మళ్లీ క్షీణించిన సీనియర్ స్టార్ ఆరోగ్యం

మాజీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే నిలకడగా…

మాజీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. వెంటనే ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే నిలకడగా ఉందని చెబుతూనే, మరో 2 వారాల పాటు అతడికి నిరంతరం హాస్పిటల్ లో చికిత్స అవసరమని ప్రకటించారు వైద్యులు.

వారం రోజుల కిందట రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్ కు వెళ్లారు విజయ్ కాంత్. ఆ తర్వాత ఆయనకు దగ్గు, జలుబు, గొంతునొప్పి తీవ్రతరమైంది. దీంతో వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లారు. లివర్ లో సమస్యలు తలెత్తడంతో ఆ దిశగా చికిత్స ప్రారంభించారు వైద్యులు.

కరోనా నుంచి విజయ్ కాంత్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. 2 నెలల కిందట ఆయన అత్యంత క్రిటికల్ కండిషన్ లోకి వెళ్లారు. ఆ ప్రాణాపాయ స్థితి నుంచి ఆయన బయటపడ్డారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల డిమాండ్ మేరకు విజయ్ కాంత్ ను బయటకు తీసుకొచ్చారు.

ఆ టైమ్ లో ఆయన తన చేయి కూడా ఎత్తలేకపోయారు. తల కూడా నిటారుగా ఉంచలేకపోయారు. ఒకరు చేయి ఎత్తి అభివాదం చేస్తున్నట్టు చేయగా, వెనక నుంచి మరొకరు ఆయన తల పక్కకు ఒరిగిపోకుండా పట్టుకున్నారు. వీల్ ఛైర్ లోనే వచ్చి వెళ్లారు.

విజయ్ కాంత్ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందనే విషయాన్ని అప్పుడే అందరూ తెలుసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన ఆరోగ్యం క్షీణించింది, విశ్వసనీయ సమాచారం ప్రకారం, అంతా ఓకే అని వైద్యులు పైకి చెబుతున్నప్పటికీ, మరో 14 రోజుల పాటు ట్రీట్ మెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఆరోగ్య స్థితి గురించి చెప్పగలమని అంటున్నారు.