ఈ నెల 27 నుంచి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనంలోకి వెళ్లనున్నారు. ఈ దఫా 21 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఎన్నికలకు 50 రోజుల సమయం వుండడంతో దాన్ని సద్వినియోగం చేసుకోవాలని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రతి నియోజక వర్గంలోనూ పర్యటిస్తూ, పార్లమెంట్ పరిధిలో ప్రతి రోజూ ఒక బహిరంగ సభ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు.
బస్సుయాత్రకు ముందే వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైసీపీ మేనిఫెస్టోపై చాలా కాలంగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఐదారు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల సందర్భంలో నవరత్నాల పేరుతో మేనిఫెస్టోతో జగన్ జనం ముందుకెళ్లారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో దాదాపు 99 శాతం అమలు చేసిన ఘనత తమకు దక్కుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.
జగన్ మాట ఇస్తే, తప్పడంతే నినాదంతో ఈ దఫా జనం ముందుకు వెళ్లనున్నట్టు వైసీపీ నేతలు తెలిపారు. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే… మాట ఇస్తే, తప్పుతాడంతే అన్నట్టుగా 2014-19 మధ్య కాలంలో పాలన సాగించారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. 2014 ఎన్నికలప్పుడు వెలువరించిన మేనిఫెస్టో, ఆ తర్వాత ఎన్నికల సమయానికి టీడీపీ వెబ్‌సైట్ నుంచి మాయమైందని వారు గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుతానికి వస్తే… సూపర్‌సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు అసలు ప్రచారమే లేదు. ఎంతసేపూ జగన్‌పై వ్యతిరేకతే తమను గెలిపిస్తుందనే భ్రమలో కూటమి నేతలున్నారు. అందుకే కూటమి మేనిఫెస్టో ఊసే లేదు. వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఎలాంటి ప్రజాకర్షక పథకాలకు జగన్ రూపకల్పన చేసి వుంటారో అని అన్ని రాజకీయ పక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే జగన్ హామీ ఇస్తే, అమలు చేసి తీరుతారనే విశ్వాసం ప్రజానీకంలో వుంది. అదే కూటమిని భయపెడుతోంది.