జీవితంలో మేం చేసిన మిస్టేక్స్ అవే..!

స్వ‌త‌హాగా అయితే.. అనుభ‌వానికి మించిన పాఠం ఉండ‌దు. అలాగే అనుభ‌వ‌జ్ఞులు చెప్పే మాట‌లు చాలా విలువైన‌వి. వేరే వారి అనుభ‌వాల నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవ‌చ్చు! మ‌రి జీవితంలో కొన్ని సంధిగ్ధావ‌స్త‌ల్లో ఏం…

స్వ‌త‌హాగా అయితే.. అనుభ‌వానికి మించిన పాఠం ఉండ‌దు. అలాగే అనుభ‌వ‌జ్ఞులు చెప్పే మాట‌లు చాలా విలువైన‌వి. వేరే వారి అనుభ‌వాల నుంచి కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవ‌చ్చు! మ‌రి జీవితంలో కొన్ని సంధిగ్ధావ‌స్త‌ల్లో ఏం చేయాలో, దేనికి ప్రాధాన్య‌త‌ను ఇవ్వాల‌నే అంశం గురించి ఆలోచిస్తున్న‌ప్పుడు, ఆలోచించుకోవాల్సినప్పుడు… కొంద‌రి అనుభ‌వాల‌ను కూడా ప‌రిశీలించ‌వ‌చ్చు! వారి జీవితానుభ‌వాల నుంచి మంచిని తీసుకోవ‌చ్చు. వారు చెప్పిందే క‌రెక్ట్ అనుకోన‌క్క‌ర్లేదు కానీ, వారి అనుభ‌వాలను తెలుసుకుని.. మీ నిర్ణ‌యాల‌ను స‌మీక్షించుకోవ‌చ్చు! మ‌రి మీ జీవితంలో మీరు చేసిన పొర‌పాట్లు ఏమిటి? అని అర‌వైలు దాటేసిన వాళ్ల‌ను అడిగితే చాలా విష‌యాల‌నే చెబుతారు! యుక్త వ‌య‌సులో చేసిన ఏ పొర‌పాటును మీరు ఇప్పుడు ప్ర‌స్తావిస్తారు అంటే ఒక్కోరు ఒక్కో ర‌క‌మైన విష‌యాన్ని ప్ర‌స్తావిస్తారు. తాము జీవితంలో చేసిన పెద్ద మిస్టేక్ ఏమిటో వివ‌రిస్తారు. అది యుక్త వ‌య‌సులో ఉన్న వారికి ఒక పాఠం కాగ‌ల‌దు!

ప‌ర్స‌న‌ల్ క‌నెక్ష‌న్స్ మిస్స‌య్యా!

20ల‌లో పూర్తిగా కెరీర్ మీదే ఫోక‌స్ చేశా! ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోలేదు, దేన్నీ ప‌ట్టించుకోలేదు! ప‌నే ప్ర‌పంచంగా గ‌డిపా! ప్రొఫెష‌న‌ల్ గా ఎదగాల‌నుకున్నా. ఎదిగా.. కానీ.. ఇర‌వై యేళ్ల వ‌య‌సులో తీర్చుకోవాల్సిన ముచ్చ‌ట్ల‌ను మిస్ అయ్యా! ప‌ర్స‌న‌ల్ క‌నెక్ష‌న్స్ మిస్ అయ్యాయి. ప్రేమానుభూతుల‌ను పొంద‌లేక‌పోయా! కెరీర్ ను మ‌రీ అంతా సీరియ‌స్ గా తీసేసుకుని.. స‌ర్వాన్నీమిస్ కావ‌డం జీవితంలో చేసిన పెద్ద పొర‌పాటు! ఇది ఒక వ్య‌క్తి చెప్పే త‌న పొర‌పాటు!

ప‌ర్స‌న‌ల్ కేర్ తీసుకోవాల్సింది!

ఆ రోజుల్లో స‌రిగా నిద్ర‌పోయేవాడిని కాదు, ఆరోగ్యం ప‌ట్ల పూర్తి నిర్ల‌క్ష్య పూరిత ధోర‌ణి, లెక్క‌లేని త‌నం! మంచి అల‌వాట్లు లేవు! వ్యాయామం గురించి ప‌ట్టించుకునే వాడిని కాదు. ఫ‌లితంగా వ‌య‌సు పెరిగాకా అనారోగ్యం పాల‌య్యా! అప్పుడు పర్స‌న‌ల్ కేర్ తీసుకోవాల్సింది! ఇది మ‌రో వ్య‌క్తి గ్ర‌హించిన త‌త్వం!

కంఫ‌ర్ట్ జోన్ లో ఉండిపోయా!

20ల‌లో ముప్పైల‌లో కెరీర్ విష‌యంలో కొన్ని ప్ర‌యోగాలైనా చేయాల్సింది! కంఫ‌ర్ట్ జోన్ చూసుకున్నా. అక్క‌డ నుంచి క‌ద‌ల లేదు. ఫ‌లితంగా లైఫ్ లోనే గ్రోత్ అక్క‌డే ఆగిపోయింది. ఆదిలోనే కంఫ‌ర్ట్ జోన్ కు ప‌రిమితం కావ‌డం వ‌ల్ల‌, ఆ త‌ర్వాత ప‌క్క‌కు క‌దిలే అవ‌కాశాల‌న్నీ మూసుకుపోయాయి. అలా కంఫ‌ర్ట్ జోన్లో ఉండిపోవ‌డం త‌న జీవితంలో చేసిన పొర‌పాటుగా ఇంకో వ్య‌క్తి వివ‌రిస్తారు.

పిల్ల‌ల‌ను, ఫ్యామిలీని ప‌ట్టించుకోలేదు!

ఆ వ‌య‌సులో కెరీర్ ఫోక‌స్డ్ గా గ‌డిపా. పిల్ల‌లు, ఫ్యామిలీ ఉన్నా.. ఇచ్చిన ప్రాధాన్య‌త అంతంత మాత్రం! వ‌ర్క్ మీదే ఎక్క‌వ‌గా దృష్టి పెట్టా! మాన‌సికంగా వారికి ఎప్ప‌టికీ ద‌గ్గ‌ర కాలేక‌పోయాయి! ఇప్పుడు రిటైర్డ్ అయ్యాకా అనిపిస్తుంది. వ‌ర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాల్సింద‌ని!

నా క‌ల‌ల‌ను వెంట ప‌య‌నించాల్సింది!

20ల‌లో బోలెడ‌న్ని క‌ల‌లు ఉండేవి. వాటిపై ఎంతో ఆస‌క్తి, సాధించి, చేధించాల‌నే ఉత్సాహం ఉండేది. అయితే జీవిత ప‌య‌నం మ‌రోలా సాగింది. నా క‌ల‌ల వెంట నా ప‌య‌నం సాగ‌లేదు! అంతా ఐపోతున్న ద‌శ‌లో నాడు నా క‌ల‌ల వెంట నా ప‌య‌నం సాగించాల్సింద‌ని అనిపిస్తుంద‌ని మ‌రో వృద్ధుడు చెబుతున్నాడు!

మ‌రి జీవితంలో అంతా అయిపోయాకా ఇలా క‌న్ఫెష‌న్స్ చెప్పుకోవ‌డం కంటే.. ప్రాధాన్య‌త‌ల‌ను ప‌క్కాగా నిర్ణ‌యించుకోవ‌డం యుక్త వ‌య‌సులో చేయాల్సిన ప‌ని!