నా రాజ‌కీయ మార్గంపై త్వ‌ర‌లో…!

సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. త్వ‌ర‌లో త‌న రాజ‌కీయ మార్గంపై చెబుతాన‌ని మ‌న‌సులో మాట వెల్ల‌డించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) సీఎం అభ్య‌ర్థిగా ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌ర‌లో…

సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయాల్లో కొన‌సాగ‌డంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. త్వ‌ర‌లో త‌న రాజ‌కీయ మార్గంపై చెబుతాన‌ని మ‌న‌సులో మాట వెల్ల‌డించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) సీఎం అభ్య‌ర్థిగా ల‌క్ష్మీనారాయ‌ణ త్వ‌ర‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల‌పై ఆయ‌న అభిప్రాయాలకు ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

తాను రాజకీయాల్లో కచ్చితంగా కొనసాగుతానని ల‌క్ష్మీనారాయ‌ణ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. ఎప్పుడు, ఎలా అనేది త్వ‌ర‌లో మీడియాకు చెబుతాన‌ని ఆయ‌న అన్నారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కేసుల విచార‌ణాధికారిగా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఎల్లో మీడియా విప‌రీత ప్ర‌చారం క‌ల్పించింది. ఆ త‌ర్వాత ఆయ‌న ఐపీఎస్ అధికారిగా వీఆర్ఎస్ తీసుకున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన‌లో చేరి విశాఖ‌ప‌ట్నం పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాజ‌కీయాల‌కే పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాన‌ని ఇచ్చిన హామీకి ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌ట్టుబ‌డ‌కుండా, సినిమాల్లో బిజీ కావ‌డాన్ని నిర‌సిస్తూ ల‌క్ష్మీనారాయ‌ణ జ‌న‌సేన నుంచి బ‌య‌టికొచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న రైతుగా సేంద్రీయ వ్య‌వ‌సాయంపై దృష్టి సారించారు.

మ‌రోవైపు వ‌ర్త‌మాన‌, భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై వివిధ మీడియా సంస్థ‌ల వేదిక‌గా త‌న అభిప్రాయాల‌ను ఆయ‌న పంచుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆప్‌పై అభిమానం పెంచుకున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేజ్రీవాల్‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. 

తెలుగు రాష్ట్రాల్లో పాగా వేయాల‌ని భావిస్తున్న ఆప్‌…. ల‌క్ష్మీనారాయ‌ణ లాంటి వారి నేతృత్వంలో వెళితే బాగుంటుంద‌ని భావిస్తున్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది. ల‌క్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ పంథాపై చ‌ర్చ ఎలా వున్నా… భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌పై ఆయ‌నే వివ‌రిస్తే బాగుంటుంది.