కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా టీటీడీపై దుష్ప్రచారం చేయడం ఆశ్చర్యంగా వుంది. శ్రీవారి లడ్డూలను థామస్ అనే కాంట్రాక్టర్ నేతృత్వంలో తయారు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ వార్నింగ్ ఇచ్చింది. టీటీడీపై దుష్ప్రచారం ఎవరు చేసినా నేరమే. తప్పుడు ప్రచారం చేసే వారిపై తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ఇవి ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆచరణలోకి దిగాలి.
ఈ నేపథ్యంలో టీటీడీపై తప్పుడు ప్రచారం చేసిన కడప ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము టీటీడీ అధికారులకు ఉందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. గత ఆదివారం కడప ఎమ్మెల్యే తన కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ప్రసాదం నాణ్యతపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమె ఏమన్నారంటే…
“కొత్త ప్రభుత్వం ఏర్పడినా టీటీడీలో పరిస్థితి మారలేదు. ప్రసాదాల నాణ్యత దారుణంగా వుందని ప్రశ్నిస్తే ఆర్గానిక్ పప్పుదినుసులతో చేశామని సర్దిచెప్పి పంపుతున్నారు. చాలా మంది భక్తులతో మాట్లాడితే ప్రసాదాల నాణ్యత సరిగా లేదని తెలిపారు. ప్రసాదాల నాణ్యతపై సీఎం చంద్రబాబు, టీటీడీ ఈవోకు లేఖ రాస్తా”
కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి సరిగ్గా మూడు రోజుల నాడు శ్రీవారి ప్రసాదం నాణ్యత దారుణంగా వుందని విమర్శించారు. కానీ ఆమె సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా క్రిస్టియన్ కాంట్రాక్టర్ నేతృత్వంలో ప్రసాదం తయారు చేస్తున్నారని విమర్శించకపోవచ్చు. నాణ్యత లేదనడం వాస్తవమే కదా? ఆమె నాణ్యత విషయమై విమర్శ చేసినప్పుడు టీటీడీ ఎందుకు ఖండించలేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. శ్రీవారి పోటులో 980 మంది హిందూ కార్మికులు పని చేస్తూ వుండొచ్చు.
కానీ ప్రసాదంలో నాణ్యత లోపించిందని ఆరోపించింది అధికార పార్టీ ఎమ్మెల్యే కదా? మరి ఆమె ఆరోపణల్లో వాస్తవం వుందా? లేదా? ఒకవేళ ఆమె దుష్ప్రచారం చేస్తోందని భావిస్తే కఠిన చర్యలు తీసుకోడానికి టీటీడీ అధికారులు ముందుకొస్తారా? అమాయకులేనా అధికారుల టార్గెట్? అనే ప్రశ్నకు జవాబు చెప్పాల్సి వుంది. అన్నిటికి మించి కడప ఎమ్మెల్యే ఆరోపణలపై ఇంత వరకూ టీటీడీ అధికారులు ఎందుకు స్పందించలేదు.