ఉచిత ఇసుక పంపిణీపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిందొకటి, చేస్తున్నది మరొకటి అని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక అంతా ఉత్తుత్తిదే అని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఉచిత ఇసుక అంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ విస్తృతంగా ప్రచారం చేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చి మోసానికి పాల్పడుతున్నారని వైసీపీ విమర్శిస్తోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మరోసారి ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక పంపిణీ ఉత్తుత్తిదే అని ఆయన ఆరోపించారు. స్టాక్ యార్డుల వద్ద ప్రభుత్వమే ప్లెక్సీలు పెట్టి మరీ ఇసుక విక్రయిస్తోందన్నారు. ఇది ఎలా ఉచిత ఇసుక పంపిణీ అవుతుందని ఆయన ప్రశ్నించారు. రీచ్‌ల దగ్గర వసూల్ చేసే డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతోందని సుధాకర్‌బాబు ప్రశ్నించారు.
గతంలో తమ హయాంలో రూ.750 కోట్లు ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడా సొమ్మంతా టీడీపీ నేతల ఇళ్లకు వెళుతోందని ఆయన ఆరోపించడం గమనార్హం. 2014-19 మధ్య కూటమి ప్రభుత్వం ఇసుక సరఫరాలో ఏ రకమైన దందాకు పాల్పడిందో, ఇప్పుడు అదే దోపిడీకి తెరలేపిందని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వం ఇసుకను విక్రయించినట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమ్ముతోందన్నారు. అయితే ఆ వచ్చే డబ్బు ప్రభుత్వ ఖజానాకు చేరడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హామీల్ని తుంగలో తొక్కడం చంద్రబాబు నైజమని ఆయన అన్నారు. ప్రజల్ని నిలువునా ముంచడంలో చంద్రబాబుకు తిరుగులేదని సుధాకర్‌బాబు విమర్శించారు.