వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు పగటి కలలు ఎక్కువయ్యాయి. రోజూ ఏవో ఆయన కలలు కనడం, అవే నిజం అనుకుని మీడియా ముందుకొచ్చి మాట్లాడ్డం దినచర్యగా మారింది. తాజాగా ఆయన ఏపీలో ముందస్తు ఎన్నికలపై పగటి కల కన్నారు. వెంటనే అదే విషయాన్ని లోకానికి చెప్పి, నెత్తిన భారాన్ని దించుకునేందుకు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఆగస్టులో జగన్ ప్రభుత్వం రద్దు అవుతుందనేది ఆయన మాటల సారాంశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా వుందని, ఇక అప్పులు పుట్టే పరిస్థితులు కూడా లేవని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తారనేది రఘురామ ఉద్దేశం. అప్పు లేనిదే ఒక్కరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం నడవలేని దయనీయ స్థితిలో ఉందని, తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. దొంగ ఓట్లు ఎక్కించడానికి కూడా ముందస్తు ఎన్నికలే కారణమని ఆయన సెలవిచ్చారు.
ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీలకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. ఎప్పటికప్పుడు తమ ఓట్లు ఉన్నాయో లేదో చూసుకోవాలని కోరారు. ఇంతకూ రఘురామ ఓటు ఉందో, లేదో చూసుకుంటే మంచిదని నెటిజన్లు హితవు చెబుతున్నారు. ఏపీలో అడుగు పెట్టడానికి భయపడే రఘురామ, రాజకీయానికి మాత్రం ఆ రాష్ట్రాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. కనీసం ఎన్నికల్లో అయినా పోటీ చేయడానికి ఏపీకి వస్తారో, రారో మరి!
మాటలు కోటలు దాటిపోయేలా మాట్లాడుతున్న రఘురామ, ఏపీలో అడుగు పెట్టడానికి గజగజ వణికిపోతున్నారు. ఈ మాత్రం దానికి అంత ఓవర్ యాక్షన్ ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమైంది. అయినా కొందరు ఎప్పటికీ మారరు. అలాంటి వారిలో రఘురామ ఒకరు. పగటి కలలతో కాలం వెళ్లదీయడానికే ఆయన నిర్ణయించుకున్నారు.