మ‌రొక టీడీపీ నేత‌కు జ‌న‌సేన టికెట్‌

ఎక్క‌డైనా ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి చేరిక‌లు వుంటాయి. అదేంటో గానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విచిత్ర‌మైన రాజ‌కీయ చేరిక‌లు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మిత్ర‌ప‌క్ష పార్టీల మ‌ధ్యే నాయ‌కుల వ‌ల‌స‌లు వెల్లువెత్త‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా టీడీపీ…

ఎక్క‌డైనా ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి చేరిక‌లు వుంటాయి. అదేంటో గానీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విచిత్ర‌మైన రాజ‌కీయ చేరిక‌లు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో మిత్ర‌ప‌క్ష పార్టీల మ‌ధ్యే నాయ‌కుల వ‌ల‌స‌లు వెల్లువెత్త‌డం గ‌మ‌నార్హం. మ‌రీ ముఖ్యంగా టీడీపీ నుంచి జ‌న‌సేన‌లో చేర‌డ‌మే ఆల‌స్యం, వెంట‌నే టికెట్ ఇస్తున్నారు. ఈ ప‌రిణామాల‌పై జ‌న‌సేన శ్రేణులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నాయి.

రెండు రోజుల క్రితం ఉమ్మ‌డి కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ టీడీపీ ఇన్‌చార్జ్ మండలి బుద్ధ‌ప్ర‌సాద్ జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌మ‌క్షంలో ఆ పార్టీ కండువా క‌ప్పుకున్నారు. త‌న‌ను అవ‌నిగ‌డ్డ నుంచి పోటీ చేయాల‌ని ప‌వ‌న్ కోరిన‌ట్టు బుద్ధ‌ప్ర‌సాద్ తెలిపారు. దీంతో అవ‌నిగ‌డ్డ‌లో ఇంత‌కాలం జ‌న‌సేన జెండా మోసిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు రోడ్డెక్కారు. బుద్ధ‌ప్ర‌సాద్‌ను ఓడించితీరుతామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఇదిలా వుంటే, మ‌రో టీడీపీ ఇన్‌చార్జ్ కూడా జ‌న‌సేన‌లో చేరి టికెట్ ఎగేసుకెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ‌కాకుళం జిల్లా పాల‌కొండ అభ్య‌ర్థిని ప‌వ‌న్ ప్ర‌క‌టించాల్సి వుంది. బ‌హుశా ఇదే చివ‌రి ప్ర‌క‌ట‌న కూడా కావ‌చ్చు. 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయిన నిమ్మ‌క జ‌య‌కృష్ణ‌కు టికెట్ ఇవ్వ‌డానికి ప‌వ‌న్ సిద్ధ‌మ‌య్యారు. పేరుకేమో జ‌న‌సేన‌, అభ్య‌ర్థి మాత్రం టీడీపీ. అందుకే జ‌న‌సేన‌కు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దూర‌మ‌వుతున్నార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

అభ్య‌ర్థులే లేన‌ప్పుడు సీట్లు ఎందుకు తీసుకోవాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. అదేదో టీడీపీకే మ‌ద్ద‌తు ఇచ్చి వుంటే స‌రిపోయేది క‌దా అని అంటున్నారు. టీడీపీ నుంచి నాయ‌కుల్ని తీసుకుని, జ‌న‌సేన అభ్య‌ర్థులుగా ప్ర‌క‌టించుకోవ‌డం ప‌వ‌న్‌కు సిగ్గుగా లేదా? అని ఆ పార్టీ వారే ప్ర‌శ్నిస్తున్నారు. జ‌న‌సేన అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌నంతా ప్ర‌హ‌స‌నంగా మారింది.