తనను ఈడీ అధికారులు అరెస్టు చేసి తీసుకువెళుతున్నప్పుడు.. కల్వకుంట్ల కవిత తాను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని చాలా గట్టిగా ప్రకటించారు. తన ఇంటి బయట ఆందోళన చేస్తున్న అభిమానులకు విజయ చిహ్నం చూపిస్తూ ఆమె ఢిల్లీ వెళ్లారు. నిజమే.. అభిమానులు కూడా ఆమె కడిగిన ముత్యంగా బయటకు రావాలనే కోరుకుంటారు. కానీ.. విచారణను కూడా ఎదుర్కోకుండా ఆమె కడిగిన ముత్యం అని ఎలా తేలుతుంది? అనేదే ఇప్పుడు ఆమె అభిమానుల సందేహం.
లిక్కర్ కేసు రూపంలో ముత్యం మీద బురద పడిందనే అనుకుందాం. దానిని కడిగి మనం తిరిగి ఇంట్లోకి తెచ్చుకోవాలనే అనుకుందాం. కానీ కడగడం అంటే ఏమిటి? విచారణ ఎదుర్కొని, ఏ ఆరోపణలు అయితే ఆమె మీద చేయబడ్డాయో ఆ ఆరోపణలన్నీ అబద్ధాలు అని తేల్చిన తర్వాత కదా.. ఆమె కడిగిన ముత్యం అయ్యేది. అలా జరగాలంటే ముందుగా విచారణకు హాజరు కావాలి కదా. విచారణకు హాజరయ్యాక విచారణకు ఆమె సహకరిస్తారా? లేదా? అనేది ఆ తర్వాతి సంగతి. అలా కాకుండా, అసలు విచారణను ఎదుర్కోవడానికి కూడా మొండికేస్తూ తనను విచారించడానికే వీల్లేదని కోర్టులో పిటిషన్లు వేస్తూ, విచారణ ప్రక్రియలో జాప్యం చేయడానికి అడ్డదారులు వెతుక్కుంటూ కాలయాపన చేస్తూ ఉంటే .. ఇక ఆమె కడిగిన ముత్యం అని ఎప్పటికి తేలుతుంది? అని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
ఈడీ అధికారులు అరెస్టు చేసిన తర్వాత.. కల్వకుంట్ల కవితను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరు పరచి తమ కస్టడీకి తీసుకున్న తరువాత.. ఆమె ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండులో ఉన్నారు. కాగా, సీబీఐ అధికారులు తీహార్ జైలులోనే ఆమెను విచారించడానికి రౌజ్ ఎవెన్యూ కోర్టు అనుమతి తీసుకున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ.. తనను విచారించడానికి ఇచ్చిన అనుమతిని రద్దుచేయాలని కోరుతూ కవిత మళ్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను కోర్టు బుధవారం విచారించే అవకాశం ఉంది.
మరొక వైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, లిక్కర్ స్కామ్ జరిగినప్పటి ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా కస్టడీని కూడా కోర్టు ఏప్రిల్ 18వరకు పొడిగించింది. చూడబోతే సీబీఐ విచారణ అంటేనే కల్వకుంట్ల కవిత భయపడిపోతున్నట్టుగా కనిపిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు. గతంలో కూడా తనను విచారించడానికి వీల్లేదని పలు రకాలుగా కవిత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. కానీ ఆ ప్రయత్నాలేమీ ఫలించలేదు. ఆమెవి మాత్రమే కాదు. అదే తరహాలో కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా విచారణ తప్పించుకోవాలని ప్రయత్నించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆయన కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు.
తనకు ఏ పాపమూ తెలియదని, లిక్కర్ స్కామ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని పదేపదే చెబుతూ ఉన్న కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణను ఎదుర్కోవడానికి మాత్రం ఎందుకు జంకుతున్నారనే సంగతి ఎవ్వరికీ అర్థం కానిది. ఆమె పిటిషన్ లో కోరినట్టుగా.. విచారణ నుంచి కోర్టు మినహాయింపు ఇస్తుందా.. ఇంతకూ ఆమె కడిగిన ముత్యంగా బయటకు వస్తుందా అనేది వేచిచూడాలి.