1925 జులైలో పుట్టిన ప్రముఖ చిత్ర దర్శకనిర్మాత, నటుడు గురుదత్ శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. 60 ఏళ్ల క్రితం తన 39వ ఏట 1964 అక్టోబరు 9న అతను ఆత్మహత్య చేసుకొన్నాడు. గురుదత్ను సజీవంగా చూసిన చివరి వ్యక్తి అతని మిత్రుడు, రచయిత అబ్రార్ అల్వి. రాత్రి 8.30 గంటల వరకు అతను, గురుదత్ అప్పుడు గురుదత్ తీస్తున్న ‘‘బహారే ఫిర్ భీ ఆయేంగే’’ లో హీరోయిన్ మరణదృశ్యం ఎలా చిత్రీకరించాలో చర్చించుకున్నారు. రాత్రంతా గురుదత్ తాగుతూనే ఉన్నాడు. మర్నాటి ఉదయానికి మరణించి ఉన్నాడు. హెచ్చు మోతాదులో నిద్రమాత్రలు ఎక్కువగా సేవించినట్లు పోస్టుమార్టమ్‌లో తెలిసింది. 39 సంవత్సరాల వయసులోనే 13 సినిమాల్లో నటించి, 13 సినిమాలు తీసి, నూరేళ్ల జీవితానికి సరిపడా ఖ్యాతిని దేశంలో, విదేశాలలో కూడా గడించాడు. ‘టైమ్స్ మ్యాగజైన్ వారి 100 గ్రేటెస్ట్ మూవీస్ లిస్ట్‌లో అతను నటించి, దర్శకనిర్మాతగా ఉన్న ‘‘ప్యాసా’’ (1957) ఉంది.
మరి అటువంటి వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలి? చనిపోయేందుకు ముందు రోజు రాత్రి పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అన్న విషయంలో భార్య గీతాదత్తో వాదోపవాదాలు నడిచేయి. కానీ భార్యతో తగాదాలు అతనికి కొత్త కాదు. ప్రేమ వివాహమే ఐనా, మొదటినుంచీ వారి స్వభావాలు వేరు. వహీదా రెహమాన్ రంగప్రవేశంతో విభేదాలు ఇంకా పెరిగాయి. 1963 నుంచి భార్యాభర్తలు విడిగా ఉండేవారు. పిల్లల్ని పంపమని గురుదత్ అడిగినా గీతా కొన్నిసార్లు పంపేది కాదు. ఆదొక వేదన ఉండేది. 1963 లోనే బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్ళినపుడు ‘తమ స్నేహం (బ్యూటిఫుల్ రిలేషన్షిప్) కి ఇంతటితో సరి’ అని చెప్పేసింది వహీదా. గురుదత్ వెంటనే కాల్చుకుని చచ్చిపోలేదు. ఏడాది పైన బతికేడు. అయితే ఆ రాత్రి అతని ఆత్మహత్యకు కారణం ఏమిటి?
అప్పుడు తమ నిర్మిస్తున్న ‘‘బహారే ఫిర్ భీ ఆయేంగే’’ లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. హీరోగా నటిస్తున్న యితరుల సినిమాలు ‘‘సుహాగన్ (1964 – తెలుగు ‘‘సుమంగళి’’ రీమేక్)’’, కె. ఆసిఫ్ ‘‘లవ్ అండ్ గాడ్’’ (దీనిలో యితని స్థానంలో సంజీవ్ కుమార్‌ను తీసుకుని 1969లో మళ్లీ మొదలుపెట్టారు, కానీ అసిఫ్, సంజీవ్ కూడా మరణించడంతో చాలా ఆలస్యమై 1986లో విడుదలైంది) నిర్మాణంలో ఉన్నాయి. అర్ధాంతరంగా మృత్యువును ఆహ్వానించడానికి కారణం గురుదత్ యొక్క వింత మానసిక ప్రవృత్తియే. అతను ఒక హృదయమున్న కళాకారుడు. సాధారణ లోకంతో సమాధాన పడలేని ఆవేశపరుడు. ‘‘ప్యాసా’’లో తన పాత్ర ద్వారా తనకు తాను వేసుకొన్న ‘ఇలాంటి లోకం దక్కినా ఏమున్నది లాభం?’ (‘యే దునియా ఆగర్ మిల్ భీ జాయేతో క్యా హై?’) అన్న ప్రశ్నయే అతన్ని వెంటాడింది.
