అక్కినేని నాగార్జున ఒకటే ఫిక్స్ అయ్యారు. అది సెంటిమెంట్ గా మారుతోంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ కథలు అక్కినేని ఫ్యామిలీ హీరోలకు సక్సెస్ ఇస్తాయి. అదే ఆ సెంటిమెంట్. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, నా సామి రంగా ఈ మూడు సినిమాలు ఆ సెంటిమెంట్ ను బలోపేతం చేసాయి. అందుకే కెరీర్ సరిగ్గా లేని, సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కొడుకు అఖిల్ కోసం ఓ పల్లెటూరి కథను పట్టుకున్నారు.
పట్టుకోవడం కాదు, అలాంటి కథ వుందని తెలిసి దగ్గరకు తీసుకున్నారు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా దర్శకుడు అబ్బూరు మురళీ కిషోర్ ఓ కథ తయారు చేసారు. పక్కా పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఎమోషనల్ సీరియస్ సినిమా. అక్కడక్కడ ఫన్ వుంటుంది.. అది వేరే సంగతి. ఒక్క మాటలో చెప్పాలంటే రంగస్థలం టైపు జానర్ అనుకోవాలి. ఈ కథను రవితేజకు వినిపించారు. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.
అయితే ఈ మధ్య రవితేజ చేసిన సీరియస్ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా నడవలేదు. దాంతో థమాకా లాంటి ఎంటర్ టైన్ మెంట్ నే కావాలి కొంతకాలం అని, రవితేజ ఈ కథను పక్కన వుంచారు. మొత్తానికి ఈ సంగతి ఎలా తెలిసిందో నాగ్ కు తెలిసింది. వెంటనే దర్శకుడు మురళిని పిలిచి కథ విన్నారు. అఖిల్ చేయాలని ఫిక్స్ అయిపోయారు.
తమ బ్యానర్ మీదే చేయాలని, తనే మొత్తం దగ్గర వుండి చూసుకోవాలని నాగ్ అనుకుంటున్నారు. ఎలాగైనా అఖిల్ కు మంచి హిట్ ఇవ్వాలన్నది నాగ్ పట్టుదల. ప్రస్తుతం అఖిల్ యువి సంస్ధలో ధీర సినిమా చేయాల్సి వుంది. అది అయిన తరువాత ఈ సినిమా వుంటుందా? లేదూ రెండూ సమాంతరంగా వుంటాయా అన్నది చూడాలి.
నాగ్ కు మరో సెంటి మెంట్ కూడా వుంది. సంక్రాంతి విడుదల. అందువల్ల స్క్రిప్ట్ చకచకా రెడీ చేయించి, సంక్రాంతికి రెడీ చేసేసినా చేసేయవచ్చు. అదీ అఖిల్ కొత్త సినిమా సంగతి.