సినీ ‘పంచ్‌’తంత్రం -3

ట‌మార‌య్య ఒక తేనెటీగ‌. అనేక పువ్వుల నుంచి మ‌క‌రందాన్ని దొంగిలిస్తాడు. మ‌న‌వాడు క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అన్నింటికీ పేరు వేసుకుంటాడు. బావుండ‌ద‌ని ఆగిపోయాడు కానీ, ఎడిటింగ్ , సంగీతం, సాహిత్యం కూడా…

ట‌మార‌య్య ఒక తేనెటీగ‌. అనేక పువ్వుల నుంచి మ‌క‌రందాన్ని దొంగిలిస్తాడు. మ‌న‌వాడు క‌థ‌, మాట‌లు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం అన్నింటికీ పేరు వేసుకుంటాడు. బావుండ‌ద‌ని ఆగిపోయాడు కానీ, ఎడిటింగ్ , సంగీతం, సాహిత్యం కూడా త‌న కార్డు ప‌డాల‌ని కోరిక‌.

టమార‌య్య మోడస్‌ ఓప‌రాండి (ప‌ని చేసే విధానం) ఏమంటే అత‌ని ద‌గ్గ‌ర నాలుగు వాక్యాల క‌థ వుంటుంది. దానికి విస్త‌ర‌ణ కావాలి. డ‌బ్బులు అడక్కుండా ప‌ని చేసే కూలీలు ర‌చ‌యిత‌లు (ఒక‌వేళ డ‌బ్బ‌డిగితే, అది నివారించ‌డానికి 111 మార్గాలున్నాయి. 111 అంటే మూడు నామాలు. కొండ‌కి వెళ్ల‌కుండా నామాలు గీకించుకునే ప‌ద్ధ‌తి సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచి వుంది).

ఆల్రెడీ క‌థ‌లు, న‌వ‌ల‌లు రాసిన కొంచెం పేరున్న ర‌చ‌యిత‌ల్ని ఎంచుకుంటాడు. వేట‌లో రెండు ర‌కాలు. స్వ‌యంగా వెళ్లి వేటాడ‌డం, ఇది న‌క్క స్టైల్‌. బ‌లి జీవి. తానే వ‌చ్చి చిక్కుకోవ‌డం, ఇది సాలీడు శైలి. మొద‌టి ప‌ద్ధ‌తి ర‌చ‌యిత‌ల‌కి ఫోన్ చేసి, మీ ర‌చ‌న‌లంటే ఇష్టం. మిమ్మ‌ల్ని క‌లుసుకోవాలి. ఒక సినిమా డైరెక్ట‌ర్ ఫోన్‌చేసే స‌రికి అవ‌త‌లి వాడు కంగారు ప‌డి వ‌చ్చేస్తాడు.

ట‌మార‌య్య నాలుగు వాక్యాల క‌థ‌ని తీస్తాడు. అది స‌హ‌జంగా ఏ కొరియ‌న్ లేదా జ‌పాన్ సినిమానో అయి వుంటుంది. అంత ఓపిక లేక‌పోతే 1950లో వ‌చ్చిన ఎన్టీఆర్ సినిమా కూడా అయి వుండొచ్చు.

సినిమాకి క‌నీసం 70 సీన్లు, రెండున్న‌ర గంట‌లు న‌డిచే క‌థ కావాలి. ట‌మార‌య్య‌కి అంత సీన్ లేదు. ఫుల్ బాటిల్ త‌ప్ప‌, ఫుల్ క‌థ వుండ‌దు.

నాలుగు లైన్లు ర‌చ‌యిత‌కి చెప్పి, ఎండ్ టైటిల్స్ వ‌రకు క‌థ వుంద‌ని , అయితే మీరు డెవ‌ల‌ప్ చేస్తే ఎలా వుంటుందో చూడాల‌ని వుంద‌ని పంపు కొడ‌తాడు. ర‌చ‌యిత పెట్రోమ్యాక్స్ లైట్‌లా వెలుగుతాడు. చాయ్ వేడిగా వున్న‌పుడే బిస్కెట్ ప‌డాలి.

“మ‌నం క‌లిసి జ‌ర్నీ చేద్దాం”
జ‌ర్నీ అనే ప‌దం ఫీల్డ్‌లో గుడ్ డే బిస్కెట్‌.
బిస్కెట్‌లో గుడ్ డే వుంటుంది. అది ర‌చ‌యిత‌కి వ‌ర్తించ‌దు.
ర‌చ‌యిత లంగోటా బిగించి, బాటిల్ , పెన్ మూత‌లు ఒకేసారి తీసి భార్యాపిల్ల‌ల్ని అర్జెంట్‌గా పుట్టింటికి పంపి, ప‌ద్మాస‌నంతో క‌థ మీద కూచుంటాడు. ఇదే స‌మ‌యానికి న‌లుగురైదుగురు సేమ్ హాంగోవ‌ర్‌లో వుంటార‌ని ఒక‌రికొక‌రికి తెలియ‌దు. దీని మీదే ఒక సినిమా తీయొచ్చు. మ‌ళ‌యాళం “చేట”లైతే చేయ‌గ‌ల‌రు.

ఈ జ‌ర్నీలో రూల్ ఏమంటే ద‌ర్శ‌కుడి ఆఫీస్‌లో ఒక ర‌చ‌యిత వున్న‌పుడు ఇంకో ర‌చ‌యిత‌కి ప్ర‌వేశం వుండ‌దు. ఒకేసారి అనేక ప్ర‌యాణాలు తెలియ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు.

