చంద్రబాబు పాలన అంటే.. అందమైన నినాదాలుంటాయి. ఆచరణ సంగతి దేవుడెరుగు. బాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరును అసెంబ్లీలో ప్రకటించే సందర్భంలో నవ నగరాల గురించి ప్రకటించారు. బహుశా అందరికీ గుర్తుండే వుంటుంది. ఐదేళ్లు చంద్రబాబు అధికారంలో కొనసాగారు. నవ నగరాలు ఏమయ్యాయో ఆయనకే తెలియాలి.
విజన్ -2020 పోయి, ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ -2047 తెరపైకి వచ్చింది. వినడానికి ఎంత ముద్దుగా వుందో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాబు పాలనా? మజాకా? చేతిలో మీడియా సంపత్తి ఉన్న తర్వాత, ఆ మాత్రం ఎలివేషన్ చేసుకోకుండా ఎలా వుంటారు? ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్ర చేస్తానంటే వద్దనేది ఎవరు? ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్‌పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సంతకాలు చేస్తున్న ఫొటో మాత్రమే మీడియాలో కనిపించింది. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షమైన బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కనిపించకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో కూడా ఆమె లేరు. కూటమి ప్రభుత్వంలో మంత్రి సత్యకుమార్ బహుశా బీజేపీ నుంచి ప్రాతినిథ్యం వహించారని వూహించుకోవాలేమో!
ఎన్నికల ముందు కూడా కూటమి మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదని బీజేపీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు చెబుతున్న స్వర్ణాంధ్ర విజన్ 2047తో తమకు సంబంధం లేదని బీజేపీ చెప్పకనే చెప్పిందని అర్థం చేసుకోవాలా? అనే ప్రశ్న జనాల నుంచి వస్తోంది. మామూలు ఆంధ్రా కూడా కాదు, స్వర్ణాంధ్ర విజన్‌లో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి భాగస్వామి కాకపోవడం చర్చనీయాంశమైంది.