చేదు జ్ఞాప‌కాల్ని మిగిల్చిన అమిత్ షా!

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖకు వచ్చార‌ని బాగా గుర్తు పెట్టుకునేందుకు ఓ చేదు జ్ఞాప‌కాన్ని మిగిల్చార‌ని కార్మికులు వాపోతున్నారు. మోదీ స‌ర్కార్ పాల‌న 9 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌మ గొప్ప‌ల్ని…

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశాఖకు వచ్చార‌ని బాగా గుర్తు పెట్టుకునేందుకు ఓ చేదు జ్ఞాప‌కాన్ని మిగిల్చార‌ని కార్మికులు వాపోతున్నారు. మోదీ స‌ర్కార్ పాల‌న 9 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌మ గొప్ప‌ల్ని చాటుకునేందుకు బీజేపీ దేశ వ్యాప్తంగా స‌భ‌లు నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా ఆ పార్టీ వ‌రుస‌గా స‌భ‌లు నిర్వ‌హించింది. శ్రీ‌కాళ‌హ‌స్తిలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌కు జేపీ న‌డ్డా, విశాఖ స‌భ‌కు అమిత్ షా హాజ‌ర‌య్యారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు గ‌త 9 ఏళ్ల‌లో ఐదు ల‌క్ష‌ల కోట్ల‌కు పైగా నిధులు మంజూరు చేసిన‌ట్టు విశాఖ వేదిక‌గా అమిత్ షా ప్ర‌క‌టించారు. ఈ నిధుల‌న్నీ ఏమ‌య్యాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ పాల‌నంతా అవినీతిమ‌యం అని ఆయ‌న ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. తామేదో ఏపీని ఉద్ధ‌రించిన‌ట్టు ఆయ‌న చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం చేసిన మంచి సంగ‌తేమో గానీ, చెడు మాత్రం చాలా చేసింద‌ని ఏపీ ప్ర‌జానీకం గుర్తించుకుంది.

అమిత్ షా విశాఖ‌లో కాలు పెట్టారో లేదో, అప్పుడే స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మ‌కానికి రంగం సిద్ధ‌మైంద‌న్న వార్త ఏపీ ప్ర‌జానీకానికి షాక్ ఇచ్చింది. విశాఖ హెచ్‌బీ కాల‌నీలోని 22.9 ఎక‌రాల్లో ఉన్న 588 క్వార్ట‌ర్లు, అలాగే ఆటో న‌గ‌ర్‌లోని 2 ఎక‌రాల ప‌రిధిలోని 76 ఇళ్లు, పెద‌గంట్యాడ‌లోని 434 చ‌ద‌ర‌పు గ‌జాల్లోని అమ్మ‌కానికి పెడుతూ స్టీల్ ప్లాంట్ ప‌రిపాల‌న విభాగం ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

విశాఖ ఉక్కు – ఆంధ్రుల హ‌క్కు నినాదంతో సాధించుకున్న స్టీల్ ప‌రిశ్ర‌మ‌ను, రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా అమ్మ‌డ‌మేనా కేంద్రం చేసిన సాయం అంటూ ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి. అమిత్ షా వ‌చ్చిన సంద‌ర్భంలో స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మ‌కం విష‌యం వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం. ఏపీకి కేంద్రం చేసిన మేలు కంటే, ద్రోహం గురించి ఎంతైనా చెప్పొచ్చ‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.