నిజానికి 1962లోనే ఒకసారి ఆత్మహత్యకు పాల్పడి మూడు రోజుల తర్వాత మృత్యుముఖంలో నుండి బయటపడ్డాడు. చావంటే గురుదత్‌కు గల అభిప్రాయం గురించి వహీదా ఒకసారి చెప్పింది “అతనికి తను చేసే పని అంటే, సాటి మనుషులంటే ఇష్టం; చావంటే కూడా ఇష్టం. చావుకోసం ఎదురు చూసేవాడు. తరచుగా అనేవాడు జీవితంలో రెండే ఉన్నాయి- గెలుపు, ఓటమి. అయితే ఇది, కాకపోతే అది. నేను రెండూ చవి చూసేశాను. ఇక జీవించడంలో ఏమాత్రం ఆకర్షణ (చార్మ్) లేదు” అనేవాడట.
అవును. గురుదత్ గెలుపు ఓటములను సమానంగా చవిచూశాడు. ‘‘బాజీ’’ (1951), ‘‘జాల్’’ (1952), ‘‘ఆర్‌పార్’’ (1953), ‘‘మిస్టర్ అండ్ మిసెస్ 55’’ (1955), ‘‘సి.ఐ.డి.’’ (1956) వంటి ఫక్తు వాణిజ్య సినిమాల ద్వారా ధనమే కాక ‘‘ప్యాసా’’ (1957), ‘‘కాగజ్ కే ఫూల్’’ (1959), ‘‘సాహెబ్, బీబీ ఔర్ గులామ్’’ (1962) వంటి కళాత్మక చిత్రాల ద్వారా కీర్తి ప్రతిష్ఠలు కూడా ఆర్జించాడు గురుదత్. ‘‘శైలాబ్’’ (1956) ఫెయిలయింది. 50 లక్షల ఖర్చుతో సినిమా స్కోప్‌లో తీసిన ‘‘కాగజ్ కే ఫూల్’’ చిత్రం పరాజయం పొందాక డైరెక్టరుగా తన పేరు వేసుకోకపోయినా, తను హీరోగా, నిర్మాతగా ‘‘చౌధ్వీకా చాంద్’’ (1960) వంటి హిట్ చిత్రం తీసి మళ్ళీ గురుదత్ ఫిల్మ్స్‌ను నిలబెట్టుకున్నాడు. చనిపోయేటప్పడు తీస్తూన్న చిత్రం ‘‘బహారే..’’ కూడా హిట్ అయింది. గురుదత్ చనిపోవడంతో హీరోగా ధర్మేంద్రను పెట్టి, షహీద్ లతీఫ్ దర్శకత్వంలో సినిమా పూర్తి చేశారు.
చనిపోయేనాటికి నటుడిగా కూడా గురుదత్ బిజీగా ఉన్నాడు. హీరోగా వేసిన ‘‘సౌతేలీ భాయ్’’ (1962), ‘‘బహూరాణి’’ (1963), ‘‘భరోసా’’ (1963), ‘‘సాంఝ్ ఔర్ సవేరా’’(1964), సినిమాలు విడుదలై హిట్ అయ్యాయి. ‘‘సుహాగన్’’ (1964) తయారీలో ఉంది. అందువల్ల గురుదత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక కారణాలు లేవు. అయినా గురుదత్ ఆర్థిక వ్యవహారాల్లో నివుణుడు కాదు. స్థితప్రజ్ఞుడూ కాదు. ‘పరాజయాన్ని జీర్ణించుకోలేని మనస్తత్వం అతనిది’ అంటాడు దేవ్ ఆనంద్. ‘‘కాగజ్ కే ఫూల్’’ ఫెయిల్ అయ్యేక సంయమనాన్ని కోల్పోయేడు. అనేక చిత్రాలు మొదలు పెట్టడం, మధ్యలో ఆపివేయడం జరిగింది. కలకత్తాలో, లండన్‌లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు అనవసరంగా తెరిచి నష్టపోయేడు. బొంబాయిలో పాలీహిల్ బంగళాను పడగొట్టి రియల్ ఎస్టేటు బిజినెస్ మొదలు పెట్టి చేతులు కాల్చుకున్నాడు.
