Committee Kurrollu Review: మూవీ రివ్యూ: కమిటీ కుర్రోళ్లు

ప్రయత్నంలో కష్టం కనిపించింది కానీ, ఫలితం దక్కడానికి ఇంకా మెరిట్ చూపించాలి.

చిత్రం: కమిటీ కుర్రోళ్లు
రేటింగ్: 2.5/5
తారాగణం: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, టీనా శ్రావ్య, రాధ్యా సురేష్, తేజస్వి రావు, సాయికుమార్, గోపరాజు రమణ, శ్రీలక్ష్మి తదితరులు
సంగీతం: అనుదీప్ దేవ్
కెమెరా: రాజు
ఎడిటింగ్: అన్వర్ ఆలి
నిర్మాత: పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
దర్శకుడు: యదు వంశీ
విడుదల: 9 ఆగస్టు 2024

అందరూ కొత్త నటీనటులే అయినా మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు కుటుంబసభ్యులు నిర్మాతలు కావడం వల్ల ప్రచారానికి నోచుకుంది ఈ చిత్రం. ట్రైలర్ ని బట్టి ఇది సీరియస్ కంటెంట్ అని అర్ధమవుతుంది. రిజర్వేషన్స్ టాపిక్ ఉండడం వల్ల కాస్తంత కాంట్రవర్సీ ఏదైనా ఉంటుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇంతకీ కథాకథనాల్లో విషయమేంటో చూద్దాం.

ఒక పల్లెటూరిలో, ఏ బేధభావాలు లేకుండా చిన్నప్పటి నుంచీ కొందరు మిత్రులు కలిసిమెరిగి పెరుగుతారు. వాళ్లకి కులాల గురించి తెలియదు. కానీ ఎంసెట్ రాసాక సీటు సంపాదించే క్రమంలో మంచి ర్యాంక్ సాధించిన తమ మిత్రుల్లోని ఒక పేద ఓసీ విద్యార్థికి ఫ్రీ సీట్ రాదు. కానీ తక్కువ ర్యాంక్ వచ్చిన ఇతర కులస్థుడికి సీటొస్తుంది. దాంతో తమ మిత్రుల్లో వాదన మొదలయ్యి, అది గొడవగా మారి, రక్తాలొచ్చేలా కొట్టుకోవడం దాకా వెళ్తుంది. అన్నేళ్లు కలిసి పెరిగిన ఈ మిత్రులు ఆ సంఘటనతో వర్గాలుగా విడిపోతారు. ఈ గొడవని స్థానిక రాజకీయ నాయకుడు బుజ్జి (సాయికుమార్) తనకి అనువుగా మలచుకుంటాడు. ఫలితంగా మిత్రుల్లో ఒకడు మరణిస్తాడు. దాంతో మిత్రుల పట్ల ఇంకా అగాధం ఏర్పడుతుంది. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ఎప్పుడు కలుస్తారు? ఎలా కలుస్తారు అనేది తక్కిన కథ.

ఓటీటీల్లో వచ్చే “ప్రేమలు” లాంటి మళయాళ సినిమాని చూసి స్ఫూర్తి పొంది, దానికి “కాంతారా” టైపులో ఒక జాతర సెట్టింగ్ పెట్టుకుని, బాహుబలిని గుర్తు చేసే “బలిచాట” సీనొకటి కల్పించుకుని, “మంజుమల్ బాయ్స్” రీతిలో స్నేహితుల ఎమోషన్ ని పండించాలనే ప్రయత్నంతో తీసినట్టుంది ఈ సినిమా.

అందులో తప్పేమీ లేదు. అయితే ఎమోషన్ పండుతోందా లేదా, ఆడియన్స్ ని చివరి వరకు ఆసక్తికరంగా కూర్చోపెడుతుందా లేదా, కథలో కన్వే చేయదలచుకున్న విషయం ఏమిటి అనే వాటిని జడ్జ్ చేసుకోవాలి. ఆ జడ్జ్మెంట్ తప్పితే ప్రేక్షకులకి తిప్పలే.

అనుకున్న పాత్రలకి నటీనటుల ఎంపిక బాగుంది. వాళ్ల నటన కూడా మెప్పించే విధంగానే ఉంది. అందరూ చాలా నేచురల్ గా పర్ఫాం చేసారు. వాళ్ల ట్యాలెంట్ ని బయటపెట్టే అవకాశం వచ్చినందుకు ఎవరి కష్టం వాళ్లు పడ్డారు.

మొదలవడం బాగుండి, కాస్తంత నవ్వులు తెప్పించి, ఇంటర్వల్ వరకు బాగానే నడిచి జీవకళతో ఉన్న ఈ చిత్రం.. సెకండాఫుకొచ్చేసరికి నీరసమైన కథనంతో, బలవంతమైన ఎమోషన్స్ తో, ఊహించనంత చప్పని క్లైమాక్స్ తో ప్రేతకళని సంతరించుకుంది. ఇంటర్వెల్లో కాస్త హ్యాపీగా కనిపించిన ప్రేక్షకులు సినిమా ఎండ్ అయ్యే సరికి ఎండదెబ్బ తగిలిన మొహాల్లా ముడుచుకుపోవడమే దానికి నిదర్శనం.

