కల్కి సినిమా ఊపు నుంచి మెల్లగా ఇండియన్ 2 మూడ్ లోకి వస్తున్నారు తెలుగు సినిమా అభిమానులు. కల్కి సినిమా సోలోగా చూసేయడం పూర్తయింది చాలా వరకు టికెట్ రేట్లు తగ్గడంతో ఫ్యామిలీలు థియేటర్లకు రావడం స్టార్ట్ అయింది. ఇలాంటి టైమ్ లో ఇండియన్ 2/భారతీయుడు 2 ప్రమోషన్లు స్పీడ్ అందుకున్నాయి. కమల్ హాసన్ స్వయంగా రంగంలోకి దిగడంతో బజ్ మెల్లగా అందుకోవడం మొదలైంది.
సాధారణంగా తమిళ సినిమాల పెద్ద హీరోలు తెలుగు నాట ప్రచారం చేయడం తక్కువ. ముఖ్యంగా అజిత్, విజయ్ లాంటి వారు. కానీ కమల్ హాసన్ మాత్రం నేరుగా రావడం, జనాలతో నేరుగా మాట్లాడడం వంటివి కలిసి వస్తున్నట్లు కనిపిస్తోంది. పైగా సినిమా మీద ముందే క్లారిటీ ఇస్తున్నారు. ఎవరు రెండో భాగంలో వున్నారు. ఎవరు లేరు. రెండో భాగంలో ఏం వుండొచ్చు. మూడో భాగంలో ఏం వుంటుంది అనే క్లారిటీ ఇచ్చేస్తున్నారు.
ఇప్పటికే ఇండియన్ 2 మీద కాస్త గ్యాసిప్ లు వున్నాయి. కమల్ విశ్రాంతి తరువాత ఎంటర్ అవుతారని, రెండో భాగం కన్నా మూడో భాగం ఇంకా బలంగా వుంటుందని ఇలా రకరకాల వార్తలు వున్నాయి. కాజల్ మూడో భాగంలోనే వుంటుందని క్లారిటీ ఇచ్చేసారు. అలాగే రామ జోగయ్య రాసిన ఓ పాట మూడొ భాగానికి మార్చారని చెప్పేసారు. ఇవన్నీ చూస్తుంటే మూడో పార్ట్ పక్కా అని, రెడీ అవుతోందని అర్థం అవుతోంది.
మూడో భాగం తీయాలి, తీస్తున్నాం అనే బలమైన లక్ష్యం ఎప్పుడు వుంటుంది అంటే రెండో భాగం మీద ఆ మేరకు అంచనాలు వున్నపుడే. అందువల్ల దర్శకుడు శంకర్, హీరో కమల్ కు ఆ నమ్మకం వుంది అనుకోవాలి. ఈ నెల 12న సినిమా థియేటర్లలోకి వస్తోంది. అంటే మరో నాలుగు రోజులు. సాధారణంగా కల్కి రేంజ్ హిట్ తరువాత కొన్నాళ్లు టాలీవుడ్ లో స్లంప్ నడవడం అన్నది ఆనవాయితీ. కానీ కల్కి వచ్చిన రెండు వారాలకే ఇండియన్ 2 వస్తోంది. అందువల్ల థియేటర్లు మరి కొన్నాళ్లు కళకళలాడడం గ్యారంటీ.