మెగాస్టార్ చిరంజీవి ఇటీవలి కాలంలో రాజకీయంగా తన అభిప్రాయం ఏమిటో చెప్పకుండా చాలా గుంభనంగానే ఉంటున్నారు. ఎవ్వరికీ అనుకూలంగా గానీ, ప్రతికూలంగా గానీ మాట్లాడడం లేదు.
పవన్ కల్యాణ్ తన తమ్ముడు గనుక, తన ఆశీస్సులు కోరి వచ్చాడు గనుక.. ఏదో అయిదు కోట్లరూపాయల చెక్కు ఇచ్చి పంపారు. అంతకుమించి రాజకీయ జోక్యం లేకుండా గుంభనంగా ఉంటున్నారు. అలాంటిది చిరంజీవిని బజారుకీడ్చారు సీఎం రమేష్.
గుట్టుగా ఉంటున్న చిరంజీవిని ఇవాళ నలుగురూ తిడుతున్నారు. అయితే ఆయనను అలా తిట్టించడం వారి వ్యూహంలో భాగమేనట. ఆయనను ఒక వర్గం వారితో బాగా తిట్టిస్తే.. చిరంజీవి అభిమానులందరూ ఆ వర్గానికి వ్యతిరేకంగా ఏకం అవుతారని, అందుకోసమే అలా చేశాం అని సీఎం రమేష్ అంటున్నారు.
అనకాపల్లి నుంచి భాజపా తరఫున ఎంపీగా పోటీచేస్తున్న సీఎం రమేష్, పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీచేస్తున్న పంచకర్ల రమేశ్ బాబు రెండు రోజుల కిందట హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో కలిశారు. ఉభయులూ పరస్పరం శాలువాలు కప్పుకోవడం, సత్కరించుకోవడం అయింది. ఆ తర్వాత, ఆయనను ఎంతగా మొహమాటపెట్టారో ఏమో గానీ.. చిరంజీవితో ఒక వీడియో విడుదల చేయించారు. సీఎం రమేష్, పంచకర్ల రమేశ్ ఇద్దరూ తనకు ఎంతో ఆత్మీయులని తన అభిమానులు వారికి ఓట్లు వేసి గెలిపించాలని చిరంజీవి ఆ వీడియోలో కోరారు.
అయితే రాజకీయంగా చాలా సైలెంట్ గా ఉంటున్న చిరంజీవి వీరిద్దరికీ అనుకూలంగా మాట్లాడడం అనేది చర్చనీయాంశం అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వేదికలమీద విమర్శలు వెల్లువెత్తాయి. చిరంజీవి ఫ్యాన్స్ అంతా దానికి కౌంటర్ గా ప్రతివిమర్శలు చేయడం… అసలే హద్దూ అదుపూ ఉండని సోషల్ మీడియాలో అందరూ పరస్పరం తిట్టుకోవడం జరిగిపోయింది.
ఇప్పుడు సీఎం రమేష్ అదే అంటున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘’ అని నేరుగానే రహస్యం బయటపెట్టేశారు. వీళ్ల ఓట్ల కక్కుర్తితో చిరంజీవిని కావాలని తిట్టిస్తారా.. అంటూ ఆయన ఫ్యాన్సే ఇప్పుడు ఈసడించుకుంటున్నారు.