సినీ’పంచ్‌’తంత్రం-1

సినిమా ర‌చ‌యిత‌లు రెండు ర‌కాలు. ర‌చ‌యిత‌లు, ర‌చ‌యిత‌ల‌మ‌ని చెప్పుకునే వాళ్లు. ఇద్ద‌రికీ ఒకే గౌర‌వం. డ‌బ్బులివ్వ‌రు. Advertisement ర‌చ‌యిత‌లు కాస్తోకూస్తో చ‌దువుకుని వుంటారు. నాలుగు సినిమాలు చూసి వుంటారు. తెలుగు కూడా వ‌చ్చే వుంటుంది.…

సినిమా ర‌చ‌యిత‌లు రెండు ర‌కాలు. ర‌చ‌యిత‌లు, ర‌చ‌యిత‌ల‌మ‌ని చెప్పుకునే వాళ్లు. ఇద్ద‌రికీ ఒకే గౌర‌వం. డ‌బ్బులివ్వ‌రు.

ర‌చ‌యిత‌లు కాస్తోకూస్తో చ‌దువుకుని వుంటారు. నాలుగు సినిమాలు చూసి వుంటారు. తెలుగు కూడా వ‌చ్చే వుంటుంది. ర‌చ‌యిత‌ల‌ని చెప్పుకునే వాళ్లు చ‌దువుకోరు. సినిమాలు చూసి , సినిమాల‌కి రాయాల‌ని అనుకుంటారు. తెలుగు కాదు క‌దా, ఏ భాషా రాదు. పాన్ ఇండియా స్థాయి.

నిజానికి ఇప్పుడు ర‌చ‌యిత‌ల అవ‌సరం కూడా లేదు. డైరెక్ట‌ర్లే అన్నీ రాసేసి తీసేసుకుంటున్నారు. నిర్మాత‌లు మూసేసుకుంటున్నారు. డైరెక్ట‌ర్‌కి ఏం కావాలో, డైరెక్ట‌ర్‌కే తెలియ‌న‌ప్పుడు, ఇక ప్రేక్ష‌కుల‌కి ఏం తెలుస్తుంది?

హైద‌రాబాద్‌కి రోజూ బ‌స్సులు, రైళ్లు వ‌స్తూ వుంటాయి. సినీ ర‌చ‌యితలు కావాల‌నుకునే వాళ్లు ఒక ట్రాలీ సూట్ కేసుతో డ‌జ‌ను మంది దిగుతారు. కృష్ణా న‌గ‌ర్‌లో లేదంటే యూస‌ఫ్‌గూడా బ‌స్తీలో ఆశ్ర‌యం పొంది, మొద‌టిరోజు మందు పార్టీ చేసుకుని, రెండో రోజు తెల్ల కాగితాలు, పెన్నులు, అట్ట కొనుక్కుని, మూడోరోజు ర‌చ‌యిత కావాలంటే 32 మార్గాలు అనే పుస్త‌కం చ‌దివి , రెండు నెల‌ల త‌ర్వాత చార్జీల‌కి అప్పు చేసి వెళ్లిపోతారు.

వీళ్ల‌లో కూడా కొంచెం హైఫై వుంటారు. ఇంగ్లీష్ మాట్లాడుతూ లెద‌ర్ బ్యాగ్‌లో నుంచి ల్యాప్‌టాప్ తీసి , గూగుల్ చూసి, కాఫీ షాపుల్లో డిస్క‌ష‌న్ చేస్తూ వుంటారు. వీళ్ల దగ్గ‌ర చాలా క‌థ‌లుంటాయి. దాంట్లో క‌థే వుండ‌దు. కొంత కాలానికి క‌థ‌లు దిగిపోతాయి, డ‌బ్బులు అయిపోతాయి. స్నేహితులు ఫోన్ ఎత్త‌రు. ఇండ‌స్ట్రీని ఆర్గానిక్ తిట్లు తిట్టి వెళ్లిపోతారు. తెలుగు సినిమాకి ర‌చ‌యిత‌ల అవ‌స‌రం లేద‌ని, టీ మాస్టార్లు వుంటే చాల‌ని నిందించి అర్ధ‌రాత్రి ఆరెంజ్ ట్రావెల్స్ ఎక్కుతారు.

