు వస్తారు, కష్టాలు తెలుసుకుంటారు అన్నారు. తూచ్‌! గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్లు వస్తారు అన్నారు. అదీ తూచ్‌! దానిలో పది మంది అన్నారు, అది తూచ్‌! జలవనరుల మంత్రి లేకుండా, ఎచ్‌ఆర్‌డి మంత్రి లేకుండా, ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్మన్‌ లేకుండా, సంబంధిత మంత్రులు లేకుండా అదో కమిటీయా? దానికి కాలపరిమితి లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్టు యిచ్చేయవచ్చా? మేం ఏం చేసినా చెల్లుతుంది, మీ తుచ్ఛజీవులకు యింతకంటె ఎక్కువ మర్యాద అక్కరలేదని సోనియా ఘంటాపథంగా చెప్తూ వుంటే వీళ్లు ఆవిడ వద్దకు రాయబారం వెళ్లి యిది తగదు, తల్లీ అని చెప్పాలి తప్ప, మన వద్దకు రాయబారం రావడమేమిటి? మీరు మీ ప్రాంతప్రజల హక్కులు కాపాడగలరా? అసలు 2014లో మీ ప్రభుత్వం మళ్లీ వస్తుందా? మీరు అధినేత్రిగా ఆరాధిస్తున్న సోనియా మళ్లీ అధిపతిగా అవుతుందా? మీరు యివాళ యిచ్చే హామీలకు పూచికపుల్లయినా విలువ వుంటుందా? సర్వే ఫలితాలు చూస్తున్నారుగా, పరప్రభుత్వం ఏర్పడితే మీలో ఎంతమంది జైలుకి వెళతారో తెలియదు. మీ సంగతే మీకు తెలియనప్పుడు 13 జిల్లాల ప్రజలకు మీరు ఏ హామీ యివ్వగలరు?  మీ పార్టీలోని ఢల్లీ నాయకులు రోజుకో స్టేటుమెంటుతో తెలుగువారందరితో ఆడుకుంటున్నారు. వాళ్ల సవ్యమైన స్టేటుమెంటు ఒక్కటీ యిప్పించలేని మీరు ప్రజాప్రతినిథులా? నేతలా? వాళ్లపై తిరగబడేందుకు మీకు దమ్ము చాలదని మాకు తెలుసు. వాళ్ల సిబిఐ వాళ్లకుంది. మీ లసుగులు మీకున్నాయి. రాజీనామాలు చేయకుండా మాయమాటలు చెప్పినా సరేలే అని వూరుకుంటున్నాం. ఊరుకున్నాం కదాని యీ రాయబారాలు కూడా మొదలెడితే ఎలా?

వారసత్వం వలన కొన్ని చిక్కులుంటాయి. ఇలాటి రాయబారాలు ఏ కావూరియో చేస్తే విసుక్కుని వూరుకునేవాళ్లం. సాక్షాత్తూ ఎన్టీయార్‌ కూతురే – ఎంత కాంగ్రెసులో చేరినా – యిలాటి పనులకు దిగజారితే చికాకు కాదు, కోపం వస్తుంది. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2013)

[email protected]