రాజ‌కీయాల్లో గెస్ట్ ఆర్టిస్ట్ లు

సినిమాల్లోనే కాదు, రాజ‌కీయాల్లో కూడా గెస్ట్ ఆర్టిస్ట్ లు వుంటారు. మామూలు టైమ్ లో వీరు ఎక్కడ వుంటారో? ఏం చేస్తుంటారో? వీరి ఆదాయ మర్గాలేమిటో అస్సలు ఆచూకీ అందదు. కానీ విలాసంగా బతికేస్తుంటారు.…

సినిమాల్లోనే కాదు, రాజ‌కీయాల్లో కూడా గెస్ట్ ఆర్టిస్ట్ లు వుంటారు. మామూలు టైమ్ లో వీరు ఎక్కడ వుంటారో? ఏం చేస్తుంటారో? వీరి ఆదాయ మర్గాలేమిటో అస్సలు ఆచూకీ అందదు. కానీ విలాసంగా బతికేస్తుంటారు. పిల్లల్ని విదేశాల్లో చదివించేస్తూ వుంటారు. వీళ్ల పని ఒక్కటే వున్నట్లుండి రాజ‌కీయ తెరమీదకు రావడం. ప్రెస్ మీట్ లు పెట్టడం, వైకాపా ను, జ‌గన్ ను కడిగి పారేయడం. మళ్లీ ఆ వెంటనే కలుగులోకి వెళ్లిపోయి దాక్కోవడం.

మామూలుగానే ఏదో ఒక పనో, వ్యాపారమో చేస్తే తప్ప సంసారం గడవదు. కానీ ఆంధ్రలో కనిపించే ఈ పొలిటికల్ గెస్ట్ ఆర్టిస్ట్ లు మాత్రం ఏ పనీ చేయరు. కానీ బాగానే గడచిపోతుంటుంది. ఓ గెస్ట్ ఆర్టిస్ట్ వున్నారు. ఆయన అప్పడప్పుడు అంటే ఆర్నెల్లకు మూడ్నెల్లకు అవసరం అయినపుడు చటుక్కున ప్రెస్ మీట్ పెడుతుంటారు. 

చంద్రబాబుకు మద్దతుగా జ‌గన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. ఇతగాడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. జ‌నాలకు తెలిసినంత వరకు దాదాపు పదేళ్లుగా ఇతనికి ఏ ఆదాయ మార్గమూ లేదు. కానీ ఎలా నెట్టుకొస్తున్నారో ఆయనకే తెలియాలి.

ఇంకో ఆయన వున్నారు. ఈ మేధావి వర్గం అని ఆయనకు ఆయనే ప్రకటించుకున్నారు. గత ఎన్నికల్లో ప్రథి పట్టణంలో, ప్రతి కూడలిలో జ‌గన్ కు వ్యతిరేకంగా బాబుకు మద్దతుగా వుండేలా నర్మ గర్భంగా ఉపదేశం తయారు చేసి, నలుగురికి కనిపించేలా వుంచారు. 

పదమూడు జిల్లాల్లో ఇన్ని ప్లకార్డులు పెట్టించాలంటే చాలా ఖర్చవుతుంది. కానీ ఈయన ఆదాయ మార్గం కూడా ఎవరికీ తెలియదు. మామూలు రోఙుల్లో ఏం చేస్తారో తెలియదు. ఉన్నట్లుండి టీవీ చర్చల్లో, ప్రెస్ మీట్ ల్లో ప్రత్యక్షం అవుతుంటారు.

మరొకాయన వున్నారు. ఈయన పార్టీని జ‌నం మరిచిపోయి చాలా కాలం అయింది. అంటే కార్యకర్తలు లేని పార్టీకి నాయకుడు అన్నమాట. ఈయన సంపాదన మార్గం కూడా ఎవ్వరికీ తెలియదు. తెలిసింది ఒక్కటే వీలయినంత తరచు జ‌గన్ ను, వైకాపాను తిట్టి తూర్పారపట్టడమే.

ఇలాంటి ఆయనే మరోకరు వున్నారు. ఆయన ఉద్యోగం ఊడిపోయి దశాబ్ధకాలం అయిపోతోంది. అప్పటి నుంచి అదృశ్యంగా వుంటున్నారని టాక్. మరి సంపాదన ఏలా వస్తుందో తెలియదు కానీ తెర వెనుక తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు రావడం కోసం ఆయన వంతు కృషి చేస్తూనే వుంటారు.

గమ్మత్తేమిటంటే వీరంతా ఒక్కసారిగా తెరపైకి రారు. ఒకరి తరువాత ఒకరు ఓ షెడ్యూలు ప్రకారం వస్తుంటారు. వారికి నిర్దేశించిన డ్యూటీ చేసి మళ్లీ సైలంట్ అయిపోతూ వుంటారు. వీరికి ఈ షెడ్యూలు ఎవరిస్తారో? ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తాయో, ఎలా సంపాదన వుంటుందో అంతా ఎవరికీ తెలియదు. 

ఒక్కటి మాత్రం పక్కా. బయటకు వచ్చి గొంతు విప్పారంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడడం లేదా ఙగన్ ను తిట్టిపోయడం. ఇది ఫిక్స్.