నిఖిల్ ఇప్పుడు మామూలు హీరో కాదు, పాన్ ఇండియా హీరో. ఇతడి నుంచి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే అతడి తాజా చిత్రం స్పై తెరకెక్కింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెలాఖరుకు రిలీజ్ కూడా పెట్టుకున్నారు. అంతలోనే ఊహించని సమస్య వచ్చి పడింది.
హీరో-నిర్మాత మధ్య సినిమా విడుదలపై సమస్య తలెత్తింది. నెలాఖరుకు రిలీజ్ వద్దంటున్నాడు నిఖిల్. ప్రమోషన్ కు టైమ్ సరిపోదు కాబట్టి, పోస్ట్ పోన్ చేద్దామనేది అతడి వాదన. అటు నిర్మాత ఈక్వేషన్స్ మరోలా ఉన్నాయి.
ఈ సినిమాను ఇంతకుముందే ప్రకటించిన తేదీకి కచ్చితంగా విడుదల చేయాలి. ఈ సినిమాను భారీ మొత్తానికి దక్కించుకుంది అమెజాన్ ప్రైమ్. ఇప్పుడు విడుదల వాయిదాపడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది.
అందుకే విడుదల తేదీని వాయిదా వేయడానికి నిర్మాత ఇష్టపడడం లేదు. పైపెచ్చు ఆఘమేఘాల మీద ఓ సాంగ్ ను కూడా విడుదల చేశారు. జూన్ 29న థియేటర్లలోకి వస్తున్నామంటూ అందులో మరోసారి ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారానికి నిఖిల్ దూరంగా ఉన్నాడు. కనీసం ట్వీట్ కూడా చేయలేదు.
ఇలా ఆఖరి నిమిషంలో నిర్మాతలకు తలనొప్పులు తెచ్చిపెడతాడనే టాక్ నిఖిల్ పై ఎప్పట్నుంచో ఉంది. నిర్మాతల గురించి, సినిమా బిజినెస్ గురించి ఆలోచించకుండా.. తన సొంత ప్రయోజనాలకు నిఖిల్ ప్రాధాన్యం ఇస్తాడంటూ గతంలో కూడా కథనాలొచ్చాయి.
టీజర్ కు వచ్చిన భారీ రెస్పాన్స్ తో చాలామంది సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నిఖిల్ వ్యవహారశైలితో రిలీజ్ కు ఇబ్బందులు తలెత్తేలా ఉన్నాయనేది నిర్మాత వాదన.
ప్రస్తుతానికైతే షెడ్యూల్ ప్రకారమే విడుదలకు వెళ్లాలనేది నిర్మాత ఆలోచన. అయితే హీరో సహకారం లేకుండా, డబ్బింగ్ పనులు పూర్తికాకుండా, ఇది సాధ్యం కాదు. మరికొన్ని రోజుల్లో అన్నీ సెటిల్ అవుతాయని ఆశిస్తున్నాడు నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి.