తిరుపతి జనసేన ఇన్చార్జ్ పేరుతో కిరణ్‌రాయల్ ఆగడాలు అన్నీఇన్నీ కావని ఆ పార్టీ నాయకులు అంటుంటారు. వైసీపీలో అంతర్గత విభేదాల వల్ల కిరణ్ రాయల్ ఏం చేసినా చెల్లుబాటు అయ్యాయి. కిరణ్‌రాయల్‌కు వైసీపీలో కీలక నాయకుల మద్దతు వుండడంతో నాటి సీఎం వైఎస్ జగన్, అలాగే మంత్రి ఆర్కే రోజాపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేశాడు. వైసీపీ అధికారంలో వుండగా కిరణ్ రాయల్ చెలరేగిపోయాడు. ఆయనకు టీడీపీ అనుకూల మీడియా అండగా నిలిచింది.
కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆట కట్టించే నాయకుడొచ్చారు. ఆయనే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణికి జగన్ టికెట్ ఇవ్వకపోతే తానే జనసేనలో చేర్పించినట్టు కిరణ్ రాయల్ చెబుతుంటాడు. తిరుపతి జనసేన టికెట్ ఆరణికి దక్కడంతో కిరణ్ జీర్ణించుకోలేకపోయాడు.
పవన్‌కల్యాణ్ ఆదేశించినా, తాను కలుపుకెళ్లాలని ఎంతగా ప్రయత్నించినా కిరణ్ మాత్రం ఓవర్ యాక్షన్ చేశాడని తాజా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు భావన. ఈ నేపథ్యంలో తనను అవమానించిన కిరణ్‌ను రాజకీయంగా అణచివేసే పనిలో ఆరణి బిజీగా ఉన్నారనే చర్చ తిరుపతిలో జరుగుతోంది. ఇందుకు తాజా ఉదాహరణ కృతజ్ఞతా సభలో కిరణ్ రాయల్, ఆరణి శ్రీనివాసులు మాటలే నిదర్శనంగా చెబుతున్నారు.
కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో చాలా మంది కూటమి నాయకులు, కార్యకర్తలు జైలు కెళ్లాల్సి వచ్చిందన్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లను కూటమి పార్టీల్లో చేర్చుకోవద్దని ఆయన కోరాడు. పదవుల భర్తీలో జైలు కెళ్ళి కష్టాలు పడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరాడు.
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి పార్టీల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ పదవులు ఇప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఎవరు కష్టపడ్డారు? ఎవరేం చేశారో ఎవరికి వారే ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన కోరారు. జైలుకు ఎందుకు పోయారో, పోయిన వాళ్లు ఆత్మ విమర్శ చేసుకోవాలని పరోక్షంగా కిరణ్ రాయల్‌కు చురకలంటించారు.
నాయకులు మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని కిరణ్ రాయల్‌కు మరోసారి ఆయన పరోక్షంగా చీవాట్లు పెట్టారని కూటమి నేతలు చెబుతున్నారు. పార్టీకి ఎవరు పని చేశారో వాళ్ల అంతరాత్మకు తెలుసని కిరణ్‌కు నేరుగా తగిలేలా ఆరణి మాట్లాడారు. అంతేకాదు, పైన వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తున్నారని, వారికి ఖచ్చితంగా శిక్ష పడటం ఖాయమని ఆరణి అనడంపై కూటమిలో చర్చకు తెరలేచింది. ఎవరికి వారు భుజాలు తడుముకుంటున్నారు.
ఆరణి ప్రధానంగా కిరణ్ రాయల్‌ను దృష్టిలో పెట్టుకునే మాట్లాడినట్టు కూటమి నేతలు అంటున్నారు. టికెట్ దక్కించుకున్న ఆరణి మర్యాద కోసం కిరణ్‌ను కలవడానికి వెళ్లారు. ఆ తర్వాత కిరణ్ మీడియాతో మాట్లాడుతూ చాన్నాళ్లకు తమ ఇల్లు గుర్తొచ్చిందని, జీడీ పప్పు, బొకేతో వచ్చాడంటూ ఆరణి శ్రీనివాసుల్ని వెటకరించారు. అంతేకాదు, డివిజన్ ఇన్‌చార్జ్‌లను మారిస్తే ఊరుకునేది లేదంటూ ఆరణిని హెచ్చరించాడు. ఆరణితో కలిసి ప్రచారం చేయడానికి నిరాకరించాడు. పిఠాపురం వెళ్లి పవన్‌కల్యాణ్ కోసం పని చేస్తానని మీడియాతో ఆయన అన్నాడు.
చివర్లో ఒకట్రెండు రోజులు మాత్రమే తిరుపతిలో కిరణ్ రాయల్ మొక్కుబడిగా ప్రచారం చేశాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న ఆరణి శ్రీనివాసులు అతనికి చెక్ పెట్టేలా మాట్లాడారు. రానున్న రోజుల్లో కిరణ్‌ను బయటికి సాగనంపేందుకు ఏం చేయాలో ఆ పనులన్నీ ఆరణి, ఆయన వర్గీయులు చేస్తారనే చర్చ విస్తృతంగా సాగుతోంది. తిరుపతిలో మాత్రం కిరణ్‌కు కష్టకాలమే అని ఆరణి వర్గీయులు స్పష్టం చేస్తున్నారు.