అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఏపీ సర్కార్ సమాధానంగా 190 పేజీల అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో పలు సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. సీఆర్డీఏ చట్టం ప్రకారం పనులు పూర్తి చేసేందుకు నాలుగేళ్ల సమయం కావాలని ఏపీ సర్కార్ గడువు కోరడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ పేరుతో ఏపీ సర్కార్ మూడు రాజధానులను తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం చట్టాలను కూడా చేసింది.
ఈ చట్టాలపై వ్యతిరేకంగా పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సాగుతుండగా, ప్రభుత్వం సదరు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు హైకోర్టుకు తెలిపింది. దీంతో విచారణ ఆగిపోయింది. అయితే ఏపీ హైకోర్టు మాత్రం గత నెల 3న సంచలన తీర్పు వెలువరించింది. దీంతో ప్రభుత్వం షాక్‌కు గురైంది. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని త్రిసభ్య ధర్మాసనం తేల్చి చెప్పింది. లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని పేర్కొంది.
ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాల్సిందేనని, రైతులకు మూడు నెలల్లో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలని ఆదేశించింది. అభివృద్ది పనులపై ఎప్పటికప్పుడు తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. రాజధాని కోసం తప్ప భూములను ఇతర అవసరాలకు ఉపయోగించకూడదని స్పష్టంగా చెప్పింది.
హైకోర్టు తీర్పుపై నెలలోపు తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన నేపథ్యంలో, గడువు సమీపించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ 190 పేజీల అఫిడవిట్ దాఖలు చేశారు. గత ప్రభుత్వం మొదలు పెట్టిన పనులను పూర్తి చేయాలంటే 2024, జనవరి వరకూ గడువు కావాలని ప్రభుత్వం కోరింది. అలాగే అమరావతి నిర్మాణానికి గత ప్రభుత్వం బ్యాంకుల నుంచి తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే భారమవుతోందని పేర్కొంది. సంక్షేమ రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, రాజధాని నిర్మాణానికి నిధుల కొరత ఉన్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
సీఆర్డీఏ చట్టం ప్రకారం పనులు పూర్తి చేసేందుకు నాలుగేళ్ల సమయం కావాలని అఫిడవిట్లో ప్రభుత్వం కోరింది. గత ప్రభుత్వం అమరావతిలో 42వేల కోట్ల పనులకు గ్రౌండ్ చేసిందని న్యాయస్థానం దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని అఫిడవిట్లో పేర్కొంది. ఈ తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్లాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాల్సి ఉందని సీఎస్ తెలిపారు. ఇలా అనేక అంశాలు సదరు అఫిడవిట్లో ఉన్నట్టు సమాచారం.