గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా సంక్షేమ పథకాల లబ్ధిని జగన్ సర్కార్ అందించింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే కాదు, ఇతర పార్టీలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. భారీ మొత్తంలో సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చినా జగన్ ఓడిపోవడం ప్రతి రాజకీయ పార్టీకి గుణపాఠం అనే చర్చ యావత్ దేశ వ్యాప్తంగా జరుగుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వ ఓటమితో పాటు మరీ ముఖ్యంగా నిత్యం జనం మధ్యే గడిపే వైసీపీ ఎమ్మెల్యే ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో జగన్ ఓటమి ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. ఏపీలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందించిన జగన్ సర్కార్ ఓడిపోవడం విస్మయం కలిగించిందని కేటీఆర్ అన్నారు.
వైసీపీ ఘోర పరాజయం పొందినప్పటికీ 40 శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదని కేటీఆర్ అన్నారు. ఇదే సందర్భంలో నిత్యం జనంలో ఉండే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల పాత్రపై కూడా ఆయన కామెంట్ చేశారు. వైఎస్ జగన్‌ను ఓడించేందుకు షర్మిలను పావుగా వాడుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంతకంటే షర్మిల చేసేదేమీ లేదని ఆయన అన్నారు. తెలంగాణలో వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలిగా తమ ప్రభుత్వంపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ నేతలెప్పటికీ మరిచిపోలేరు. తన అన్నకు మిత్రులైన కేసీఆర్, కేటీఆర్‌లపై ఇష్టం వచ్చినట్టుగా షర్మిల తిట్టిన సంగతి తెలిసిందే.