సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆచూకీ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెతుకుతున్నారు. తమ కొంప ముంచి, ఎవరికీ కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడో అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులు మండిపడుతున్నారు. నిమ్మగడ్డపై సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆచూకీ చెబితే, తగిన పారితోషికాన్ని అందజేస్తామని టీడీపీ పేరుతో నెటిజన్లు సృజనాత్మక పోస్టులు పెట్టడం విశేషం. ఏపీలో వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలనే లక్ష్యంతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అనేక రకాలుగా పోరాటాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయనకు వెన్నుదన్నుగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిలిచారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గం కావడం, ఇద్దరి ఆశయాలు ఒకటే కావడంతో నిమ్మగడ్డ రెచ్చిపోయారు.
నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ చర్యలు రాజకీయంగా తమకు లాభిస్తున్నంత వరకూ చంద్రబాబు సహా, టీడీపీ నేతలంతా సంబరపడ్డారు. తానేం చేసినా, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే అని భావించిన నిమ్మగడ్డ మరో అడుగు ముందుకేశారు. ప్రతినెలో ఒకటో తేదీన సామాజిక పింఛన్లు అందజేస్తున్న వలంటీర్లపై వేటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఫిర్యాదు చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం కూడా ముందూవెనుకా ఆలోచించకుండా, వలంటీర్తు పింఛన్లు పంపిణీ చేయడానికి వీల్లేదని, ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. రెండు రోజుల ముందు ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఏమీ చేయలేని పరిస్థితి. మరీ ముఖ్యంగా 55 నెలలుగా… సీఎం జగన్ మాటల్లో చెప్పాలంటే 66 లక్షల మందికి ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్న వలంటీర్లను చంద్రబాబు అడ్డుకున్నారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
రాజకీయంగా నష్టం జరుగుతుందని పసిగట్టిన చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టినా, ప్రయోజనం కనిపించడం లేదు. చేతులు కాలాక, ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏంటి? దీనంతటికి నిమ్మగడ్డ రమేశ్‌కుమారే కారణమని టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో పింఛన్ల పంపిణీ తీవ్ర రాజకీయ దుమారం రేపినా, నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. అసలు ఆయన ఎక్కడున్నాడో కూడా ఎవరికీ తెలియడం లేదు.
నిమ్మగడ్డ కనిపిస్తే, ఏదైనా చేయాలన్నంత కోపంతో టీడీపీ కార్యకర్తలు, నాయకులు రగిలిపోతున్నారు. రాజకీయంగా ఏది లాభం? ఏది నష్టం? అనే విచక్షణ లేకుండా నిమ్మగడ్డ వ్యవహరించడం వల్లే కోలుకోలేని విధంగా దెబ్బ తగిలిందని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఈ పరిణామాలపై నెటిజన్లు వ్యంగ్యంగా నిమ్మగడ్డ ఆచూకీ చెబితే, తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించడం చర్చనీయాంశమైంది. అతి చేస్తే ఎలా వుంటుందో టీడీపీకి ఇప్పుడు తెలిసొచ్చింది.