కర్ణాటకలో రేగిన దుమారం జాతీయ స్థాయిలో బీజేపీ పరువు తీస్తోంది! మాజీ ప్రధానమంత్రి అనే ట్యాగ్ ను కలిగి ఉన్న దేవేగౌడ గారికి మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం నేషనల్ టాపిక్ గా మారింది. విచ్చలవిడి రాసలీలలతో ఈ ఎన్డీయే కూటమి ఎంపీ అభ్యర్థి వార్తల్లోకి ఎక్కాడు! ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో బీజేపీని ఇరకాటంలో పెడుతూ ఉంది!
ఈ దారినపోయే దరిద్రాన్ని పొత్తు పేరుతో బీజేపీ తన నెత్తికి తెచ్చుకుంది! మొన్నటి వరకూ జేడీఎస్ ను బీజేపీ ఒక రేంజ్ లో ఆడుకుంది. జేడీఎస్ ను అనరాని మాటలన్నీ అంది. జేడీఎస్ ను అవినీతి పార్టీ అని, కుటుంబ పార్టీ అని, హిందూ వ్యతిరేక పార్టీ అని, ఎంఐఎం దోస్తు అని.. డబ్బుల సంచుల పార్టీ అని.. ఇలా స్వయంగా ప్రధానమంత్రి మోడీ వర్యులు అనని మాటంటూ లేదు!
ఒకవైపు కాంగ్రెస్ ను కుటుంబ పార్టీ అంటూ ఇప్పటికీ విమర్శిస్తూ తెలుగుదేశం, జేడీఎస్ వంటి కుటుంబ పార్టీలతో ఇప్పుడు బీజేపీ పొత్తులు వెలగబెడుతూ ఉంది! ఒకవైపు ఉత్తరాదిన రామమందిర ప్రభంజనంతో తమకు 400 సీట్లు వచ్చేస్తాయని లెక్కగడుతున్న బీజేపీ ఇలా నిన్న మొన్నటి వరకూ తను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన పార్టీలతో ఎందుకు దోస్తీ చేస్తోందో మరి!
ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పుడు ఎన్డీయే కూటమి అభ్యర్థి హసన్ నుంచి. హసన్ లో ఈయనను గెలిపించాలని మోడీ ప్రచారం చేసి పెట్టారు కూడా! మాటెత్తితే హిందుత్వ విలువలు, సనాతన ధర్మం అంటూ వాట్సాప్ యూనిర్సిటీ స్పందిస్తూ ఉంటుంది! అయితే ఇప్పుడు ప్రజ్వల్ రేవణ్ణ కోసం రెండో విడత పోలింగ్ కు ముందు మోడీ ప్రచారం చేశారనే అంశం ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది.
ఒకటో రెండో సీట్లు కలిసి రాకపోవు అన్నట్టుగా బీజేపీ అయిన కాడికి పొత్తులు పెట్టుకుంది. ఇప్పుడు వారి వివాదాలు కూడా బీజేపీకి అంటుకుంటున్నాయి! బీజేపీని సమర్ధిస్తే ఎవరైనా పుణీతులే అనే ధర్మం ఒకటి దేశంలో నడుస్తోంది. ఇందులో భాగంగా ఎడాపెడా కాంగ్రెస్ వాళ్లను చేర్చుకుంటున్నారు, అవకాశ పొత్తులూ పెట్టుకుంటున్నారు కమలం పార్టీ వాళ్లు! ఇప్పుడు ప్రజ్వల్ వ్యవహారాన్ని ఆయన సొంత పార్టీ కూడా సమర్థించే పరిస్థితుల్లో లేదు!
అబ్బే.. అవన్నీ పాత వీడియోలు అంటూ ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ బాహాటంగా చెబుతున్నారు! నాలుగైదేళ్ల కిందటి వీడియోలట! ఇప్పుడు వదిలారట! అయితే ఫర్వాలేదనమాట! కర్ణాటక లోక్ సభ సీట్లలో సగం వాటికి పోలింగ్ పూర్తయ్యింది. పాత మైసూరు ప్రాంతంలో పోలింగ్ పూర్తయ్యింది. నార్త్ కర్ణాటకలో పోలింగ్ మిగిలే ఉంది. ప్రజ్వల్ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో కూడా పోలింగ్ పూర్తయ్యింది. ఇంకా సగం సీట్లలో పోలింగ్ మిగిలే ఉన్న నేఫథ్యంలో.. ఈ వ్యవహారం బీజేపీకి పోటుగా మారింది. ఒక సిట్టింగ్ ఎంపీ, అధికార కూటమి అభ్యర్థి పై ఈ స్థాయి దుమారం రేగడంతో జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం దుమారం రేపుతోంది!