ఆల్రెడీ అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఒక రచ్చను రేపుకున్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మార్పుచేర్పులతో మరింత కాకను రేపుతున్నారు! ఇప్పటికే ప్రకటించిన జాబితాతో బోలెడన్ని నియోజకవర్గాల్లో రచ్చ రేగింది. బీజేపీ, జనసేన ల కోటాలో అభ్యర్థిత్వ ప్రకటనలు వచ్చిన నియోజకవర్గాల్లో రేగిన వివాదాలకు మించి తెలుగుదేశం అభ్యర్థులు బరిలో నిలుస్తున్న చోట్లలో రగడను రేగాయి.
మొన్నటి వరకూ ఇన్ చార్జిలుగా పని చేసిన తమను నిరాశపరిచిన చంద్రబాబుపై సదరు నేతలు మండిపడుతున్నారు. వారి అనుచరులు నియోజకవర్గాల్లోని పార్టీ ఆఫీసులపై దండయాత్రలకు దిగారు! వాటిని ఒక కొలిక్కి తీసుకురావడానికి, సర్ధి చెప్పడానికి చంద్రబాబు నాయుడు సమయం కేటాయిస్తున్నట్టుగా ఎక్కడా వార్తలు రావడం లేదు!
కొన్ని చోట్ల అయితే చంద్రబాబు ప్రచారానికి తెలుగుదేశం నేతల అనుచరులే అడ్డు తగులుతూ ఉన్నారు. తమ నేతకు ఎందుకు టికెట్ కేటాయించలేదంటూ చంద్రబాబును వారు నిలదీస్తూ ఉన్నారు! అలాంటి వారిని తనదైన రీతిలో బెదిరిస్తున్నారు చంద్రబాబు నాయుడు!
మరి అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇప్పటి వరకూ చంద్రబాబు నాయుడు ఏం కసరత్తు చేసి ప్రకటనలు చేశారో కానీ.. ఇప్పుడు మార్పుల రాజకీయం రసవత్తరంగా మారింది. ఉండి నియోజకవర్గంలో ఆల్రెడీ రచ్చ జరుగుతూ ఉంది. పాత ఇన్ చార్జికి, చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థికి పొసగలేదు! ఇప్పుడు రఘురామకృష్ణం రాజు ఎంట్రీతో మూడు ముక్కలాటగా పరిస్థితి మారుతోంది!
అనపర్తి విషయంలో చంద్రబాబు నాయుడు మాట సవరిస్తున్నారు! అది బీజేపీకి కేటాయించినట్టే కేటాయించి, ఇప్పుడు మళ్లీ తమ పార్టీ అభ్యర్థిని చంద్రబాబు నాయుడు తెరపైకి తెస్తున్నట్టుగా ఉన్నారు! అలాగే జనసేన అభ్యర్థులనూ చంద్రబాబు నాయుడు మార్పిస్తున్నట్టుగా ఉన్నారు. రైల్వే కోడూరు విషయంలో మార్పు జరిగింది.
చంద్రబాబు నాయుడు తమ పేరును అభ్యర్థిత్వం విషయంలో ప్రకటించగానే.. ఆ జాబితాలోని నేతలు ఎగిరి గంతేసి.. ప్రచారానికి వెళ్లిపోయారు. అలాంటి చోట్లలో వివాదాలు రేగిన నియోజకవర్గాల సంఖ్య ఒక ఇరవై వరకూ ఉన్నాయి! ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొన్ని చోట్ల మార్పులు మొదలుపెట్టడంతో.. వివాదాలున్న నియోజకవర్గాలన్నింటిలోనూ కొత్త అలజడి రేగుతోంది. నామినేషన్లు దాఖలయ్యే వరకూ నమ్మకాలు లేవని.. ఎవరి టికెట్లు గాలికి పోతాయనే భయం వివాదాల్లోని నియోజకవర్గాల అభ్యర్థుల్లో తీవ్ర స్థాయికి చేరుతోంది!
సూళ్లూరు పేట, మాడుగుల, మడకశిర, కడప ఎంపీ, నరసాపురం ఎంపీ, సత్యవేడు వంటి సీట్ల విషయంలో మార్పులు జరుగుతాయని, ఈ జాబితాలో మరో ఐదారు నియోజకవర్గాల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అటు ఇటుగా ఇరవై నియోజకవర్గాల విషయంలో ఇప్పుడు మార్పు చర్చలు జరుగుతూ ఉండటం గమనార్హం!