స్టార్ ప్రొడ్యూసర్ తో రెండో పెళ్లి.. ఖండించిన నటి

ఇండస్ట్రీలో పుకార్లు సర్వసాధారణం. ఇలాంటి పుకార్లను కొంతమంది చూసీచూడనట్టు వదిలేస్తారు, మరికొంతమంది మాత్రం గట్టిగా స్పందిస్తారు, కడిగిపారేస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో రకం. తను ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను రెండో పెళ్లి…

ఇండస్ట్రీలో పుకార్లు సర్వసాధారణం. ఇలాంటి పుకార్లను కొంతమంది చూసీచూడనట్టు వదిలేస్తారు, మరికొంతమంది మాత్రం గట్టిగా స్పందిస్తారు, కడిగిపారేస్తారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో రకం. తను ఓ స్టార్ ప్రొడ్యూసర్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటూ వచ్చిన వార్తను ఈ నటి తీవ్రంగా ఖండించింది.

“సాక్షి మీడియాలో ఓ న్యూస్ చూశాను. నాకు రెండో పెళ్లి అని ఫేక్ న్యూస్ వేశారు. అలాంటి పత్రిక నుంచి అలాంటి ఫేక్ న్యూస్ రావడం చాలా బాధగా ఉంది. అది బాధ్యతారాహిత్యం. చాలా పెద్ద సంస్థ అది. ఎంతోమంది చదువుకున్న వాళ్లు అందులో ఉన్నారు. అలాంటి కమ్యూనిటీ నుంచి బేస్ లెస్ గా ఓ వార్త ఎలా పెడతారు? కేవలం నేను ఒక నటిని కాబట్టి, ఆధారాలు లేకుండా నాపై ఏదైనా రాయొచ్చని అనుకోవడం కరెక్ట్ కాదు. దీన్ని నేను ఖండిస్తున్నాను. ఒకరి వ్యక్తిగత జీవితంపై రాయడానికి మీకు ఏం హక్కు ఉంది? సంస్థలో ఎవరైనా కలగని రాశారేమో నాకు తెలీదు.”

ఇలా తన రెండో పెళ్లి పై వచ్చిన వార్తల్ని తీవ్రంగా ఖండించారు ప్రగతి. ఇలాంటి వార్తలు రాసేముందు కొంచెం హోం వర్క్ చేయాలని, కరెక్టా కాదా నిర్థారించుకోవాలని కోరారు. ఏ ఆధారాలతో తనపై ఈ న్యూస్ రాసారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వార్తలు రాసేముందు సామాజిక బాధ్యతతో మెలగాలని, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడే హక్కు ఎవ్వరికీ లేదన్నారు.
 
నటి ప్రగతిపై ఇలాంటి పుకార్లు కొత్తేం కాదు. గతంలో కూడా ఆమెపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ నటి, ఎప్పటికప్పుడు వాటిని ఖండిస్తూ వస్తున్నారు. తను ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం కోసం వ్యాయామం చేస్తానని, అదే టైమ్ లో ట్రోలింగ్, రూమర్స్ ను తట్టుకోవడం కోసం మెంటల్లీ కూడా స్ట్రాంగ్ గా ఉంటున్నానని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.