సాధారణంగా కళాకారులకు వ్యాపార దక్షత ఉండదు. గురుదత్ అణువణువునా కళాకారుడు. ఒక కవిని బతికుండగా అణగదొక్కి చచ్చిపోయాక ఆకాశానికెత్తే లోకపు తీరుని నిరసిస్తూ ‘‘ప్యాపా’’ తీశాడు. మనస్పర్ధలతో విడిపోయిన భార్య, తనకు మనసిచ్చి తనకోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే హీరోయిన్, ఆమెకు దూరమయితేనే తను దగ్గరవుతానని షరతులు పెట్టిన కూతురు – వీరి మధ్య నలిగి పతనమైన సినిమా దర్శకుడి కథే ‘‘కాగజ్ కే ఫూల్’’. 30 ఏళ్ళ తర్వాత ఆ సినిమాలను ఫ్రాన్స్‌లో ప్రదర్శించినప్పడు ప్రపంచంలోని కళాపిపాసులందరూ జేజేలు పలికారు. ఆ చిత్రాలలోని సంగీతం అజరామరం. అవే కాదు, గురుదత్ సినిమాలన్నిటిలో సంగీతం, పాటల చిత్రీకరణ చాలా బాగుంటుంది.
గురుదత్‌కు కుటుంబం నుంచి సంక్రమించిన వారసత్వం, సంగీతప్రియత్వం. చాలామంది అనుకొనేటట్లు గురుదత్ బెంగాలీ కాదు. దత్ అనే యింటిపేరు పంజాబీల్లో (సునీల్ దత్), బెంగాలీల్లో (ఉత్పల్ దత్) ఉంది కానీ యితని యింటిపేరు పడుకొనే. దక్షిణ కెనరా (కర్ణాటక) వాడు. తండ్రి శివశంకర రావు పడుకొనే. తల్లి వాసంతి కళలందు అభిరుచి కలిగినది. ఆమె ప్రభావం గురుదత్‌పై చాలా ఉంది. తండ్రి పనంబూరులో టీచరుగా పనిచేసి, బెంగుళూరుకు మకాం మార్చేడు. 1925 జులై 9న పుట్టిన మగబిడ్డకు వాళ్లు వసంతకుమార్ అని పేరుపెట్టుకొన్నారు. గురువారం నాడు పుట్టాడు. కాబట్టి గురుదత్త అని కూడా పిల్చేవారు. ఓసారి బాగా జబ్బు చేశాక వసంతకుమార్ పేరు వదిలి పెట్టేసి గురుదత్త పేరే ఖాయం చేస్తామని మొక్కుకున్నారు. సినిమాల్లోకి వచ్చేసరికి అది గురుదత్ అయింది. గురుదత్ తర్వాత వాళ్లకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు పుట్టారు.
వాసంతి కజిన్ శ్రీధర బెనగల్ (శ్యామ్ బెనగల్ తండ్రి) ఆనాటి ప్రఖ్యాత నర్తకుడు ఉదయశంకర్కి పబ్లిసిటీ ఆర్టిస్టుగా పనిచేసేవాడు. ఆయనే మెట్రిక్ పాసైన గురుదత్ను కలకత్తా తీసుకెళ్లి, ఉదయశంకర్‌కు పరిచయం చేసి, అల్మోరాలోని ఆయన డాన్స్ సెంటర్లో నెలకు రూ.75/-ల స్కాలర్‌షిప్‌తో నృత్యం నేర్పించాడు. గురుదత్ నృత్యప్రదర్శనలు కూడా ఇచ్చాడు. అక్కడ నేర్చిన డాన్స్ కొరియోగ్రాఫర్‌గా సినిమాల్లో చేరడానికీ, ‘‘భరోసా’’ (1963) వంటి చిత్రాల్లో తెరపై డాన్స్ చేయడానికీ పనికి వచ్చింది.
డాన్స్ నేర్చుకోవడం పూర్తయ్యాక మేనమామ పూనా లోని ప్రభాత్ పిక్చర్స్ లోని బాబూరావు ద్వారా డైరెక్టరు పి.ఎల్. సంతోషి వద్ద అసిస్టెంటుగా చేర్పించాడు. ‘‘హమ్ ఏక్ హై’’ (1943)లో గురుదత్ డాన్స్ డైరెక్టరుగా, అసిస్టెంటు డైరక్టరుగా పని చేస్తూండగా ఆ సినిమా కథానాయకుడు దేవ్ ఆనంద్‌తో పరిచయమైంది. ఆ స్నేహం ఆమరణాంతం కొనసాగింది. గురుదత్‌కు చాలామందితో మంచి స్నేహం ఉండేది. దేవ్ ఆనంద్, రెహమాన్, జానీ వాకర్, గీతా బాలి, అబ్రార్ అల్వి, వహీదా రెహమాన్ వీరందరూ అతనికి ఆప్తులే. తన క్రింద అసిస్టెంటుగా పనిచేసిన రాజ్ ఖోస్లా (‘‘సి.ఐ.డి.’’)కు డైరక్షన్ అవకాశాలిచ్చి పైకి తీసుకొచ్చాడు.
