మలయాళీ సినిమాలను ప్రశంసిస్తూ అక్కడి హీరోలను, మూవీ మేకర్లను ప్రశంసిస్తూ నేనో ఆర్టికల్ రాస్తే.. వాళ్ల సినిమాల రేంజ్ ఎంత? వాళ్ల సూపర్ హిట్ సినిమాల కలెక్షన్లు కూడా తెలుగు సినిమా స్టార్ హీరోల ఫ్లాప్ ల స్థాయిలో ఉండవు! అంటూ ఒక నెటిజన్ వెటకరించాడు! నిజమే మలయాళీల మూవీ ఇండస్ట్రీ రేంజ్ చిన్నదే! వాళ్ల జనాభా, వాళ్ల సినిమ పిచ్చి తెలుగు వాళ్ల కన్నా చాలా తక్కువ! వాళ్ల సినిమా రీచ్ పరిమితం!
మరి అంత పరిమితంగా ఉన్నప్పుడే అంతమంచి సినిమాలు తీయగలుగుతున్నప్పుడు.. బడ్జెట్ పరిమితులు లేని, రీచ్ బ్రహ్మాండంగా, రిలీజ్ లను ఒక పండగలా చేసే తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ ఎంత మంచి సినిమాలను అందించాల్సిందనేదే అసలైన ప్రశ్న! తమకు ఉన్న అనేక పరిమితుల మధ్యన వారు మంచి సినిమాలను అందిస్తున్నప్పుడు, అలాంటి పరిమితులు కూడా లేనప్పుడు ఇంకా మంచి సినిమాలు రావాల్సింది! మరి రాలేదేం? ఫ్లాప్ సినిమాలకే పదుల కోట్లు వసూళ్లు వస్తున్నాయని.. అదే మురికిలో పొర్లాడటాన్ని సమర్థించాలి కాబోలు!
అయితే.. ఇప్పుడు మలయాళీ సినిమాలు బాక్సాఫీస్ ను కూడా షేక్ చేస్తున్నాయి. ఇటీవలి కేరళ సినిమా మంజుమల్ బాయ్స్ వసూళ్లు ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలట! చెప్పుకోవడానికి అందులో ఒక్క స్టార్ లేడు, ఒక హీరో లేడు, హీరోయిన్ లేదు, ఇతర హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసుకునే వాళ్లందరితో ఆ సినిమాను తీశారు! అది కేరళ సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రెండు వందల కోట్ల గ్రాస్ ను అందుకున్న తొలి మలయాళ సినిమాగా నిలుస్తోంది!
ఆ సినిమాకు కేరళ అవతల కూడా గట్టిగా కలెక్షన్లు వచ్చాయి. అందుకే ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల మార్కును అందుకుంది ఆ సినిమా! స్టార్లు లేరు, అభిమానుల హంగామా లేదు, వందల థియేటర్లలో విడుదలా లేదు! కేవలం మంచి సినిమా అనే ప్రశంసలే కాదు, కలెక్షన్లు ఏవీ అంటూ గెలి చేసే పరిస్థితి కూడా లేదు!
ఏకంగా రెండు వందల కోట్ల రూపాయల వసూళ్లు దక్కాయి మరి! కేవలం ఆ సినిమానే కాదు.. మలయాళీల మనసును చూరగొన్న మరో సినిమా ఆడుజీవితం కూడా సంచలన వసూళ్లను రాబడుతోంది. ఆ సినిమాకు విడుదల రోజున ఏకంగా లక్ష టికెట్ల బుకింగ్ ను పొందిందని బుక్ మై షో రికార్డులు చెబుతున్నాయి! 24 గంటల వ్యవధిలో లక్ష టికెట్ల అమ్మకం ఒక మలయాళీ సినిమాకు బంపర్ రికార్డే! ఆడుజీవితం సినిమా ఏమీ మాస్ మసాలా ఎంటర్ టైనర్ కాదు!
ఒక ధీనమైన కథ. గ్లామరస్ సినిమా కాదు, చూడటానికే కాదు, వినడానికే భయాంకరరమైన కష్టాల గురించిన సినిమా! ఐటంసాంగ్ లు, అదిరిపోయే ఫైట్లున్న సినిమా కాదు.. ఒక నిస్సహాయుడి కథ! అలాంటి సినిమాకు విడుదల రోజున ఏకంగా లక్ష టికెట్లు ఆన్ లైన్లోనే బుకింగ్ కావడం అంటే గొప్ప సంగతే! ఇక మరో మలయాళీ సినిమా ప్రేమలు కు తెలుగునాట కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది!
ఇందుమూలంగా అర్థం అవుతున్న విషయం ఏమిటంటే.. మొన్నటి వరకూ మలయాళీ సినిమాలు ఓటీటీ వరకే అనే పరిస్థితి మారుతోంది! బాక్సాఫీస్ వద్ద కూడా వాటి స్థాయి మెరుగుపడుతోంది. బాక్సాఫీస్ వసూళ్లేవీ.. అంటూ గేలి చేసే పరిస్థితి లేకుండా పోతోంది! బెంగళూరు వంటి నగరంలో తెలుగు వాళ్లు డైరెక్టుగా మలయాళీ సినిమాల రిలీజులకు టికెట్ లను బుక్ చేసుకుంటున్నారు! మలయాళీ వెర్షన్లనే ఎంచక్కా చూసేస్తున్నారు! ఎప్పుడో ఓటీటీ వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదు, థియేటర్లో అందుబాటులో ఉంటున్న మలయాళీ సినిమాల వైపు ఆశగా చూస్తున్నారు!
ఒక ఓటీటీల్లో అయితే మలయాళీ సినిమాల హవా యథారీతిన కొనసాగుతూ ఉంది! వాటి ఓటీటీ రిలీజ్ డేట్ల కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు తెలుగు వాళ్లు! అవి విడుదలైన రోజు సాయంత్రాలు వాటిని వీక్షించేస్తూ ఉన్నారు! ఇలా మలయాళ చిత్ర పరిశ్రమ తన పరిధిని విస్తరించుకుంటూ ఉంది. ఓటీటీ విడుదలలే కాకుండా, థియేటర్ విడుదలలూ అకర్షిస్తున్నాయి! ఎంతసేపూ మాస్ మసాలాలే సినిమాల సబ్జెక్టులుగా ఫిక్స్ అయిన టాలీవుడ్ కూడా ఇలాంటి పరిణామాలను గమనించాలి!
-హిమ