ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ మౌనదీక్షకు దిగింది. అది కూడా ప్రియుడి ఇంటి ఎదురుగా మౌనపోరాటం చేపట్టింది. ఆ యువతికి వివిధ వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఓ రాంగ్ కాల్ చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీసిందో గుణపాఠం నేర్పుతున్న ఘటన గురించి తెలుసుకుందాం.
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపలతికి చెందిన సంకనేని సునందకు వరంగల్ అర్భన్ జిల్లా భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో యువకుడైన రమేశ్‌కు నాలుగేళ్ల క్రితం సినిమాటిక్‌గా పరిచయం ఏర్పడింది. ఓ రాంగ్ కాల్ వాళ్లిద్దరి మధ్య పరిచయానికి పునాది వేసింది. ఫోన్లో కలిసిన మాటలు స్నేహంగా, కాలం గడిచేకొద్ది ప్రేమగా రూపాంతరం చెందింది.
ఈ నేపథ్యంలో రమేశ్ ఆర్మీ జవాన్‌గా ఎంపికయ్యాడు. సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగేవారు. మనసులు కలవడంతో మనుషులు కూడా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలకడంతో సర్వస్వం అతనికి అప్పగించినట్టు బాధిత యువతి చెబుతోంది.
ఇటీవల ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో సునందకు అనుమానం వచ్చి రమేశ్ ఇంటికెళ్లి ఆరా తీసింది. రమేశ్‌కు వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయమైందన్న విషయం తెలిసి సునంద ఆవేదన వ్యక్తం చేస్తోంది.
దీంతో తనకు రమేశ్‌తో పెళ్లి చేయాలని, లేకపోతే ఆత్మహత్యే గతి అని చంటయపల్లిలోని ప్రియుడి ఇంటి ఎదుట సునంద మౌనపోరాటానికి దిగింది. సునంద మౌనపోరాటానికి పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. కాగా యువతి పోరాటం గురించి తెలిసి ముల్కనూర్ ఎస్సై రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని రమేశ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.