స్వభావతః గురుదత్ అంతర్ముఖుడు, సిగ్గరి. గబుక్కున కోపం వచ్చేది. మొండిపట్టు ఉండేది. కానీ తన భావాల్ని బయటకు ప్రదర్శించేవాడు కాదు. సినిమా వారికి సహజంగా ఉండే ఆర్భాటం, ప్రదర్శనా ప్రీతి, వంది మాగధులను చేరదీయడం ఇవన్నీ అతనికి ఇష్టం ఉండేది కాదు. అతను అభిమానించేవి శాస్త్రీయ సంగీతం, పెంపుడు జంతువులు, బెర్నార్డ్ షా, షేక్స్పియర్, చదరంగం, బాడ్మింటన్, వంటచేయడం! చెయిన్ స్మోకింగ్, అతిగా మద్యం సేవించడం అతని దురలవాట్లు.
తన నటీనటులు ‘ఓవర్ యాక్ట్’ చేసినా, పొరబాట్లు చేసినా చాలా చికాకు పడేవాడు. నిజానికి గురుదత్ తనను తాను గొప్ప నటుడిగా ఎన్నడూ అనుకోలేదు. ‘‘ప్యాసా’’ కథానాయక పాత్రను దిలీప్ కుమార్ చేత వేయిద్దామనుకొన్నాడు. (పారితోషికం నచ్చకపోవడంతో దిలీప్ ఆ పాత్ర వదులుకుని తర్వాత చాలా చింతించాడు). ‘‘సాహెబ్..’’లో భూత్నాథ్ పాత్రను బెంగాలీ వెర్షన్లో వేసిన బిశ్వజిత్కి ఇద్దామనుకొన్నాడు. కానీ చివరికి తనే ఆ వేషాలు ధరించాడు. ‘‘కాగజ్ కే ఫూల్’’ లో తన 34వ ఏట ఏభై యేళ్ల వాడి పాత్ర అతి సహజంగా నటించాడు. అంత సీరియస్ పాత్ర వేశాక కూడా ‘‘సాహెబ్..’’ లో లోకం పోకడ తెలియని అమాయకుడి పాత్రలో యిమిడిపోయాడు. చాలా సటిల్‌గా నటించే అలవాటున్న గురుదత్ను నటనకు ప్రేరేపించినది హీరోయిన్ గీతా బాలి.
గీతా బాలి తన సోదరితో కలిసి ఎచ్.జి. ఫిలిమ్స్ స్థాపించి గురుదత్ రచన, దర్శకత్వంలో ‘‘బాజ్’’ (1953) సినిమా ప్రారంభించింది. హీరోల డేట్లు దొరక్క అవస్థ పడుతూంటే నా పక్కన నువ్వే హీరోగా వేయి అంది గీతా బాలి. ఉర్దూ చదవడం, రాయడం వచ్చినా తన ఉర్దూ ఉచ్చారణ సరిగ్గా ఉండదేమోనన్న కాంప్లెక్సు ఉండేదతనికి. మరో నటుడు రెహమాన్ లాగే సెట్స్ మీద డైలాగులు మర్చిపోతూండేవాడు. ‘‘చౌధీవీ కా చాంద్’’ చిత్రం షూటింగులో ఓ సీనుకి యిద్దరూ కలిసి 86 టేకులు తిన్నారట. నిజానికి గురుదత్ మొదట వేషం కట్టినది తను డాన్స్ డైరక్టరుగా పని చేసిన ‘‘లఖారాణి’’ (1945)లో! ‘‘చాంద్’’లో కూడా చిన్న వేషం వేశాడు. కానీ దర్శకత్వంపైనే దృష్టి పెట్టాడు. ప్రభాత్లో ఉద్యోగం పోయాక మద్రాసులోని జెమినీ స్టూడియోలో ఉద్యోగం కొరకు ప్రయత్నించాడు కూడా. చివరకు ‘‘గర్ల్స్ స్కూల్’’ (1949) సినిమాకు అమియా చక్రవర్తి వద్ద అసిస్టెంటుగా, ‘‘సంగ్రామ్’’ (1950)కు జ్ఞాన్ ముఖర్జీ వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేశాడు.