కాఫీలో క‌ర‌గ‌ని చక్కెర‌ ప‌లుకుల్లా కొంద‌రు వుండిపోతారు. ఆముదం కంటే జిడ్డు. ర‌చ‌యిత‌కి రాయ‌డం ఆఖ‌రి అర్హ‌త‌ని గ్ర‌హిస్తారు. అమీబాలా రూపం మార్చుకుంటారు. ఈ ప‌రావ‌ర్త‌నం వెనుక రీళ్ల కొద్ది అనుభ‌వాలుంటాయి. వీళ్లు ఇంటికి వెళ్ల‌రు. అక్క‌డ పాత తెలుగు సినిమా వుంటుంది. గుమ్మ‌డిలా అపుడ‌పుడు ద‌గ్గుతూ , సాయంత్రానికి క్వార్ట‌ర్ తాగే తండ్రి, సీరియ‌ల్స్ చూసి వెక్కివెక్కి ఏడ్చే త‌ల్లి. రీల్స్ చేసి లైక్స్ కోసం ఎదురు చూసే చెల్లి. జీవితం గేవా క‌లర్‌లో క‌నిపించి, డెలివ‌రీ బాయ్ లేదా క్యాబ్ డ్రైవ‌ర్‌లా మ‌నుగ‌డ సాగించాల్సిన ప‌రిస్థితి ప్లాష్ క‌ట్స్‌లా వ‌స్తుంటే , గూగుల్ మ్యాప్‌లోని గీత‌లు ఎన్నాళ్లు చూసినా గీత మార‌దు కాబ‌ట్టి హైద‌రాబాద్ వ‌దిలి వెళ్ల‌డు. క‌ళామత‌ల్లి అనే కొత్త ప‌దం నేర్చుకుని కంఠ‌స్థం చేస్తుంటాడు.

సినిమా ఆఫీసులు తిరిగి హ‌వాయి చెప్పుల‌తో పాటు పాదాలు కూడా అరిగిపోయిన పాత ర‌చ‌యిత‌ని ఒక కొత్త రచ‌యిత క‌లిశాడు. పాత ర‌చ‌యిత‌కి పేరు రాలేదు. కొత్త వాడికి ఇంకా పేరు లేదు కాబ‌ట్టి ఒక‌రి పేరు ఇంకొక‌రికి తెలియ‌దు. పాత ర‌చ‌యిత కాళ్ల‌కి గోరు వెచ్చ‌ని కొబ్బ‌రి నూనె రాసుకుంటూ వున్నాడు. నూనె అంట‌కుండా కాళ్ల‌కి దండం పెట్టి

