పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్, ఆయన బేటా (కొడుకు) కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు యమ బిజీగా ఉన్నారు. నిప్పులు కక్కుతున్న ఎండలో చెమటోడుస్తూ ప్రచారం చేస్తున్నారు. అన్నీ పార్టీల నాయకులు అంతేననుకోండి. తప్పదు మరి.
సరే… కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలో వచ్చే అవకాశం లేదని కేసీఆర్ అంచనా వేస్తుంటే, కేటీఆర్ తన ప్రచారంలో బీజేపీ మళ్ళీ అధికారంలో వస్తుందన్నట్లుగా మాట్లాడుతున్నాడు. గులాబీ పార్టీకి పన్నెండు స్థానాలు కనుక ఇస్తే కేంద్రంలో ఏం చేస్తుందో చెప్పాడు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పాడు. అది చేసే పనులను గులాబీ పార్టీ అడ్డుకుంటుందని అన్నాడు.
కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది? హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం (యూనియన్ టెర్రిటరీ) చేస్తుందని అన్నాడు. దీనిపై ఆల్రెడీ బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందట. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఆపే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని బేటా సెలవిచ్చాడు.
ఈ ప్రమాదం తప్పాలంటే గులాబీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నాడు. ఆయన చెప్పిన మరో అంశం నియోజకవర్గాల పునర్విభజన. 2026లో డీలిమిటేషన్ జరుగుతుంది కాబట్టి అందులో తెలంగాణకు అన్యాయం జరగకుండా ఆపే శక్తి కేవలం గులాబీ పార్టీకే ఉందన్నాడు.
బీజేపీ అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తుందని, కాబట్టి మార్చకుండా ఆపే శక్తి బీఆర్ఎస్ కే ఉందని బేటా చెప్పాడు. గతంలో కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి గాయి గత్తర లేపుతానని ఊగిపోయినప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలని అన్నట్లుగా గుర్తుంది. కేటీఆర్ ఆ సంగతి మర్చిపోయినట్లున్నాడు.
గులాబీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే జరిగే అతి ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే… ఏడాదిలోగానే కేసీఆర్ మళ్ళీ రాష్ట్రాన్ని శాసిస్తాడట. బీఆర్ఎస్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ సీట్లు ఇవ్వాలని కోరుతున్నాడు.