న‌లుగురు ర‌చ‌యిత‌లు క‌లిపిన పిండితో క‌థ‌కి ఒక రూపం వ‌స్తుంది. దాంతో ర‌ఫ్‌గా సింగిల్ లైన్ ఆర్డ‌ర్‌. త‌ర్వాత స్పైడ‌ర్‌మాన్‌. సినిమా పిచ్చితో డైరెక్ట‌ర్లు, ర‌చ‌యిత‌లు కావాల‌ని కొన్ని కొండ గొర్రెలు వ‌స్తుంటాయి. వాళ్ల ద‌గ్గ‌ర ఎంతోకొంత మాట‌ర్ వుంటుంది. మాట‌ర్‌తో పాటు మ్యాన్ ఈట‌ర్ ల‌క్ష‌ణాలు కూడా అవ‌స‌రం. అవి వుండ‌వు. వీళ్ల‌తో ట్రీట్‌మెంట్ వ‌ర్క్ , గుడ్డిదో, కుంటిదో స్క్రీన్ ప్లే రెడీ. ట‌మార‌య్య‌కి సినిమా నేర్ప‌రి ల‌క్ష‌ణాలు లేక‌పోయినా కూర్ప‌రి ల‌క్ష‌ణాలున్నాయి. దాంతో అంద‌రి ద‌గ్గ‌ర కొట్టేసిన క‌థ‌కి ఒక షేప్ తెస్తాడు.

ఇక డైలాగ్స్‌కీ సేమ్ ఫార్ములా. దొరికిన ప్ర‌తి మేక‌తోనూ ఒక వెర్ష‌న్ రాయిస్తాడు. ట్రావెల్‌, జ‌ర్నీ అనే కార్డు వాడి కొంద‌రు ర‌చ‌యిత‌ల్ని తోముతాడు. వాళ్లు రాసిన వెర్ష‌న్ చ‌దివి ప‌నికొచ్చే డైలాగ్‌ల్ని కాపీ చేసుకుని “మీరు బాగా రాసారు కానీ, మ‌న‌కి సెట్ కాలేదు బాస్‌. ఇంకోసారి చూద్దాం” అని ఊర‌డిస్తాడు.

ఆఫీస్ చుట్టూ తిరిగే పిల్ల ర‌చ‌యిత‌ల‌కి అదీ చెప్ప‌క్క‌ర్లేదు. ఫైన‌ల్‌గా బౌండ్ స్క్రిప్ట్. ఇంత మందిని న‌మ్మించిన వాడు నిర్మాత , హీరోని న‌మ్మించ‌లేడా?

కొంత టాలెంట్ ఉన్న కోడైరెక్ట‌ర్‌, అసోసియేట్ డైరెక్ట‌ర్ల‌తో బండి లాగించేస్తాడు. హిట్ ,ప్లాప్‌తో సంబంధం లేదు. డ‌బ్బులొస్తే చాలు. ఏడాది తిర‌క్కుండా ఇంకో నిర్మాత‌ని దివాల తీయిస్తాడు. మేనేజ‌ర్ కాదు, డైరెక్ట‌ర్ కాదు. మేనేజింగ్ డైరెక్ట‌ర్‌.

క‌థ ఆపిన జాక్‌రోజ్ మీద లింగ‌య్య‌కి కోపం వ‌చ్చింది.
“రైట‌ర్లంటే అంతోఇంతో బుద్దీజ్ఞానం వున్న వాళ్లే క‌దా. డ‌బ్బుల్లేకుండా చాకిరీ చేయించుకుంటే మోస‌పోడానికి వాళ్లేమైనా గొర్రెలా? ఎక్క‌డో కొడుతోంది” లింగ‌య్య‌ అన్నాడు.
“ప్ర‌తి జ‌వాబుకీ ప్ర‌శ్న లేక‌పోవ‌చ్చు కానీ, ప్ర‌తి ప్ర‌శ్న‌కీ ఒక జ‌వాబు వుంటుంది. ఇక్క‌డ ఎవ‌రూ అమాయ‌కులు కారు. ప్ర‌తి వాడి అంతిమ ల‌క్ష్యం డ‌బ్బే. డ‌బ్బున్న చోట దురాశ‌, న‌మ్మ‌క ద్రోహం, క‌ప‌టం, కుటిలం, దుర్మార్గం, నీచం, లాభం, న‌ట‌న‌, వంచ‌న వుంటాయి. వుండి తీరుతాయి. ర‌చ‌యిత కంటే ద‌ర్శ‌కుడిది ఎపుడూ పైచేయి. పైనున్న వాడు కింద వున్న వాన్ని సుల‌భంగా ముంచుతాడు. డ‌బ్బులు అడ‌క్కుండా వుండ‌డానికి ర‌చ‌యిత‌లు వెంగ‌ల‌ప్ప‌లు కాదు. ఎన్ని విధాలుగా అడుగు వారు వుంటే , అన్ని విధాలుగా ఎగ్గొట్టే వారు కూడా వుంటారు. ఇది తెలియాలంటే ఒంటికి ఆముదం పూసుకుని తిరిగే జిడ్డు కుమార్ క‌థ విను” అన్నాడు జాక్‌రోజ్‌.

( Next జిడ్డు కుమార్ క‌థ‌)

జీఆర్ మ‌హ‌ర్షి

2 Replies to “సినీ ‘పంచ్‌’తంత్రం -3”

  1. మహర్షిగారు మీరు బాగా రాస్తున్నారు .. మనం కలిసి జర్నీ చేద్దాం .. ఏమంటారు

Comments are closed.