ప్రధానంగా ఇది యూత్ ని టార్గెట్ చేసిన చిత్రం. ఎక్కువగా కష్టపెట్టకుండా లైటర్ వీన్ లో తీసుకుపోతే వాళ్లే పాజిటివ్ టాక్ తో మోస్తారు. అలా కాకుండా నవరసాల్ని చిలుకుదామనుకుంటే చిరాకు పడతారు. టైటిల్ చూస్తే కామెడీపాళ్లు ఎక్కువగా ఉండే సినిమాయేమో అనిపిస్తుంది. అలా అనుకుని వెళ్తే భంగపాటు తప్పదు.

సరదాగా సాగే కథలో సడెన్ గా రిజర్వేషన్స్ టాపిక్ రావడంతో, అటు నుంచి కథనం సీరియస్ టర్న్ తీసుకుంటుంది. ఇక అక్కడి నుంచి లైటర్ వీన్ సన్నివేశాల్ని ఆశించకుండా పెద్దమనసు చేసుకుని చూడాల్సిన పరిస్థితి.

శివగా సందీప్ సరోజ్ న్యాయం చేసాడు. సూర్యగా యశ్వంత్ పెండ్యాల, విలియం గా ఈశ్వర్ రాచిరాజు ఇద్దరూ పాత్రోచితంగా నటించారు. సుబ్బు పాత్రధారి నటనలో ఇంపాక్ట్ ఉంది. టీనా శ్రావ్య, రాధ్య సురేష్, తేజస్విరావుల పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో తమ ఉనికి చాటుకున్నారు. సాయికుమార్, గోపరాజు రమణ, శ్రీలక్ష్మి తమ క్యారక్టర్ నటనతో ఓకే అనిపించారు.

టెక్నికల్ గా చూస్తే అనుదీప్ దేవ్ సంగీతం బాగుంది. “ఇదేమి గారడి..” పాటలో కొంచెం మిక్కీ జె మేయర్ అనుకరణ వింపించింది. సెకండాఫులో వచ్చే జాతర పాట క్యాచీగా ఉంది. నేపథ్య సంగీతంలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న మెరుపులు చూపించాడు.

చివర్లో వచ్చే ఎన్నికల పాట ఐడియా బాగుంది కానీ, చూడ్డానికే తప్ప విని అస్వాదించడానికి లిరిక్స్ లో పట్టు లేదనిపించింది.

ఈ పాట రావడానికి ముందు డబ్బు పంపిణీ సీనులో దర్శకుడు చూపించిన క్రియేటివిటీ చాలా ఫోర్స్డ్ గా ఉంది. విడిగా చూసినప్పుడు బాగుండొచ్చేమో కానీ ఆ నెరేటివ్ ఫ్లోలో ఆ పాటర్న్ అంతగా సింక్ అవ్వలేదు.

రాజు కెమెరా వర్క్, అన్వర్ ఆలి ఎడిటింగ్ ఓకే.

మంచి నటుల్ని పెట్టుకుని, బలమైన బ్యానర్ ని పట్టుకుని, ఆద్యంతం వినోదాత్మకంగా మలచలేక, అలాగని ఎంచుకున్న జానర్ తో గుండెలకు పూర్తిగా హత్తుకోలేక నీరసపడ్డ చిత్రమిది.

అగ్రకులం కుర్రాళ్లు, ఇతర కులాల మిత్రులు, ఒక ముస్లిం అమ్మాయి, ఒక క్రీస్టియన్ హీరోయిన్.. ఇలా అందర్నీ కలుపుకుని రాసుకున్న సెక్యులర్ కథ ఇది.

“నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్” లోని పాట, “మోట బావిలో మిత్రుని మరణం- ఏకధాటిగా ఏడ్చిన తరుణం.. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి” అనే లైన్ ని స్ఫూర్తిగా తీసుకుని సినిమా మొత్తం రాసుకున్నట్టుంది.

ప్రయత్నంలో కష్టం కనిపించింది కానీ, ఫలితం దక్కడానికి ఇంకా మెరిట్ చూపించాలి. ఎందుకంటే ప్రేక్షకులు ఏ సినిమానీ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టరు. మెరిట్ ఉందనిపిస్తే తమ గుండెల్లో సీటిస్తారు, లేకపోతే లేదు.

“కమిటీ కుర్రోళ్లు” టైటిల్ కంటే “సెంటిమెంట్ కుర్రోళ్లు” అని పెట్టుంటే యాప్ట్ గా ఉండేది.

బాటం లైన్: సెంటిమెంట్ కుర్రోళ్లు

29 Replies to “Committee Kurrollu Review: మూవీ రివ్యూ: కమిటీ కుర్రోళ్లు”

  1. ఇమేజ్లో లో 11 మంది ఉన్నారా లేక జూన్ 4 నుంచి నాకు ఎక్కడ చూసినా 11 కనబడుతుందా

  2. Great andhra kadu chetha review andhra ani petuko. Transparent ga andariki okela chepochuga enduku okadi sanka nakadam inkokarni next level lo judge cheyadam. Nenu film person ne ni number peru enduku baledo we can discuss…

Comments are closed.