ఇంతలో దేవ్ ఆనంద్ తన అన్నగారు చేతన్‌తో కలిసి నవకేతన్ సంస్థ ఆరంభించాడు. చేతన్ డైరక్షన్లో తీసిన వారి తొలి సినిమా ‘‘అఫ్సర్’’ సరిగ్గా ఆడకపోవడంతో రెండో సినిమాగా గురుదత్ దర్శకత్వంలో ‘‘బాజీ’’ (1951) తీశాడు. అది హిట్ అయింది. చేతన్‌కు, గురుదత్‌కు సృజనాత్మకమైన తగాదాలు వస్తూండటంతో గురుదత్ బయటకు వచ్చేసి, తన కొంకణ్ ప్రాంత నేపథ్యంతో కథ రాసి ‘‘ఫిల్మ్ ఆర్ట్స్’’ బ్యానర్‌కు దేవ్ హీరోగా ‘‘జాల్’’ (1952)ను తన దర్శకత్వంలో తీశాడు. ‘‘బాజీ’’ లాగే ఇది కూడా హిట్ అయ్యింది. తర్వాత తను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘‘బాజ్’’ పెద్దగా ఆడలేదు. కానీ ధైర్యం చేసి గురుదత్ ప్రొడక్షన్స్ పేర తనే నిర్మించి, దర్శకత్వం వహించి, హీరోగా నటించిన ‘‘ఆర్ పార్’’ (1954), ‘‘మిస్టర్ అండ్ మిసెస్ 55’’ (1955)లు విజయవంతం అయ్యాయి. మొదటిదాంట్లో శ్యామా, రెండవ దాంట్లో మధుబాల కథానాయికలు.
‘మిస్సమ్మ’’ను హిందీలో పునర్నిర్మిద్దామనే ఆలోచనతో గురుదత్ 1955లో హైదరాబాద్ వచ్చి సినిమా చూశాక ఆ ఆలోచన విరమించుకున్నాడు. అదే పర్యటనలో ‘‘రోజులు మారాయి’’ లో నృత్యం చేసి పాప్యులరైన వహీదా రెహమాన్ అతని దృష్టి నాకర్షించింది. మూడేళ్ల కాంట్రాక్టు రాసుకొని దేవ్ ఆనంద్, వహీదాలతో తన శిష్యుడు రాజ్ భోస్లా దర్శకత్వంలో తన బ్యానర్లో తీస్తున్న ‘‘సి.ఐ.డి.’’(1956) లో సెకండ్ హీరోయిన్గా తీసుకున్నాడు. అది హిట్ అయింది. ఇవన్నీ కమర్షియల్ చిత్రాలు. ఇక కళాత్మకంగా తీయాలనే తపనతో వహీదా, మాలా సిన్హాలు కథానాయికలుగా ‘‘ప్యాసా’’ (1957) నిర్మించాడు. దాని తర్వాత ‘‘ట్వెల్వ్ ఓ క్లాక్’’ (1958) అనే కమర్షియల్ చిత్రాన్ని ప్రమోద్ చక్రవర్తి దర్శకత్వంలో జిపి సిప్పీ నిర్మించగా వహీదా సరసన కథానాయకుడిగా నటించాడు.
1959లో సొంత బ్యానర్లో కళాత్మక చిత్రం ‘‘కాగజ్ కే ఫూల్’’ తీయడం, పరాజయం కావడం జరిగాయి. వెంటనే 1960లో ‘‘చౌధ్‌వీ కా చాంద్’’ అనే ముస్లిమ్ సోషల్ చిత్రాన్ని ఎమ్.సాదిక్ దర్శకత్వంలో నిర్మించాడు. రెహమాన్, వహీదా, గురుదత్ ముఖ్య పాత్రధారులు. ఇది సూపర్ హిట్ కానీ గురుదత్‌కి యీ చిత్రం నచ్చలేదట. 1963లో అబ్రార్ అల్వీ దర్శకత్వంలో తీసిన ‘‘సాహెబ్, బీబీ ఔర్ గులామ్’’లో మీనాకుమారి ముఖ్య పాత్ర ధరించింది. గురుదత్ సరసన నటించినది వహీదా. ఓ మాదిరిగా ఆడింది కానీ ఖ్యాతి మాత్రం విపరీతంగా వచ్చింది. గురుదత్ మరణించే సమయానికి తీస్తున్న సినిమా ‘‘బహారే ఫిర్ భీ ఆయేంగే’’లో వహీదా లేదు.
