విశాఖ డెయిరీ లెక్క తేల్చేస్తున్నారా?

విశాఖ డెయిరీ చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది. ఉమ్మడి విశాఖ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన దివంగత ఆడారి తులసీదాస్ చిన్న స్థాయిలో ఏర్పాటు చేసి అనంతరం భారీ సంస్థగా డెయిరీని తీర్చిదిద్దారు. ఆయన…

విశాఖ డెయిరీ చరిత్ర నాలుగు దశాబ్దాల నాటిది. ఉమ్మడి విశాఖ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన దివంగత ఆడారి తులసీదాస్ చిన్న స్థాయిలో ఏర్పాటు చేసి అనంతరం భారీ సంస్థగా డెయిరీని తీర్చిదిద్దారు. ఆయన టీడీపీకి బలమైన మద్దతుదారునిగా ఉండేవారు.

ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే టీడీపీని విశాఖ జిల్లాలో బలోపేతం చేస్తూ వచ్చారు. ఆయన ఆ మధ్య గతించారు. ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డెయిరీ చైర్మన్ అయ్యారు. ఆయన టీడీపీ నుంచి 2019లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఆ తరువాత ఆయన వైసీపీలోకి వచ్చారు. 2024లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తారు అని ప్రచారం సాగుతున్న వేళ విశాఖ డెయిరీలో అవినీతి జరిగిందని అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు

డెయిరీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందని రెవిన్యూ శాఖకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఇపుడు విశాఖ డెయిరీ అవినీతి మీద విచారణకు సభా సంఘాన్ని నియమిస్తున్నట్లుగా స్పీకర్ సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అసెంబ్లీలో విశాఖ డెయిరీ మీద చర్చ జరిగింది.

గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు రెండు వేల కోట్ల టర్నోవర్ కలిగిన విశాఖ డెయిరీలో నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. సొసైటీగా ఉన్న విశాఖ డెయిరీని కంపెనీగా మార్పు చేసిన తరువాత నుంచి అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయని చెప్పారు. విశాఖ డెయిరీకి అనుబంధంగా ట్రస్ట్ ని ఏర్పాటు చేసి రైతుల సంక్షేమం కోసం వినియోగైంచల్సిన నిధులు మళ్ళిస్తున్నారని ఆరోపించారు.

దీంతో సభా సంఘం విశాఖ డెయిరీ మీద ఏర్పాటు అయింది. సభా సంఘం విచారణ జరిపి ఏ నివేదిక అసెంబ్లీకి ఇస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. విశాఖ డెయిరీ ఒకనాడు టీడీపీకి మద్దతుగా ఉంటూ వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఆ డెయిరీకి రావడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు.

4 Replies to “విశాఖ డెయిరీ లెక్క తేల్చేస్తున్నారా?”

Comments are closed.