బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాజకీయంగా వాస్తవం ఏంటో ఇప్పటికి బోధ పడినట్టుంది. ఏదైతే తన ఉనికికి కారణమైందో, దానికి సమాధి కట్టడం వల్ల ఫలితాలు ఏ విధంగా వుంటాయో అనుభవంలోకి వచ్చింది. దీంతో కేసీఆర్ పునరాలోచనలో పడ్డారు. బీఆర్ఎస్‌ను మళ్లీ టీఆర్ఎస్‌గా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్‌రావు బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్‌గా మార్చాలనే ఆలోచనపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమైంది.
ఇవాళ ఆయన పాలకుర్తిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చాలని కార్యకర్తలు డిమాండ్ చేశారన్నారు. దీంతో ఆ దిశగా చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలని రెండేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు.
ఎన్డీఏ, ఇండియా కూటమికి వ్యతిరేకంగా కూటమి కట్టాలని కేసీఆర్ పెద్దపెద్ద ఆలోచనలు చేశారు. కొంత కాలం జాతీయ నాయకుల్ని వారి రాష్ట్రాలకు వెళ్లి కలిసి హడావుడి చేశారు. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్లి బీజేపీ వ్యతిరేక పార్టీలను కేసీఆర్ , ఆయన బృందం కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఏపీలో కూడా బీఆర్ఎస్‌కు ఒక అధ్యక్షుడు, కార్యదర్శిని నియమించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కాంగ్రెస్‌లోకి వలసలు వెల్లువెత్తుతుండడంతో కేసీఆర్, ఆయన ముఖ్యులకు తత్వం బోధపడింది. తిరిగి మొదటి నుంచి పార్టీ నిర్మాణాన్ని మొదలు పెట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. ఇందుకు తెలంగాణ నామస్మరణకు మించిన ఆయుధం లేదని బీఆర్ఎస్ నేతలకు తెలిసొచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీని తిరిగి గత పేరుతోనే మార్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు ఎర్రబల్లి దయాకర్ కామెంట్స్ నిదర్శనం.