వహీదా అతని చిత్రాల లోనే కాదు జీవితంలో కూడా సంచలనం రేపింది. గురుదత్ ఆమెపై మనసు పారేసుకున్నాడు. నిజానికి చాలామంది కళాకారుల్లాగే, హృదయం విషయంలో గురుదత్ కాస్త వీక్. డాన్స్ వేర్చుకొనే రోజుల్లో అమ్మాయిలతో తిరిగేవాడు. హైదరాబాద్‌లో నివసించే బంధువులమ్మాయితో వివాహం నిశ్చయమైనప్పుడు ఆ విషయం ఆమెకు చెప్పేశాడు. దాంతో ఆమె పెళ్లి చేసుకోననేసింది. ఆ తర్వాత ‘‘బాజీ’’ (1951) చిత్ర నిర్మాణంలో ఉండగా ఆ చిత్రానికి ప్లేబాక్ గీతాలు పాడుతున్న గీతా రాయ్ పరిచయమయ్యింది. గురుదత్‌కీ, అతని తల్లికీ ఆమె చాలా వచ్చింది. గీతా తల్లిదండ్రులు కూతుర్ని ఒక బెంగాలీ అబ్బాయి కిచ్చి పెళ్ళి చేద్దామనుకొన్నారు. గురుదత్ను రెండేళ్లు ఆగమన్నారు. గీతాను హాజీ మలాంగ్‌కు తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకొనేదీ లేనిదీ తేల్చమన్నాడు. తల్లిదండ్రుల నెదిరించి గీతా యితన్ని పెండ్లాడింది.
26-5-1953న పెళ్లి జరిగింది. గురుదత్‌కి 27, గీతాకు 22. 1946లో బెంగాలీ నేపథ్య గాయనిగా చిత్రరంగంలో ప్రవేశించిన గీతా అప్పటికే బెంగాలీ, హిందీ భాషల్లో ప్రముఖ గాయని. ఆదాయం వేలల్లో ఉండేది. గురుదత్ ఆదాయం తక్కువ, కుటుంబ బాధ్యతలు ఎక్కువ. గీతా స్వభావతః ఉదార స్వభావురాలు. డబ్బు సంపాదిస్తోందని ఆమె తల్లిదండ్రులు నెత్తిన పెట్టుకోవడంతో అహంభావం పెరిగింది. పెళ్లికి ముందు అమ్మానాన్నా పెట్టిన నియమ నిబంధనలు పెళ్లయ్యాక భర్త పెట్టకపోవడంతో ఆమె ధారాళంగా ఖర్చు పెట్టేది. భజనరాయుళ్లు ఆమె చుట్టూ చేరి ఆమె చేత విపరీతంగా ఖర్చు చేయించేవారు. గురుదత్‌కి యీ పటాటోపం నచ్చేది కాదు.
గురుదత్ తల్లి వాసంతి పడుకొనే తన కొడుకు గురించి రాసిన ‘మై సవ్, గురుదత్’ పుస్తకంలో కొడుకు-కోడలి మధ్య తగాదాలు విపులంగా రాసింది. ఇద్దరూ మొండివాళ్లే అన్నది. గీతా క్రమంగా పాడడం మావేయడానికి (భర్త సినిమాలకు మాత్రం పాడేది) గురుదత్‌ని తప్పుపట్టడం అన్యాయమన్నది. గీతా విపరీతంగా తాగేది. గురుదత్‌కి ఆడవాళ్లు తాగడం నచ్చదు. భర్త వహీదాను మెచ్చుకోవడం చూసి ఆమెతో పోటీపడ నారంభించింది గీతా. ‘నేను మాత్రం నటించలేనా?’ అన్న పంతం పెంచుకొంది. చుట్టూ ఉన్న స్నేహితురాళ్లు ఎగదోసేవారు.
ఆమె పోరు భరించలేక గురుదత్ ఆమెను హీరోయిన్గా పెట్టి ‘‘గౌరి’’ అనే భారీ బజెట్ సినిమా స్కోప్ చిత్రాన్ని బెంగాలీ, హిందీలలో చాలా అట్టహాసంగా ప్రారంభించాడు. రెండు పాటల రికార్డింగు, కొద్దిరోజుల షూటింగు, ఒక పాట చిత్రీకరణ తర్వాత స్క్రిప్టు నచ్చలేదనే కారణం చెప్పి ఆపివేశాడు. పెర్ఫెక్షనిస్ట్ అయిన గురుదత్‌కి గీతా నటన నచ్చి ఉండదు. గురుదత్ మధ్యలో నిలిపివేసిన సినిమాలు అనేకం. వాటిల్లో ఇదీ ఒకటి. కానీ తమ నటిగా ఎక్కడ పేరు తెచ్చేసుకొంటుందేమోనన్న దుగ్ధతో వహీదాయే ఈ చిత్రాన్ని ఆపించేసిందని గీతా నమ్మింది, యాగీ చేసింది, మొగుణ్ని సాధించింది.
