వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కష్టాకాలం నడుస్తోంది. అధికారాన్ని కోల్పోవడం ఒక ఎత్తైతే, కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే దక్కడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ. మళ్లీ మొదటి నుంచి పార్టీ నిర్మాణం జరగాల్సిన పరిస్థితి. జగన్ పాలన మరీ అధ్వానంగా సాగిందా? అంటే… అదేం లేదనే అభిప్రాయాన్ని ప్రత్యర్థులు సైతం చెప్పే మాట. అయితే కూటమి హామీలు, కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని మాత్రమే నమ్ముకుని, మిగిలిన ప్రజానీకాన్ని విస్మరించారనే విమర్శ బలంగా వుంది.
ఈ నేపథ్యంలో తన తండ్రి వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు జగన్‌కు వైఎస్సార్ మార్గమే శిరోధార్యమనే మాట ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ముందుగా జగన్ ట్వీట్ ఏంటో చూద్దాం.
“నాన్నా మీ 75వ పుట్టిన రోజు మా అందరికీ పండుగ రోజు. కోట్లాది కుటుంబాలు ఇవాళ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు మీ పుట్టినరోజున సేవా కార్యక్రమాల్లో ముందుకు సాగుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం మీరు చూపిన మార్గం మాకు శిరోధార్యం. జీవితాంతం మీరు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో మీరు చూపిన ధైర్యసాహసాలు మాకు మార్గం. మీ ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా… చివరి వరకూ మా కృషి” అని జగన్ తన మనసులో మాటను ఆవిష్కరించారు.
వైఎస్సార్ తుది శ్వాస వరకూ ప్రజలు, కార్యకర్తలు, నాయకులంటే ప్రేమ చూపారు. ప్రతి రోజూ ఉదయం ఆయన ప్రజల నుంచి స్వయంగా వినతిపత్రాలు స్వీకరిస్తూ వాటి పరిష్కారానికి చొరవ చూపేవారు. వైఎస్సార్‌ను కలిశామన్న తృప్తితో ఇంటికి వెళ్లేవారు. అలాగే తన పార్టీ నాయకుల్నే కాకుండా, ప్రత్యర్థులకు కూడా సీఎంగా అపాయింట్‌మెంట్స్ ఇస్తూ, వారు చెప్పింది వినేవారు.
తన తండ్రి నుంచి జగన్ ప్రధానంగా నేర్చుకోవాల్సింది ప్రతి ఒక్కర్నీ ప్రేమించడం. వైసీపీ అంటే కేవలం తన కేంద్రంగా నడిచేది కాదని జగన్ గుర్తించాలి. ప్రతి ఒక్కరికీ ఆత్మాభిమానం వుంటుందని గ్రహించి, వారిని గౌరవించాలి. తనను కలవాలని కోరుకుంటున్న జనానికి, నాయకులకు అపాయింట్‌మెంట్స్ ఇవ్వాలి. వారు చెప్పింది వినాలి. వైఎస్సార్‌లా జగన్ ప్రేమ గల మనిషి అనే మంచి పేరు సాధించుకోవాలి. అప్పుడే తన తండ్రి బాటలో జగన్ నడిచినట్టు. ప్రేమ పంచితే, ప్రేమ పొందొచ్చని జగన్ గుర్తించిన నాడే తిరిగి మంచి రోజులుంటాయి.