బొజ్జల సుధీర్: ఒక హత్యాయత్నం డ్రామా!

తన మీద దాడి, హత్యాయత్నం లాంటివి జరిగాయని ప్రచారం చేసుకోవడం.. నాయకులకు జనాల సానుభూతి పొందడానికి ఒక ఈజీ అడ్డదారిగా తయారైనట్లుగా కనిపిస్తోంది. Advertisement మొన్నటికి మొన్న జనసేనాని పవన్ కల్యాణ్ తనమీద హత్యాయత్నం…

తన మీద దాడి, హత్యాయత్నం లాంటివి జరిగాయని ప్రచారం చేసుకోవడం.. నాయకులకు జనాల సానుభూతి పొందడానికి ఒక ఈజీ అడ్డదారిగా తయారైనట్లుగా కనిపిస్తోంది.

మొన్నటికి మొన్న జనసేనాని పవన్ కల్యాణ్ తనమీద హత్యాయత్నం చేసేందుకు తనతో సెల్ఫీలు దిగడానికి వస్తున్న వారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పంపుతున్న కిరాయిగూండాలు సన్నని బ్లేడ్లు పట్టుకుని వస్తున్నారు. వారి వల్ల నాకు, నా సెక్యూరిటీ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి.. అని ఒక కథ అల్లారు. అంతేతప్ప.. తనకు ఎక్కడ గాయమైందో, సెక్యూరిటీ వారికి ఎక్కడ గాయమైందో లైవ్ లో కాదు కదా, కనీసం ఫోటో కూడా చూపించలేదు. ఈ మార్గమేదో జనాల సానుభూతి పొందడానికి ఒక ఈజీ మార్గంగా కనిపిస్తున్నట్టుంది. ఇప్పుడు శ్రీకాళహస్తి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేస్తున్న బొజ్జల సుధీర్ రెడ్డి కూడా అదే డ్రామా ఆడుతున్నారు.

ప్రచారంలో ఉండగా తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన ఒక వ్యక్తి వైఎస్సార్ సీపీ కార్యకర్త అని, అతని జేబులో కత్తి ఉన్నదని, తనను చంపడానికే అతను తన వద్దకు సెల్ఫీ కోసం వచ్చాడనేది బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న ఆరోపణ. ఒక వ్యక్తి సుధీర్ వరకు రావడం అన్నది నిజం. అయితే అతని జేబులో కత్తి ఉన్నదని తెలుగుదేశం కార్యకర్తలు చూసి జాగ్రత్త పడ్డారట. సుధీర్ ను అప్రమత్తం చేసి, అతడిని పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు.

అయితే స్థానికంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి ఆ యువకుడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన వాడు కూడా కాదు. చంద్రగిరి కి చెందిన వాడుట. అత్తగారింటికి వచ్చి ఉన్న సందర్భంలో ఇలాంటి సంఘటన జరిగింది.

ఇదేదో సిటింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తన మీద హత్యాయత్నం చేయించినట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడానికి పాపం సుధీర్ రెడ్డి చాలా కష్టపడుతున్నాడు. అయినా ఈ సమయంలో నన్ను చంపితే ఆయనకేం వస్తుంది. నా భార్య గానీ, మా అమ్మగానీ పోటీచేసి సానుభూతితో నెగ్గుతారు. నాకు గాయాలు అయినా కూడా.. ప్రజల సానుభూతి నాకే ఎడ్వాంటేజీ అవుతుంది అని ఆయనే అంటున్నారు. ఈ మాత్రం మధుకు తెలియదా అంటున్నారు.

ఈ మాత్రం అందరికీ తెలుసు. అందుకే ఇది హత్యా యత్నం అయిఉండే అవకాశం కూడా లేదు. అయినా సరే.. ఏదో హత్యాయత్నం జరగబోయినట్టుగా, తాను చాలా తెలివిగా దానిని తప్పించుకున్నట్టుగా.. అక్కడికి తన చేతిలో ఓడిపోతాననే భయంలో సిటింగ్ ఎమ్మెల్యే ఉన్నట్టుగా చాటుకోవడానికి సుధీర్ ఆరాటపడుతున్నట్టుంది. ఈ వ్యవహారాన్ని రాద్ధాంతం చేయడం అనేది చాలా కామెడీగా ఉన్నదని లోకల్ గా ప్రజలు అనుకుంటున్నారు.