ఇక లాభం లేదని గురుదత్ శరత్‌బాబు నవల ఆధారంగా బెంగాలీలో తయారవుతున్న ‘‘అభయా ఓ శ్రీకాంత్’’ (1965) అనే సినిమాలో గీతాకు హీరోయిన్ వేషం యిమ్మనమని డైరక్టరు హరిదాస్ చటర్జీని అడిగాడు. అతను ‘‘గౌరి’’కై తీసిన సీన్లు చూసి పెదవి విరిచాడు. గీతా బదులు మాలా సిన్హాను తీసుకున్నాడు. గీతాకు యింకా కోపం వచ్చింది. తను తెరపై కనబడాలన్న కోరిక ఆమెలో చావలేదు. భర్త మరణం తర్వాత, తన 37 ఏట దిలీప్ నాగ్ దర్శకత్వం వహించిన ‘‘బధూ బరణ్’’ (1967)లో ప్రదీప్ కుమార్ సరసన ఒక ముఖ్యపాత్ర ధరించింది. సినిమాలో అజయ్ బిశ్వాస్, వికాస్ రాయ్, రాఖీ (పరిచయం) వంటి నటీనటులున్నా సినిమా ఆడలేదు.
వహీదాతో పోటీ పడాలనే తపన, అమాయకత్వం, ఉద్రేక స్వభావం, చెప్పుడు మాటలు వినడం ఆమె వైపు నుంచి వైఫల్యాలు కాగా గురుదత్ వైపు నుంచి మొండితనం, తిక్క, వహీదాతో సాన్నిహిత్యం వారిద్దరి మధ్యా ఎడబాటుకు కారణమయ్యాయి. వారికి 1954లో తరుణ్, 1956లో అరుణ్ పుట్టారు. 1962లో కూతురు నీనా పుట్టడంతో వహీదా భగ్గుమంది. భార్యను విడిచి పెట్టేసి, తనను పెళ్లాడతానని తనకు చెప్తూనే మరో పక్క కూతుర్ని కన్నాడని తెలియగానే ఆమె ‘ఇక భార్యాభర్తల బంధం మరింత గట్టిపడుతుంది. ఈ రెండు పడవల ప్రయాణపు మనిషితో యిక తెంచుకోవాల్సిందే’ అనుకుంది. ఆమె అప్పటికే తారగా ఎదిగింది.
తన కాంట్రాక్టులో ఉన్నా గురుదత్ వహీదాకు ‘‘సోల్వా సాల్’’ (1958) వంటి బయట చిత్రాల్లో నటించడానికి అనుమతి ఇచ్చాడు. వహీదాకు వృత్తిపరంగా గురుదత్ అవసరం ఇక లేకపోయింది. గురుదత్ వహీదా పై అతి నమ్మకంతో ఏడేళ్ల కాంట్రాక్టు ముగిసినా రెన్యూ చేయలేదు. వహీదా చడీచప్పుడూ కాకుండా బయటి సినిమాలు అంగీకరించ సాగింది. అది తెలిసి గురుదత్ మండి పడ్డాడు. ఇటు కూతురు పుట్టినా గీతా తన భర్తతో సర్దుకోలేదు. గొడవ వడుతూనే ఉండి, 1963లో విడిగా వెళ్లిపోయింది. గురుదత్ పని రెంటికి చెడ్డ రేవడి అయింది. అది తట్టుకోలేక వహీదా షూటింగు చేస్తున్న ‘‘ముఝే జీనే దో’’ (1963) సెట్స్ పైకి వెళ్లి ఆమెతో ఘర్షణ పడ్డాడు. హీరో, నిర్మాత ఐన సునీల్ దత్ కలగజేసుకొని చల్లబరచవలసి వచ్చింది.