“గురువు గారు , ర‌చ‌యిత‌గా మీ అనుభ‌వాలు చెప్పండి” అడిగాడు కొత్త ర‌చ‌యిత‌.
“క‌థ‌లు రాసుకోడానికి వ‌చ్చి, కొబ్బ‌రి నూనె రాసుకుంటున్నా. ఇదే నా అనుభ‌వం” అన్నాడు పాత ర‌చ‌యిత‌.
“ఏదో ఒక‌టి చెప్పండి. మీ అనుభ‌వాల నుంచి నేర్చుకుంటా”
“తెలుగు సినిమా ఒక అజ్ఞాన మూసీ న‌ది. సుంద‌రీక‌ర‌ణ పేరుతో ప్ర‌తివాడూ చెత్త క‌లుపుతుంటాడు. ఇక్క‌డ ఎవ‌రూ ఏమీ నేర్చుకోరు. అట్లాస్ భూగోళాన్ని మోసిన‌ట్టు నెత్తి మీద మూర్ఖ అజ్ఞానాన్ని బోర్లించుకునే ఎంట్రీ ఇస్తారు”
“అద్భుతం. మ‌హానుభావులు మీరు”
పాత ర‌చ‌యిత కంగారు ప‌డి “నువ్వు మీ వూళ్లో హ‌నుమాన్ భ‌క్త స‌మాజంలో ప‌ని చేశావు క‌దా?” అడిగాడు.
కొత్త ర‌చ‌యిత ఆనందంతో “కాలజ్ఞానులు మీరు. ఎలా తెలుసుకున్నారు” అన్నాడు.
“సినీ ర‌చ‌యిత‌కి కావాల్సిన మొద‌టి అర్హ‌త భ‌జ‌న‌, నీకు కాళ్లు ప‌ట్ట‌డం వ‌చ్చా”
“బ్ర‌హ్మాండంగా ప‌డ‌తానండి”
“అది రెండో అర్హ‌త‌. నీకు చాలా విష‌యాలు చెప్పాల‌ని నా మ‌న‌స్సు ఉబ్బిబ్బ‌వుతోంది”
“ఉబ్బిబ్బు కాదండి. ఉబ్బి త‌బ్బిబ్బు”
“ఎప్పుడూ ఎదుటి వాడి త‌ప్పులు స‌రిచేయ‌కు. మైన‌స్ మార్కులు ప‌డ‌తాయి. ఎవ‌డి త‌ప్పుల‌తో వాడే పోతాడు. వాడిని స‌రిచేస్తే మ‌నం పోతాం”
“క్ష‌మించండి గురువు గారు”
“క్ష‌మించాను. నీకు ర‌చ‌యిత అవ‌త్‌రాలీ తెలుసా”
“ఎపుడూ విన‌లేదు”
“నేనూ విన‌లేదు. కానీ ఆ విష‌యం చెబితే అవ‌త్‌రాలీ న‌మ్మ‌డు”
“అత‌ను ఏ దేశ‌స్థుడు సార్” అనుమానంగా అడిగాడు కొత్త ర‌చ‌యిత‌
“కాకినాడ ఇసుక‌వీధి వాస్త‌వ్యుడు. వాడిపేరు అవ‌తారం లింగ‌య్య‌. కొరియ‌న్ వెబ్ సిరీస్ చూసి పేరు మార్చుకున్నాడు”
“మ‌రి పేరు మారితే రాత మారిందా?”
“వాడికి రాయ‌డం రాదు. హ‌రి క‌థ‌లా ఏదైనా నోటికి చెబుతాడు”
“నోటి ర‌చ‌యిత‌న్న మాట‌”
“నోటి ర‌చ‌యిత‌, నోటు ర‌చ‌యిత‌గా మారాడా లేదా కొంచెం గ్యాప్ ఇచ్చి చెబుతా. ఈ లోగా నువ్వు కాళ్లు ప‌డుతూ వుండు. నేను మందు ప‌డుతూ వుంటా” అని పాత ర‌చ‌యిత ప్లాస్టిక్ గ్లాస్‌లో బుడ‌బుడ సౌండ్‌తో మందు పోసి, అందులో ఏమీ క‌ల‌ప‌కుండా గుట‌క్‌మ‌ని సౌండ్ చేసాడు.
“జీవితం 90 డిగ్రీస్‌లో ఎలాగూ వుండ‌దు. 90 ఎమ్ఎల్‌లో వుంటే అదే మ‌హా ప్ర‌సాదం” అని గుర‌క స్టార్ట్ చేసాడు.
కొత్త ర‌చ‌యిత చేతికి అంటిన తైలాన్ని తుడుచుకుంటూ దీర్ఘాలోచ‌న‌లో ప‌డ్డాడు. (Next అవ‌త్ రాలీ క‌థ‌)

జీఆర్ మ‌హ‌ర్షి

5 Replies to “సినీ’పంచ్‌’తంత్రం-1”

  1. Sarcasm apart, please mention the names of such two types of writers..Of course with no or little story content, the film industry has become more competitive & cut-throat.. With the entry of directors like Rajamouli to Puri Jagannath, the trend has changed, and they are using all marketing tricks, and convincing producers & distributors to get back their investment, trying to get spillovers as profits.. Many like you feels the film industry is dying, but it lives on phoenix-like with ‘yes or no’ story.. as the new & established writers survive with gallons of plagiarism.. or taking ideas from Korean, Iran, turkish, and even from movie festivals…

  2. రచయిత అవ్వాలంటే ముందు తెలుగు మీడియం చదవాలి , ఆలా ఎవరు ముందుగా చదవరు. తెలుగు రాని వాడు తెలుగు రచయిత ఎలా అవుతాడు.

    మీ ఎగతాళి బాగుంది.

    కోన వెంకట్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు, ఆత్రేయ గారితో షికారు కెళ్దాం గురువుగారు, అంటే, షికారు కెళ్లాలంటే “షీ , కారు” రెండు ఉండాలి అన్నారంట. ఆలా ప్రతిమాటకు చమత్కారం వెదికే వాడే రచయిత.

Comments are closed.