బ్రహ్మోత్సవాల్లోగా టీటీడీ బోర్డు వేస్తారా?

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్నాయి. ఆరోజు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు మొదలవుతాయి. అయితే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో…

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్నాయి. ఆరోజు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు మొదలవుతాయి. అయితే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కనీసం బ్రహ్మోత్సవాలు మొదలయ్యేలోగా టీటీడీ బోర్డును నియమిస్తారా? అనే అనుమానాలు ఆశావహుల్లో కలుగుతున్నాయి.

కీలకమైన నామినేటెడ్ పదవుల పంపకం అయినా చేపట్టకుండా ఇప్పటికే చంద్రబాబునాయుడు మూడు నెలల కాలం వృధా చేశారనే విమర్శలు పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవులలోకి టీటీడీ చైర్మన్ పదవిని అతి పెద్దదిగా అందరూ భావిస్తారు. ఈ పదవి కోసం విపరీతమైన పోటీ ఉంటుంది. ముఖ్యమంత్రి మీద ఒత్తిడిలు కూడా చాలా ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో టీవీ5 న్యూస్ ఛానల్ అధినేత బి ఆర్ నాయుడు ను టీటీడీ చైర్మన్ గా చేయబోతున్నట్లు చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి.

అయితే బిఆర్ నాయుడుకు ఆ పదవి కట్టబెట్టడం పట్ల పార్టీలోని కొందరు సీనియర్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఆయనకు పదవి ఇస్తే గనుక ఒక మీడియా ఛానెల్ తో అనైతిక బంధం కలిగి ఉంటూ తమ ప్రచారానికి వాడుకున్నారనే రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణలను నిజం చేసినట్లు అవుతుందని వారు సూచిస్తున్నారు. పైగా బిఆర్ నాయుడుకు ఇంత కీలకమైన పదవి కట్టబెడితే.. ఎన్నికల సమయంలో తమకు సహకరించిన ఇతర మీడియా సంస్థల యజమానుల నుంచి కూడా నామినేటెడ్ పోస్టుల కోసం పెద్ద ఎత్తున ఒత్తిళ్లు తప్పవని కూడా వారు చెబుతున్నారు.

ఈ అభ్యంతరాలు కూడా సబబైనవే కావడంతో చంద్రబాబు నాయుడు పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఈ నేపద్యంలోనే నామినేటెడ్ పదవుల పందేరం అలా వెనక్కి వెళ్తుంది. టిటిడి పదవుల కోసం ఢిల్లీ స్థాయిలో కూడా తీవ్రమైన ఒత్తిడిలు చంద్రబాబు మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా ఇప్పుడు పదవులను మూడు పార్టీల వారికి పంచవలసిన బాధ్యత ఉండటంతో ఇంకా ఇబ్బంది తప్పడం లేదు. వాటిని సంయమనం చేసుకోలేక ఆయన సతమతం అవుతున్నారు.

కనీసం నెల రోజుల్లోగా అయిన టిటిడి పాలకమండలిపై కసరత్తు పూర్తి చేసి ప్రకటిస్తే బాగుంటుందని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతుంది. లేకపోతే కనీసం చైర్మన్ ఒక్కరి పేరు ప్రకటించి బ్రహ్మోత్సవాలు మొదలయ్యేలోగా ఆ లాంఛనం పూర్తి చేయాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఈ ఒత్తిళ్ళను ఎలా సర్దుబాటు చేసుకుంటారో బ్రహ్మోత్సవాల్లోగా పాలకమండలి నియమిస్తారో లేదో చూడాలి.

4 Replies to “బ్రహ్మోత్సవాల్లోగా టీటీడీ బోర్డు వేస్తారా?”

Comments are closed.