ఈ చైల్డిష్ ప్రవర్తన పట్ల తనే బాధపడి, మరింత మద్యం తాగేవాడు. పిచ్చిపిచ్చి ఆలోచనలు వచ్చేవి. ఇవే అతని ఆత్మహత్యకు దారి తీశాయి. అతని మరణం గీతాను కృంగదీసింది. ఆమె కూడా విపరీతంగా తాగేది. గాయనిగా ఆమె స్థానాన్ని ఆశా భోంస్లే ఆక్రమించింది. నిరాశానిస్పృహలతో మరో 8 ఏళ్లకు తన 42వ ఏట 1972లో చనిపోయింది. తన తండ్రి గురుదత్ ఆత్మహత్య చేసుకున్నాడంటే తాను నమ్మనని, ఏదో కుట్ర ఉందని వాదించిన అతని పెద్ద కొడుకు, నిర్మాత, దర్శకుడు తరుణ్ దత్ తన 35వ ఏట 1989లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తమ్ముడు అరుణ్ తండ్రి ‘‘సాహెబ్ బీబీ ఔర్ గులామ్’’ను మళ్లీ తీద్దామని ప్రయత్నించి, విఫలుడై, విపరీతమైన మద్యపానంతో దాదాపు ఆత్మహత్య చేసుకున్నాడు. 2014లో తన 58వ ఏట పోయాడు. వాళ్ల చెల్లెలు నీనా తల్లి తరహాలో గాయనిగా పేరు తెచ్చుకుంది.
గురుదత్ గురించి యిది ఒక యింట్రో లాటిది మాత్రమే. అతని సినిమాలను గాఢంగా అభిమానించే వాళ్లు చాలామంది ఉన్నారు. అతని గురించి తెలియని వాళ్లకు ఆసక్తి రగిలించడానికి అతని వ్యక్తిగత జీవితం గురించి దీనిలో రాశాను. ఈ శతజయంతి సంవత్సరంలో అతను తీసిన అనేక మంచి సినిమాల గురించి విడివిడిగా నాలుగైదు వ్యాసాలు రాస్తాను. వాటి ద్వారా కళాకారుడిగా అతని ప్రతిభ తెలుస్తుంది.(ఫోటో – గురుదత్, వహీదా ‘‘ప్యాసా’’లో, గీతాదత్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2024)
Call boy works 8341510897
Nice tribute to Gurudutt on his birth centenary year sir… I see most of this covered in your article on Waheeda Rehman being awarded Dada Phalke award couple of years back..Sir please try to complete whatever you say you will write..We still missing Dev Ananad’s series.. Thanks again for the nice article sir
I admit it is a defect in my working style. Too many topics, I wish to write, starting some and leaving some of them midway. Very irritating, not only for the reader, but to me too. There are so many international events happening around which I wish to cover. I am always short of time but greedy to share my thoughts with readers. Anyway, stay tuned, that is what I wish to say.
So True, you should only focus writing articles on International events and publish them in Times Magazine instead of GA
So true
I want to write on several topics as I believe variety is spice of life. The reader should leave to the choice to the writer to choose the topic whatever it appeals to him at that moment. I am not a staff reporter looking after a particular desk. My arena is broad. Reader can choose from the dishes placed in front of him.
ప్యాసా సినిమా గురించి ముళ్ళపూడి వెంకటరమణ తన సమీక్ష లో బాగోలేదు అని రాసారు. శోభన్‌బాబు హీరో గా మల్లెపువ్వు పేరుతో తెలుగు లో రీమేక్ చేస్తే అవేరేజ్ గా ఆడింది కాని దాంట్లో రావుగోపాలరావు పాత్ర పాపులర్ అయింది.
భావోద్వేగాలు తో కూడిన సున్నిత కళ హృదయం,
లాభమే పరమావధి కల కర్కశ వ్యాపార రంగం.
ఈ రెండింటి చిక్కు ముడే సినిమా రంగం.
అతి కొద్ది మంది మాత్రమే ఆ సంక్లిష్టత నీ అధిగమించి కొనసాగారు. లేనివారు ఆ ముడి విప్పలేక బలయ్యారు.
Vc available 9380537747
మానసిక దౌర్భల్యం ఉన్న మనిషికి ఎన్ని కళలు ఉన్న ఉపయోగం ఏమీ ఉంది, ఇలా అందరి జీవితాలు అర్ధాంతరంగా ముగించడం తప్ప
When it comes to writing a short biographies, MBS sir does a outstanding job. He balances the article very well and provides the information as crisp as possible and easy to read. Another great work…. On Gurudatt, Pyasa songs always hunt the soul..
comment